గౌరిబిదనూరు: ఈ నెల 9వ తేదీన కర్నాటకలో తాలూకాలోని తొండేబావి రైల్వే స్టేషను సమీపంలో రైలు పట్టాలపై ఒక పురుషుడు, ఇద్దరు మహిళల మృతదేహాలు కనిపించడం కలకలానికి కారణమైంది. ఇది ఆత్మహత్య, లేక ప్రమాదమా, మృతులు ఎవరు అనేది మిస్టరీగా మారింది. బుధవారం ఆ మిస్టరీ వీడింది.
మృతులు తొండేబావి రైల్వేస్టేషను దగ్గరే నివాసముంటున్న మైలారప్ప (50), భార్య పుష్పలత (45), వీరి కుమార్తె మమత (25)గా పోలీసులు గుర్తించారు. మైలారప్ప చిన్నకారు రైతు. మమతకు ఇటీవల భర్త కుటుంబ కలహాలతో విడాకులు ఇవ్వడంతో పుట్టింటికి వచ్చేసింది. కూతురి కాపురం చెడిపోవడం వారు తట్టుకోలేకపోయారు. దీంతో ముగ్గురూ కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
మరో కూతురి ఫిర్యాదుతో..
మైలారప్ప మరో కుమార్తె దాక్షాయణి ద్యావరహళ్లిలో ఉంటుంది. మూడురోజుల నుంచి ఫోను చేసినా స్విచాఫ్ అని వస్తోంది. కంగారు పడిన ఆమె మంగళవారం రాత్రి తొండేబావిలోని ఇంటికి వచ్చి ఇంట్లో ఎవరూ లేకపోయే సరికి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అప్పటికే మృతదేహాలకు అంత్యక్రియలు చేసి వారి దుస్తులను భద్రపరిచారు. ఫోటోలను, దుస్తులను చూపించగా దాక్షాయణి తన తల్లిదండ్రులు, సోదరివి అని గుర్తుపట్టి విలపించింది.
Comments
Please login to add a commentAdd a comment