కొండాపురం వాసుల రాస్తారోకో | kondapuram villagers rastha roko | Sakshi
Sakshi News home page

కొండాపురం వాసుల రాస్తారోకో

Published Tue, Sep 6 2016 10:16 PM | Last Updated on Mon, Sep 4 2017 12:26 PM

కొండాపురం వాసుల రాస్తారోకో

కొండాపురం వాసుల రాస్తారోకో

ఆత్మకూరు (ఎం) : ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయనున్న మోటకొండూరు మండలంలో తమ గ్రామాన్ని కలుపొద్దని మండలంలోని కొండాపురం గ్రామస్తులు మంగళవారం రాయగిరి–మోత్కూరు రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా 3 గంటలపాటు రోడ్డుపైనే బైఠాయించి, అక్కడే వంటా–వార్పు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ఆత్మకూరు (ఎం) మండలం 4 కి.మీ. మాత్రమే ఉంటుందని, మోటకొండూరు మాత్రం 18 కి.మీ. వస్తుందన్నారు. భువనగిరి ఆర్డీఓ, తహసీల్దార్‌ వచ్చి సమాధానం చెప్పాలని భీష్మించారు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు (ఎం) ఎస్‌ఐ పి.శివనాగప్రసాద్‌ సంఘటనాస్థలానికి చేరుకొని గ్రామస్తులకు ఎంత నచ్చచెప్పినా వారు ఆందోళన విరమించలేదు. అనంతరం గుండాల, మోత్కూరు ఎస్‌ఐలు మధుసూదన్‌రెడ్డి, రవికుమార్‌లు సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళన విరమించమని కోరినా వారు వినకపోవడంతో ఓ దశలో గ్రామస్తులకు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలోనే గ్రామానికి చెందిన గుడ్డేటి విష్ణు కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో గమనించిన పోలీసులు అతడిని అడ్డుకున్నారు. అనంతరం భువనగిరి సీఐ ఎ.అర్జునయ్య, తహసీల్దార్‌ లక్క అలివేలు రాస్తారోకో వద్దకు చేరుకొని అక్కడే గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. కొండాపురంను 18 కిలోమీటర్ల దూరంగా ఉన్న మోటకొండూరులో కలపడం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతారని, ఆత్మకూరు(ఎం) మండలంలోనే కొనసాగించాలని జెడ్పీటీసీ గంగపురం మల్లేశం, ఎంపీటీసీ పి.హేమలత, మాజీ జెడ్పీటీసీ పి.పూర్ణచందర్‌రాజులు కోరారు. దీంతో తహసీల్దార్‌ అలివేలు మాట్లాడుతూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. రాస్తారోకో వల్ల సుమారు కిలోమీటర్‌ మేర వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో సర్పంచ్‌ గుండు పెంటయ్య గౌడ్, ఉప సర్పంచ్‌ కొప్పుల వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ పంజాల పెంటయ్య గౌడ్, కొప్పుల మల్లారెడ్డి, పీసరి నర్సిరెడ్డి, కొండా మురళి, గుడ్డెటి భిక్షపతి, బాశెట్టి సత్యనారాయణ, కొండా పంచాక్షరి, గుండు శ్రీశైలం, కొప్పుల రాంరెడ్డి, కొప్పుల సువర్ణ, అనూష, మమత, సుశీల పాల్గొన్నారు.
మెడకు ఉరితో నిరసన
దిలావర్‌పూర్‌ (ఆలేరు) : మండలంలోని దిలావర్‌పూర్‌ను నూతనంగా ఏర్పాటయ్యే మోటకొండూర్‌ మండలంలో కలుపొద్దని కోరుతూ మంగళవారం ఆ గ్రామస్తులు మెడకు తాడు బిగించుకుని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. దిలావర్‌పూర్‌ గ్రామాన్ని  యథావిధిగా ఆలేరు మండలంలోనే కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సీస బాలరాజ్‌గౌడ్, పీఏసీఎస్‌ చైర్మన్‌ పల్లా జోగిరెడ్డి, చెక్క వెంకటేశ్, చాపల మల్లేశం, మచ్చ సత్యనారాయణ, అంజయ్య, సిద్ధులు, నరేందర్, శంకర్, కుల్లయ్య, విజయసింహారెడ్డి పాల్గొన్నారు. 
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement