
తన ప్రేమకు భర్త అడ్డొస్తున్నాడని..
అనంతపురం: కట్టుకున్న భర్తనే హత్య చేయడానికి ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది ఓ ప్రబుద్ధురాలు. గతనెల 30న రాత్రి శ్రీనివాసనగర్‌లో వ్యక్తిపై జరిగిన హత్యాయత్నం కేసును త్రీటౌన్ పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నగరంలో శ్రీనివాస నగర్‌లో పసుపులేటి నగేష్, కోమలక్ష్మి దంపతులు నివాసముంటున్నారు. ఈమె నగరంలోని భాగ్యనగర్‌కు చెందిన జింకాప్రదీప్ కుమార్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
తన ప్రేమకు భర్త అడ్డొస్తున్నాడని, ఎలాగైనా వదిలించుకోవాలని ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. గత నెల 30న రాత్రి సమయంలో ఒంటరిగా ఇంటికొస్తున్న నగేష్‌ను హత్య చేయడానికి స్కెచ్ వేసింది. రైల్వేస్టేషన్‌కు సమీపంలోని షిరిడినగర్ శ్రీయ ఆస్పత్రి వద్దకు రాగానే ప్రదీప్‌కుమార్, అతని స్నేహితులు మనోజ్, పల్లం సాయిప్రసాద్‌లు కత్తులతో దాడి చేశారు. చనిపోయాడని భావించి అక్కడి నుండి పారిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులతో పాటు బాధితుని భార్య కోమలక్ష్మిని అరెస్ట్ చేశారు. వారి నుంచి కత్తి, ద్విచక్రవాహనం, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.