వీడని మిస్టరీ! | Three Dead Bodies Were Identified In Guvvalacheruvu Valley | Sakshi
Sakshi News home page

వీడని మిస్టరీ!

Published Fri, Jul 15 2022 10:28 PM | Last Updated on Fri, Jul 15 2022 10:43 PM

Three Dead Bodies Were Identified In Guvvalacheruvu Valley - Sakshi

గువ్వలచెరువు ఘాట్‌రోడ్డు

సాక్షి రాయచోటి : గువ్వలచెరువు ఘాట్‌లో మూడు మృతదేహాలు బయటపడిన సంఘటన సంచలనంగా మారింది. కారణాలు తెలియక ఒకవైపు..వారి వివరాలు లభించక మరోవైపు.. పోలీసులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. మృతుల తలలకు గాయాలు ఉండడంపై హత్యగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే నిందితులు ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చి.. ఘాట్‌ లోయలోకి విసిరేసి వెళ్లిపోయినట్లు అంచనా వేస్తున్నారు.

అందులోనూ మృతి చెంది దాదాపు 10–12 రోజులు కావడంతో మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. కేవలం వారి ఒంటిపై ఉన్న దుస్తులు, గొలుసులు, ఇతర చిన్నపాటి ఆధారాల మేరకు కేసు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారి–44లో అనునిత్యం వాహనాల రద్దీ ఉన్న నేపథ్యంలో రాత్రి సమయంలో ఘాట్‌ లోయలో మృతదేహాలను పడేసినట్లు స్పష్టమవుతోంది.

అసలు వారెవరు?
కడప–రాయచోటి సరిహద్దు ప్రాంతంలోని ఐదవ మలుపు వద్ద కొండకింద లోయలో కనిపించిన ఆ మృతదేహాలు ఎవరివి అన్నది అంతుచిక్కడం లేదు. అసలు వారెవరు...ఎక్కడి వారు...ఎందుకు చంపాల్సి వచ్చింది...ఇతర వివరాల కోసం పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒకవైపు ఇన్‌ఫార్మర్ల ద్వారా కూపీ లాగుతూ మరోవైపు ఉన్న ఆధారాల మేరకు విచారిస్తున్నారు.

రాయచోటికి చెందిన టైలర్‌ పేరు మృతుని షర్టుపై  ఉండటంతో సంబంధిత టైలర్‌ ద్వారా ఆరా తీశారు. అయితే అతను చాలా ఏళ్ల క్రితమే టైలర్‌ వృత్తిని మానుకున్నట్లు వెల్లడించినట్లు తెలిసింది. అయితే షర్టుపై ఉన్న గుర్తుల నేపధ్యంలో రాయచోటి ప్రాంతానికి చెందిన వారే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే సీసీ కెమెరాల ద్వారా వాహనాల రాకపోకలకు సంబంధించిన వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

తోటల వద్ద కాపలాదారుల వివరాల సేకరణ
ప్రధానంగా మృతుల్లో ఒక వ్యక్తి మెడలో సిల్వర్‌ గొలుసు, మహిళ నైటీ ధరించి ఉండడం చూసి మృతులు యానాదులు లేదా ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన వారై ఉంటారని అనుమానిస్తున్నారు. మామిడి, చీనీ తోటల వద్ద కాపలా దారులుగా ఎక్కువగా వారే ఉంటారు కనుక వారి వివరాలు సేకరిస్తున్నారు. తోటల వద్ద జరిగిన గొడవే హత్యలకు కారణంగా ఉండవచ్చన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

మిస్సింగ్‌ కేసులపై ఆరా
వైఎస్సార్‌ జిల్లాతోపాటు అన్నమయ్య జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో మిస్సింగ్‌ కేసులకు సంబంధించిన వాటిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా సచివాలయాల పరిధిలోని మహిళా పోలీసులకు సమాచారం ఇచ్చి గ్రామాల్లో వారం, పది రోజులుగా కనిపించకుండా పోయిన వారి వివరాలు సేకరించాలని ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే కొంతమంది కుటుంబ సభ్యుల ఆర్థిక, ఆస్తుల వ్యవహారంలో గొడవలు జరిగి మృతి చెందినట్లయితే వ్యవహారం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిస్సింగ్‌ కేసు నమోదు కాకపోయినా గ్రామాల్లో అదృశ్యమైన వారి వివరాలు సేకరిస్తున్నారు.

పోలీసు బృందాలతో గాలింపు
మృతుల వివరాలు కనుగొనేందుకు ప్రత్యేకంగా ఏడెనిమిది పోలీసు బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి నేతృత్వంలో పోలీసు బృందాలు దర్యాప్తులో ముందుకు వెళుతున్నాయి.

దర్యాప్తు ముమ్మరం
గువ్వలచెరువు ఘాట్‌లో మూడు మృతదేహాలకు సంబంధించి వైఎస్సార్‌తోపాటు అన్నమయ్య జిల్లాలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రధాన్చంగా వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు సంబంధించిన మహిళా పోలీసులకు సమాచారం అందించాం. గ్రామాల్లో కనిపించని వారితోపాటు మిస్సింగ్‌ వివరాలు కూడా తెప్పించుకుంటున్నాం. కేసుకు సంబంధించి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తూ మిస్టరీని ఛేదించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తోటల వద్ద కాపలా ఉన్న వారి వివరాలు తీసుకుంటున్నాం.  
– కేకేఎన్‌ అన్బురాజన్,జిల్లా ఎస్పీ, వైఎస్సార్‌ జిల్లా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement