రెప్పల మాటున ఉప్పెన
లోకేష్, రాజు మృతదేహాలు లభ్యం
విజయ్ కోసం బంధుమిత్రుల గాలింపు
తుదిలేని కుటుంబ సభ్యుల కన్నీటి వేదన
సాగర్‌నగర్(విశాఖపట్నం) : కన్నవారికి కడుపు కోత మిగులుస్తూ గురువారం గల్లంతైన బి.లోకేష్, పి.రాజు మృతదేహాలు సాగర్‌నగర్ ఇస్కాన్ మందిరం ఎదురుగా ఉన్న తీరంలో శుక్రవారం ఉదయం లభ్యమయ్యాయి. ఆరిలోవ బాలాజీనగర్‌కు చెందిన వీరు జోడుగుళ్లపాలెం తీరంలో సముద్ర స్నానానికి దిగి కెరటాలకు బలైన విషయం తెలిసిందే. వీరితోపాటు గల్లంతైన ఆకుల విజయకాంత్ ఆచూకీ ఇంకా లభించలేదు. అతని కోసం బంధువులు, స్నేహితులు, పోలీసులు తీరం వెంబడి గాలిస్తున్నారు. లభ్యమైన మృతదేహాలను పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు.
కుప్పకూలిన తల్లిదండ్రులు
చెట్టంత కొడుకులు ప్రయోజకులవుతారని, అండగా ఉంటారని ఆశించిన కన్నవారి కలలు కల్లలయ్యాయి. లోకేష్, రాజు మృతదేహాలు లభించడంతో శుక్రవారం వారి తల్లిదండ్రులు ఒక్కసారిగా పెద్దపెట్టున రోదించారు. క్షేమంగా ఉన్నారేమో.. ఎలాగైనా తిరిగి వస్తారేమోనని మిణుకుమిణుకుమంటున్న చిన్నపాటి ఆశ కూడా చెదిరిపోవడంతో కుప్పకూలిపోయారు. తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడని ఆనందిస్తున్న సమయంలో విధి తమపై చిన్నచూపు చూసిందని లోకేష్ నాన్నమ్మ చంద్రవతి వాపోయింది.
రాజు తల్లిదండ్రుల పరిస్థితీ అలాగే ఉంది. స్నేహితులతో సరదాగా వెళ్లిన కొడుకు తిరిగి వస్తాడన్న ఆశంతా ఆవిరైపోయిందని... మృతదేహంపై పడి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుతో విలపిస్తున్నారు. మృతదేహాలకు పీఎం పోలీస్‌ల ఆధ్వర్యంలో పంచనామా చేసి కేజీహెచ్‌కు తరలించారు. విజయ్ కోసం ఆరిలోవ సీఐ ధనుంజయనాయుడు ఆధ్వర్యంలో పోలీసులు గాలిస్తున్నారు.
తొందరగా వచ్చేస్తానన్నాడు
నైట్ డ్యూట్ చేసి ఇంటికొచ్చాను. టిఫిన్ చేస్తుండగా బయలు దేరాడు. తొందరగా వచ్చేస్తాను నాన్నా.. అని స్నేహితులతో కలిసి వెళ్లాడు. మరి తిరిగిరాడనుకోలేదు. చిన్నోడని గారాబంగా పెంచాను. ఏసీ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఇంత ఘోరం జరుగుతుందనుకోలేదు.
-బి.వి.వి.రామారావు, లోకేష్ తండ్రి
తమ్ముడూ... ఎక్కడున్నావు?
విజయ్‌కాంత్ మృతదేహం కోసం తెల్లవారుజాము నుంచి పదిమంది స్నేహితులం గాలిస్తున్నాం. ఎక్కడా లభించలేదు. తెన్నేటిపార్కు, జాలరీపేట, సాగర్‌నగర్, తిమ్మాపురం బీచ్ వరకు వెదుకుతున్నాం.
- లక్ష్మణ్, విజయ్‌కాంత్ అన్న, ఆరిలోవ