Sea bathing
-
ఇద్దరి ప్రాణాలు తీసిన సరదా..
సింగరాయకొండ: సముద్రస్నానం సరదా ఇద్దరి ఉసురు తీసింది. ఈ ఘటనతో వినాయకచవితి పండుగ రోజు ఓ పెళ్లింట విషాదం నిండింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో శుక్రవారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మర్రిపూడి మండలం చిమట గ్రామంలో గురువారం మోయిడి మాధవ కూతురు వివాహం జరిగింది. ఆ వివాహానికి చీమకుర్తి మండలం చిన్నరాగిపాడు గ్రామానికి చెందిన అబ్బాయి తరఫు వారు హాజరయ్యారు. పెళ్లి తర్వాత రోజు వినాయక చవితి పండుగ కావడంతో పూజ ముగించుకుని సరదాగా సమీపంలోని పాకల బీచ్‌కు బైకులపై ఆరుగురు కలిసి వెళ్లారు. మర్రిపూడి మండలం చిమట గ్రామానికి చెందిన పెళ్లికుమార్తె అన్న మోయిడి శాంతిరాజు (20), మోయిడి కోటేష్, కొమ్ము లాజర్, కొమ్ము పాల్, చీమకుర్తి మండలం చిన్నరాగిపాడు గ్రామానికి చెందిన జెన్నిపోగు తేజ (18), జెన్నిపోగు యాప్రాయం సముద్రంలోకి దిగారు. అలల తాకిడి తక్కువగా ఉండడంతో కాస్త లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో శాంతిరాజు, తేజ, యాప్రాయం సముద్రంలో గల్లంతయ్యారు. గమనించిన మిగతా యువకులు పెద్దగా కేకలు వేయడంతో ఒడ్డున ఉన్న మత్స్యకారులు కాపాడే ప్రయత్నం చేశారు. శాంతిరాజు, యాప్రాయంను ఒడ్డుకు చేర్చి ప్రథమ చికిత్స చేశారు. చికిత్స చేస్తుండగానే శాంతిరాజు ప్రాణాలొదిలాడు. యాప్రాయం మాత్రం స్పృహలోకి వచ్చి తేరుకున్నాడు. తేజ మృతదేహం కొద్దిసేపటికి అలలపై తేలుతూ కనిపించడంతో ఒడ్డుకు చేర్చారు. మృతుల్లో శాంతిరాజు పెళ్లికూతురు అన్న. అప్పటివరకు సరదాగా ఉన్న పెళ్లి ఇంట రోదనలు మిన్నంటాయి. సింగరాయకొండ సీఐ మర్రి లక్ష్మణ్ పాకల బీచ్‌కు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎస్ఐ ఎల్.సంపత్‌కుమార్ కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
కడలి కబళించింది
నెల్లూరు, వాకాడు/కోట: రెక్కాడితే గానీ.. డొక్కాడని నిరుపేద కూలీ కుటుంబాల్లో సముద్ర స్నానం విషాదం నింపింది. అలల రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరు బాలికలను కబళించింది. వాకాడు మండలం తూపిలిపాళెం బీచ్‌కు వెళ్లిన సిద్ధపురెడ్డి రమ్య (15), గంధళ్ల రోషిణి (16) కెరటాల తాకిడికి కొట్టుకుపోయి మరణించారు. అయ్యప్ప మాల ధరించి శబరిమల యాత్రకు బయలుదేరిన ఇంటి పెద్దలు క్షేమంగా తిరిగి రావాలనే ఆకాంక్షతో పూజ తలపెట్టిన ఆ ఇద్దరు బాలికలు మరో 10 మందితో కలిసి సముద్రంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు వెళ్లగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఎగసిపడుతున్న అలలు ఆ బాలికల్ని పొట్టనపెట్టుకున్నాయి. ఈ ఘటనతో వారి స్వగ్రామమైన కోట మండలం వీరారెడ్డిసత్రం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలికల మృతదేహాలను చూసి వారి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. ఇంటిపెద్దల క్షేమం కోరి.. మృతి చెందిన సిద్ధపురెడ్డి రమ్య తండ్రి పాపయ్య, తల్లి వెంకటలక్ష్మి, గంధళ్ల రోషిణి తండ్రి శ్రీనివాసులు, తల్లి పాపమ్మ గిరిజన కుటుంబాలకు చెందిన వారు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాల్ని పోషించుకుంటున్నారు. పాపయ్య, శ్రీనివాసులు సమీప బంధువులు. గిరిజన కాలనీకి చెందిన మరో ఇద్దరితో కలిసి వారిద్దరూ అయ్యప్ప మాల ధరించారు. శబరిమల యాత్రకు బుధవారం బస్సులో తరలివెళ్లారు. ఈ నేపథ్యంలో వాళ్ల ఇంటికి బంధుమిత్రులు తరలి రావడంతో సందడి నెలకొంది. శబరిమల యాత్రకు వెళ్లిన వారు తిరిగి వచ్చేవరకు ఇంట్లోని అయ్యప్ప స్వామి పీఠం వద్ద ఎవరో ఒకరు నిష్టతో పూజ, దీపారాధన చేయడం సంప్రదాయం. ఆ సంప్రదాయం నిర్వర్తించే బాధ్యతను పాపయ్య కుమార్తె రమ్య, శ్రీనివాసులు కుమార్తె రోషిణి చేపట్టారు. రమ్య 9వ తరగతి చదువుతుండగా, రోషిణి చిట్టేడులోని రొయ్యల కంపెనీలో పనిచేస్తోంది. పీఠం వద్ద పూజలు చేయడానికి ముందు సముద్రంలో పవిత్ర స్నానం ఆచరించాలన్న ఉద్దేశంతో బాలికలు రమ్య, రోషిణి తమ బంధుమిత్రులైన నవీన్, కోటేశ్వరరావు, రవి, రాధ, జ్యోతి, సుగుణ, ప్రశాంతి, అనిత, ఈశ్వరమ్మ, పవన్‌తో కలసి గురువారం ఉదయం రెండు ఆటోల్లో బీచ్‌కు వెళ్లారు. బీచ్‌లోని మొదటి ఘాట్‌లో కాకుండా ఎత్తిపోతల జెట్టీ వద్దకు చేరుకుని స్నానానికి ఉపక్రమించారు. సముద్రం నుంచి బయటకు తీసిన రమ్య మృతదేహం , రోషిణి మృతదేహం వద్ద విలపిస్తున్న మృతురాలి అక్క అక్కడ కెరటాల ఉధృతితోపాటు లోతు అధికంగా ఉంటుంది. దానికితోడు అల్పపీడనం వల్ల సముద్రం అల్లకల్లోంగా మారి అలలు ఎగిసిపడ్డాయి. రమ్య, రోషిణి అలల తాకిడికి కొట్టుకుపోయి గల్లంతయ్యారు. కంగారుపడిన తోటివారంతా ఒడ్డుకు చేరుకున్నారు. రమ్య మృతదేహాన్ని వెతికి పట్టుకోగా.. రోషిణి ఆచూకీ లభ్యం కాలేదు. ఆ సమయంలో తూపిలిపాళెంలోనే ఉన్న ఏఎంసీ ఛైర్మన్ పాపారెడ్డి మనోజ్‌కుమార్‌రెడ్డి చైతన్య జ్యోతి వెల్ఫేర్ సొసైటీ సిబ్బంది, మత్స్యకారుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా.. గంట సేపటి తరువాత రోషిణి మృతదేహం లభించింది. రెండు మృతదేహాలను కోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ పెద్దలు క్షేమంగా తిరిగి రావాలనే ఉద్దేశంతో పవిత్ర స్నానానికి వెళ్లిన ఇద్దరూ విగత జీవులై తిరిగి రావడంతో ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. యాత్రలో భాగంగా తమిళనాడులోని శ్రీరంగపట్నం వరకు చేరుకున్న రమ్య తండ్రి పాపయ్య, రోషిణి తండ్రి శ్రీనివాసులు ఈ విషయం తెలిసి అక్కడికక్కడే దీక్షను త్యజించి తిరుగు ప్రయాణమయ్యారు. -
రెప్పల మాటున ఉప్పెన
లోకేష్, రాజు మృతదేహాలు లభ్యం విజయ్ కోసం బంధుమిత్రుల గాలింపు తుదిలేని కుటుంబ సభ్యుల కన్నీటి వేదన సాగర్‌నగర్(విశాఖపట్నం) : కన్నవారికి కడుపు కోత మిగులుస్తూ గురువారం గల్లంతైన బి.లోకేష్, పి.రాజు మృతదేహాలు సాగర్‌నగర్ ఇస్కాన్ మందిరం ఎదురుగా ఉన్న తీరంలో శుక్రవారం ఉదయం లభ్యమయ్యాయి. ఆరిలోవ బాలాజీనగర్‌కు చెందిన వీరు జోడుగుళ్లపాలెం తీరంలో సముద్ర స్నానానికి దిగి కెరటాలకు బలైన విషయం తెలిసిందే. వీరితోపాటు గల్లంతైన ఆకుల విజయకాంత్ ఆచూకీ ఇంకా లభించలేదు. అతని కోసం బంధువులు, స్నేహితులు, పోలీసులు తీరం వెంబడి గాలిస్తున్నారు. లభ్యమైన మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. కుప్పకూలిన తల్లిదండ్రులు చెట్టంత కొడుకులు ప్రయోజకులవుతారని, అండగా ఉంటారని ఆశించిన కన్నవారి కలలు కల్లలయ్యాయి. లోకేష్, రాజు మృతదేహాలు లభించడంతో శుక్రవారం వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా పెద్దపెట్టున రోదించారు. క్షేమంగా ఉన్నారేమో.. ఎలాగైనా తిరిగి వస్తారేమోనని మిణుకుమిణుకుమంటున్న చిన్నపాటి ఆశ కూడా చెదిరిపోవడంతో కుప్పకూలిపోయారు. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడని ఆనందిస్తున్న సమయంలో విధి తమపై చిన్నచూపు చూసిందని లోకేష్ నాన్నమ్మ చంద్రవతి వాపోయింది. రాజు తల్లిదండ్రుల పరిస్థితీ అలాగే ఉంది. స్నేహితులతో సరదాగా వెళ్లిన కొడుకు తిరిగి వస్తాడన్న ఆశంతా ఆవిరైపోయిందని... మృతదేహంపై పడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుతో విలపిస్తున్నారు. మృతదేహాలకు పీఎం పోలీస్‌ల ఆధ్వర్యంలో పంచనామా చేసి కేజీహెచ్‌కు తరలించారు. విజయ్ కోసం ఆరిలోవ సీఐ ధనుంజయనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు గాలిస్తున్నారు. తొందరగా వచ్చేస్తానన్నాడు నైట్ డ్యూట్ చేసి ఇంటికొచ్చాను. టిఫిన్ చేస్తుండగా బయలు దేరాడు. తొందరగా వచ్చేస్తాను నాన్నా.. అని స్నేహితులతో కలిసి వెళ్లాడు. మరి తిరిగిరాడనుకోలేదు. చిన్నోడని గారాబంగా పెంచాను. ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు. -బి.వి.వి.రామారావు, లోకేష్ తండ్రి తమ్ముడూ... ఎక్కడున్నావు? విజయ్‌కాంత్ మృతదేహం కోసం తెల్లవారుజాము నుంచి పదిమంది స్నేహితులం గాలిస్తున్నాం. ఎక్కడా లభించలేదు. తెన్నేటిపార్కు, జాలరీపేట, సాగర్‌నగర్, తిమ్మాపురం బీచ్ వరకు వెదుకుతున్నాం. - లక్ష్మణ్, విజయ్‌కాంత్ అన్న, ఆరిలోవ