రాయదుర్గం: కట్టుకున్న భార్యను గొడ్డలితో దారుణంగా హత్య చేశాడో భర్త. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కెంచానపల్లిలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన చిట్టెమ్మ (24) కు ఉరవకొండ మండలం బెళుగుప్పకు చెందిన రాజాతో ఆరేళ్ల క్రితం పెళ్లాడింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.
మొహరం పండగ సందర్భంగా భర్త, కుమారుడితో కలసి చిట్టెమ్మ కొన్ని రోజుల క్రితం కెంచానపల్లికి వెళ్లింది. ఈ క్రమంలో రాజా బుధవారం తెల్లవారుజామున భార్య, కుమారుడిపై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన చిట్టెమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, కుమారుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడ్ని చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు.