సింగరాయకొండ: సముద్రస్నానం సరదా ఇద్దరి ఉసురు తీసింది. ఈ ఘటనతో వినాయకచవితి పండుగ రోజు ఓ పెళ్లింట విషాదం నిండింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో శుక్రవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మర్రిపూడి మండలం చిమట గ్రామంలో గురువారం మోయిడి మాధవ కూతురు వివాహం జరిగింది. ఆ వివాహానికి చీమకుర్తి మండలం చిన్నరాగిపాడు గ్రామానికి చెందిన అబ్బాయి తరఫు వారు హాజరయ్యారు. పెళ్లి తర్వాత రోజు వినాయక చవితి పండుగ కావడంతో పూజ ముగించుకుని సరదాగా సమీపంలోని పాకల బీచ్‌కు బైకులపై ఆరుగురు కలిసి వెళ్లారు.
మర్రిపూడి మండలం చిమట గ్రామానికి చెందిన పెళ్లికుమార్తె అన్న మోయిడి శాంతిరాజు (20), మోయిడి కోటేష్, కొమ్ము లాజర్, కొమ్ము పాల్, చీమకుర్తి మండలం చిన్నరాగిపాడు గ్రామానికి చెందిన జెన్నిపోగు తేజ (18), జెన్నిపోగు యాప్రాయం సముద్రంలోకి దిగారు. అలల తాకిడి తక్కువగా ఉండడంతో కాస్త లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో శాంతిరాజు, తేజ, యాప్రాయం సముద్రంలో గల్లంతయ్యారు. గమనించిన మిగతా యువకులు పెద్దగా కేకలు వేయడంతో ఒడ్డున ఉన్న మత్స్యకారులు కాపాడే ప్రయత్నం చేశారు. శాంతిరాజు, యాప్రాయంను ఒడ్డుకు చేర్చి ప్రథమ చికిత్స చేశారు.
చికిత్స చేస్తుండగానే శాంతిరాజు ప్రాణాలొదిలాడు. యాప్రాయం మాత్రం స్పృహలోకి వచ్చి తేరుకున్నాడు. తేజ మృతదేహం కొద్దిసేపటికి అలలపై తేలుతూ కనిపించడంతో ఒడ్డుకు చేర్చారు. మృతుల్లో శాంతిరాజు పెళ్లికూతురు అన్న. అప్పటివరకు సరదాగా ఉన్న పెళ్లి ఇంట రోదనలు మిన్నంటాయి. సింగరాయకొండ సీఐ మర్రి లక్ష్మణ్ పాకల బీచ్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్‌ఐ ఎల్.సంపత్‌కుమార్ కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
ఇద్దరి ప్రాణాలు తీసిన సరదా..
Published Sun, Sep 12 2021 4:11 AM | Last Updated on Sun, Sep 12 2021 4:11 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment