
చెట్లు దగ్ధమైన దృశ్యం
కొండాపురం: గుర్తుతెలియని ఆకతాయిలు చేసిన పనికి మండలంలోని సత్యవోలు పంచాయతీ లింగనపాలెం గ్రామానికి వెళ్లే రోడ్డు వెంబడి ఉన్న జామయిల్, టేకు, మామిడి, తాటి చెట్లు దగ్ధమయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ఆకతాయిలు నిప్పు వేయండంలో రోడ్డుకు ఇరువైపుల ఉన్న కర్రతుమ్మ, తాటి చెట్లు సుమారు 1.50 కిలోమీటర్ వరకు పూర్తిగా బూడిదయ్యాయి. అలాగే జామయిల్, మామిడి, టేకు చెట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గ్రామస్తులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకుండాపోయింది. వింజమూరు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందజేశారు.
నిమ్మతోట
వింజమూరు: స్థానిక బీసీకాలనీకి చెందిన లక్కు రమణయ్య అనే వ్యక్తి నిమ్మతోట ఆదివారం అగ్నికి ఆహుతైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం సంభవించిందని బాధితుడు తెలిపారు. తోటలోని డ్రిప్‌పైపులు, స్టార్టరు, 20 నిమ్మ చెట్లు కాలిపోయాయి. చుట్టుపక్కల పొలాల్లోని కూలీలు గుర్తించి మంటలను అదుపు చేశారు. సుమారు రూ.50,000 ఆస్తి నష్టం వాటినిట్లు బాధితుడు తెలిపాడు.
మామిడి తోట
సీతారామపురం: మండలంలోని నాగరాజుపల్లిలో 15 ఎకరాల మామిడి తోట దగ్ధమైంది. ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎస్.రమాదేవి. పి.పిచ్చమ్మ, కె.సుబ్బమ్మ, ఎన్.రత్తమ్మ, ఎం.రత్తమ్మ, పి.పెదవెంగమ్మకు 2.50 ఎకరాల చొప్పున భూమిని ఏడు సంత్సరాల క్రితం ప్రభుత్వం మంజూరు చేసింది. హార్టికల్చర్ కింద వారు మామిడి మొక్కలు నాటారు. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు వేయడంతో మామిడితోట దగ్ధమైంది. రూ.20 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని కోరుతున్నారు.
జామాయిల్ తోట
అనుమసముద్రంపేట(ఆత్మకూరు): ఆత్మకూరు మున్సిపాలిటీలోని నెల్లూరుపాళెం విజయా డెయిరీ సమీపంలో ఆదివారం జామాయిల్ తోట దగ్ధమైంది. వివరాలిలా ఉన్నాయి. డెయిరీకి సమీపంలో ఆత్మకూరుకు చెందిన మన్నెం సుబ్బారెడ్డి, డాక్టర్ వసుందరమ్మలు సుమారు 75 ఎకరాల్లో జామాయిల్ వేశారు. ఆదివారం ప్రమాదవశాత్తు మంటలు చేలరేగాయి. స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బంది సమాచారం అందించడంతో వారు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే సుమారు 15 ఎకరాల్లో జామాయిల్ దగ్ధమైంది. ప్రమాద సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అగ్నిమాపక అధికారులు పి.సుధాకరయ్య, కె.పెంచలయ్య, ఖాజామొహిద్దీన్ తదితరులు పాల్గొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment