pakala beach
-
పాకల బీచ్‌లో పెను విషాదం
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో గురువారం పెను విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి పండుగ అనంతరం తమ బంధువులు, స్నేహితులతో కలిసి రెండు బృందాలుగా సముద్ర స్నానానికి వచ్చినవారిలో ఆరుగురు గల్లంతయ్యారు. వారిలో ముగ్గురు మృతిచెందారు. ఇద్దరిని వారి స్నేహితులు, స్థానిక మత్స్యకారులు కాపాడారు. మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పొన్నలూరు మండలం తిమ్మపాలెం గ్రామం శివన్నపాలేనికి చెందిన నోసిన మాధవ (24), అతని భార్య నవ్య (21), పిన్ని నోసిన సువర్ణరాణి, చెల్లెలు నోసిన జెస్సిక (13), మరదలు కందుకూరు మండలం కొళ్లగుంట గ్రామానికి చెందిన కొండాబత్తిన యామిని(14), మరో 10 మంది బంధువులతో కలిసి ఆటోలో పాకల బీచ్‌కు వచ్చారు. మగవారు మూత్ర విసర్జన కోసం పక్కకు వెళ్లగా... మహిళలు ముందుగా సముద్రంలోకి దిగారు. వారు దిగిన ప్రాంతంలో చిన్నపాటి గుంతలు ఉన్నాయి. వాటిని గమనించకుండా వీరు ముందుకు వెళుతుండగా ఒక్కసారిగా అలలు ఉధృతంగా వచ్చి ముంచేశాయి. మాధవ, నవ్య, జెస్సిక, యామిని, సువర్ణరాణి సముద్రంలో కొట్టుకుపోయారు. సముద్రపు అలలపై దూరంగా నవ్య, సువర్ణరాణి తేలియాడుతూ కనిపించడంతో స్థానిక మత్స్యకారుడు సైకం శ్రీను, మాధవ స్నేహితుడు విశాల్ పడవలో వెళ్లి వారిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. కొద్దిసేపటి తర్వాత మాధవ, జెస్సిక, యామిని మృతదేహాలు అలలపై కనిపించడంతో పోలీసులు బయటకు తీసుకొచ్చి కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా, పండుగ కోసం స్నేహితుడు మాధవతో కలిసి ఇక్కడికి వచ్చానని, ఆనందంగా గడిపామని, తిరిగి వెళ్లే ముందు ఈ దుర్ఘటన జరిగిందని తెలంగాణలోని మెదక్ జిల్లా వాడి గ్రామానికి చెందిన విశాల్ అనే యువకుడు కన్నీటిపర్యంతమయ్యాడు. తన కళ్లముందే ఐదుగురు సముద్రంలో మునిగిపోయారని, మత్స్యకారుల సహకారంతో ఇద్దరిని కాపాడామని, స్నేహితుడు మాధవ మరణించడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తంచేశాడు.స్నేహితులతో కలిసి వచ్చిన యువకుడు గల్లంతుఅదే సమయంలో సింగరాయకొండ శ్రీరాంనగర్ ప్రాంతానికి చెందిన తమ్మిశెట్టి పవన్ (22) కూడా తన స్నేహితులతో కలిసి సముద్ర స్నానం చేసేందుకు పాకల బీచ్‌కు వచ్చాడు. అలల ఉధృతికి పవన్ సముద్రంలో కొట్టుకుపోయాడు. అతని కోసం మెరైన్ పోలీసులు గాలిస్తున్నారు. పాకాల బీచ్‌ను రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న పరిశీలించి మెరైన్ పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పవన్ ఆచూకీ తెలిసే వరకు అదనపు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టాలని మెరైన్ పోలీసులకు ఎస్పీ దామోదర్ సూచించారు. -
ఇద్దరి ప్రాణాలు తీసిన సరదా..
సింగరాయకొండ: సముద్రస్నానం సరదా ఇద్దరి ఉసురు తీసింది. ఈ ఘటనతో వినాయకచవితి పండుగ రోజు ఓ పెళ్లింట విషాదం నిండింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో శుక్రవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మర్రిపూడి మండలం చిమట గ్రామంలో గురువారం మోయిడి మాధవ కూతురు వివాహం జరిగింది. ఆ వివాహానికి చీమకుర్తి మండలం చిన్నరాగిపాడు గ్రామానికి చెందిన అబ్బాయి తరఫు వారు హాజరయ్యారు. పెళ్లి తర్వాత రోజు వినాయక చవితి పండుగ కావడంతో పూజ ముగించుకుని సరదాగా సమీపంలోని పాకల బీచ్‌కు బైకులపై ఆరుగురు కలిసి వెళ్లారు. మర్రిపూడి మండలం చిమట గ్రామానికి చెందిన పెళ్లికుమార్తె అన్న మోయిడి శాంతిరాజు (20), మోయిడి కోటేష్, కొమ్ము లాజర్, కొమ్ము పాల్, చీమకుర్తి మండలం చిన్నరాగిపాడు గ్రామానికి చెందిన జెన్నిపోగు తేజ (18), జెన్నిపోగు యాప్రాయం సముద్రంలోకి దిగారు. అలల తాకిడి తక్కువగా ఉండడంతో కాస్త లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో శాంతిరాజు, తేజ, యాప్రాయం సముద్రంలో గల్లంతయ్యారు. గమనించిన మిగతా యువకులు పెద్దగా కేకలు వేయడంతో ఒడ్డున ఉన్న మత్స్యకారులు కాపాడే ప్రయత్నం చేశారు. శాంతిరాజు, యాప్రాయంను ఒడ్డుకు చేర్చి ప్రథమ చికిత్స చేశారు. చికిత్స చేస్తుండగానే శాంతిరాజు ప్రాణాలొదిలాడు. యాప్రాయం మాత్రం స్పృహలోకి వచ్చి తేరుకున్నాడు. తేజ మృతదేహం కొద్దిసేపటికి అలలపై తేలుతూ కనిపించడంతో ఒడ్డుకు చేర్చారు. మృతుల్లో శాంతిరాజు పెళ్లికూతురు అన్న. అప్పటివరకు సరదాగా ఉన్న పెళ్లి ఇంట రోదనలు మిన్నంటాయి. సింగరాయకొండ సీఐ మర్రి లక్ష్మణ్ పాకల బీచ్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్ఐ ఎల్.సంపత్‌కుమార్ కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
సునామీ అంటే భయం ఏల?
పాకల: సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని కందుకూరు ఆర్డీఓ మల్లికార్జునరావు అన్నారు. పాకల పల్లెపాలెంలో బుధవారం సునామీ మాక్ డ్రిల్‌లో పాల్గొన్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని సూచించారు. జిల్లా సహాయ అగ్నిమాపక అధికారి బి.వి.ఎస్. రాం ప్రకాష్ మాట్లాడుతూ విపత్తుల సమయంలో అగ్నిమాపక సిబ్బంది సహకారం మరువలేనిదన్నారు. సముద్రంలో మునిగిన వ్యక్తిని ఏవిధంగా బయటకు తీసుకుని వచ్చి కాపాడాలో అగ్నిమాపక సిబ్బంది మాక్‌డ్రిల్ చేశారు. మత్స్యశాఖ ఏడీఈ షేక్ లాల్మహమ్మద్, కొండపి నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ ఉదయ్‌భాస్కర్ , జిల్లా సమగ్ర వ్యాధి నివారణ అధికారి డాక్టర్ పి. పుల్లారెడ్డి, సీఐ భీమానాయక్, ఎస్సె›్త వైవి రమణయ్య, మండల స్పెషల్ఆఫీసర్ జెన్నమ్మ, తహసీల్దార్ షేక్ దావూద్‌హుస్సేన్, ఎంపిడిఓ షేక్ జమీఉల్లా, మండల ఇరిగేషన్ ఏఇ విజయలక్ష్మి, పంచాయితిరాజ్ ఏఇ శ్రీహరి, రెడ్‌క్రాస్ జిల్లా ఫీల్డ్ ఆఫీసర్ కోటయ్య, పంచాయితి కార్యదర్శి ప్రసాద్ పాల్గొన్నారు. – పాకల తీరంలోమాక్ డ్రిల్