Guvvalacheruvu Ghat Road
-
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురి మృతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతకొమ్మదిన్నె పరిధిలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్లో కంటైనర్‌కు వెనకనుంచి ఓ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురితోపాటు, కంటైనర్ డ్రైవర్ అక్కడిక్కడే మృతి చెందారు. కారులోని వారంతా బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జు అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను చక్రాయపేట మండలం కొన్నేపల్లికి చెందిన వారిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వీడని మిస్టరీ!
సాక్షి రాయచోటి : గువ్వలచెరువు ఘాట్‌లో మూడు మృతదేహాలు బయటపడిన సంఘటన సంచలనంగా మారింది. కారణాలు తెలియక ఒకవైపు..వారి వివరాలు లభించక మరోవైపు.. పోలీసులు అన్వేషణ కొనసాగిస్తున్నారు. మృతుల తలలకు గాయాలు ఉండడంపై హత్యగా నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే నిందితులు ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చి.. ఘాట్ లోయలోకి విసిరేసి వెళ్లిపోయినట్లు అంచనా వేస్తున్నారు. అందులోనూ మృతి చెంది దాదాపు 10–12 రోజులు కావడంతో మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా మారిపోయాయి. కేవలం వారి ఒంటిపై ఉన్న దుస్తులు, గొలుసులు, ఇతర చిన్నపాటి ఆధారాల మేరకు కేసు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారి–44లో అనునిత్యం వాహనాల రద్దీ ఉన్న నేపథ్యంలో రాత్రి సమయంలో ఘాట్ లోయలో మృతదేహాలను పడేసినట్లు స్పష్టమవుతోంది. అసలు వారెవరు? కడప–రాయచోటి సరిహద్దు ప్రాంతంలోని ఐదవ మలుపు వద్ద కొండకింద లోయలో కనిపించిన ఆ మృతదేహాలు ఎవరివి అన్నది అంతుచిక్కడం లేదు. అసలు వారెవరు...ఎక్కడి వారు...ఎందుకు చంపాల్సి వచ్చింది...ఇతర వివరాల కోసం పోలీసులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒకవైపు ఇన్ఫార్మర్ల ద్వారా కూపీ లాగుతూ మరోవైపు ఉన్న ఆధారాల మేరకు విచారిస్తున్నారు. రాయచోటికి చెందిన టైలర్ పేరు మృతుని షర్టుపై ఉండటంతో సంబంధిత టైలర్ ద్వారా ఆరా తీశారు. అయితే అతను చాలా ఏళ్ల క్రితమే టైలర్ వృత్తిని మానుకున్నట్లు వెల్లడించినట్లు తెలిసింది. అయితే షర్టుపై ఉన్న గుర్తుల నేపధ్యంలో రాయచోటి ప్రాంతానికి చెందిన వారే అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే సీసీ కెమెరాల ద్వారా వాహనాల రాకపోకలకు సంబంధించిన వ్యవహారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తోటల వద్ద కాపలాదారుల వివరాల సేకరణ ప్రధానంగా మృతుల్లో ఒక వ్యక్తి మెడలో సిల్వర్ గొలుసు, మహిళ నైటీ ధరించి ఉండడం చూసి మృతులు యానాదులు లేదా ఎరుకుల సామాజిక వర్గానికి చెందిన వారై ఉంటారని అనుమానిస్తున్నారు. మామిడి, చీనీ తోటల వద్ద కాపలా దారులుగా ఎక్కువగా వారే ఉంటారు కనుక వారి వివరాలు సేకరిస్తున్నారు. తోటల వద్ద జరిగిన గొడవే హత్యలకు కారణంగా ఉండవచ్చన్న కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మిస్సింగ్ కేసులపై ఆరా వైఎస్సార్ జిల్లాతోపాటు అన్నమయ్య జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో మిస్సింగ్ కేసులకు సంబంధించిన వాటిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అంతేకాకుండా సచివాలయాల పరిధిలోని మహిళా పోలీసులకు సమాచారం ఇచ్చి గ్రామాల్లో వారం, పది రోజులుగా కనిపించకుండా పోయిన వారి వివరాలు సేకరించాలని ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే కొంతమంది కుటుంబ సభ్యుల ఆర్థిక, ఆస్తుల వ్యవహారంలో గొడవలు జరిగి మృతి చెందినట్లయితే వ్యవహారం బయటికి పొక్కకుండా జాగ్రత్త పడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిస్సింగ్ కేసు నమోదు కాకపోయినా గ్రామాల్లో అదృశ్యమైన వారి వివరాలు సేకరిస్తున్నారు. పోలీసు బృందాలతో గాలింపు మృతుల వివరాలు కనుగొనేందుకు ప్రత్యేకంగా ఏడెనిమిది పోలీసు బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కడప డీఎస్పీ వెంకట శివారెడ్డి నేతృత్వంలో పోలీసు బృందాలు దర్యాప్తులో ముందుకు వెళుతున్నాయి. దర్యాప్తు ముమ్మరం గువ్వలచెరువు ఘాట్‌లో మూడు మృతదేహాలకు సంబంధించి వైఎస్సార్‌తోపాటు అన్నమయ్య జిల్లాలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ప్రధాన్చంగా వైఎస్సార్, అన్నమయ్య, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు సంబంధించిన మహిళా పోలీసులకు సమాచారం అందించాం. గ్రామాల్లో కనిపించని వారితోపాటు మిస్సింగ్ వివరాలు కూడా తెప్పించుకుంటున్నాం. కేసుకు సంబంధించి ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తూ మిస్టరీని ఛేదించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తోటల వద్ద కాపలా ఉన్న వారి వివరాలు తీసుకుంటున్నాం. – కేకేఎన్ అన్బురాజన్,జిల్లా ఎస్పీ, వైఎస్సార్ జిల్లా -
గువ్వలచెరువు ఘాట్‌లో గుప్తనిధులు?
సాక్షి, రామాపురం : గువ్వల చెరువు ఘాట్.. ఈ పేరు వింటూనే అందరికీ దట్టమైన అడవి.. లోతైన లోయలు గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయంటూ ఓ ముఠా అన్వేషణ ప్రారంభించింది. గత రెండు నెలల నుంచి ఈ ప్రాంతంలో మహారాష్ట్రకు చెందిన ఓ ముఠా తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంత వాసులకు తెలియని గుప్తనిధులు పరాయి రాష్ట్రం వారికి ఎలా తెలిశాయా అని అందరూ చర్చించుకుంటున్నారు. గువ్వలచెరువు ఘాట్‌రోడ్డులోని బీఎస్ఎన్ఎల్ టవర్ వద్ద నుంచి దాదాపు 5 కిలోమీటర్ల పొడవైన గుహను గుర్తించారు. ఈ గుహలోకి మహారాష్ట్ర వ్యక్తులు దాదాపు రెండు కిలో మీటర్ల దూరం వెళ్లగా లోపల ఊపిరాడక వెంటనే బయటకు వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత ఆక్సిజన్ సిలిండ్లతో గుహలోకి వెళ్లగా బ్రిటీష్ పాలకుల కాలం నాటి వజ్రాల పెట్టెలు ఉన్నట్లు గుర్తించారని తెలిసింది. అయితే ఆ పెట్టెలను బయటకు తెచ్చేందుకు వీలుకాక అక్కడే వదిలేసి వచ్చారనే చర్చ జరుగుతోంది. గుట్టు చప్పుడు కాకుండా గత వారం రోజులుగా ఆ గుహ చుట్టూ మహారాష్ట్ర వాసులు సంచరిస్తున్నారనే విషయం పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మహారాష్ట్ర పోలీసు కేడర్‌లో ఉన్న ఓ అధికారి ఇక్కడి పోలీసులకు చేరవేసినట్లు సమాచారం. సోమవారం రాత్రి కూడా ఆ ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఉన్నట్లు అక్కడి ప్రజలు తెలిపారు. ఈ విషయంపై ఎస్ఐ కృష్ణమూర్తిని వివరణ కోరగా విషయం తెలిసిన వెంటనే తమ సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించామన్నారు. అక్కడ గుహ మాత్రం ఉందని, అయితే అది ఎంత దూరం ఉంది, అక్కడ ఏమైనా ఉన్నాయా అనే దానిపై అధికారులతో సంప్రదించి చర్యలు చేపట్టనున్నామన్నారు. ఈ ప్రాంతంలో తమ సిబ్బంది గస్తీ కాస్తున్నారని, కొత్త వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. -
గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో లారీ బోల్తా
– ఇద్దరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు – సురక్షితంగా బయటపడ్డ ఐదు మంది చింతకొమ్మదిన్నె : మండలంలోని కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డు, 4వ మలుపు వద్ద గురువారం వరి గడ్డి లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఐదు మంది సురక్షితంగా బయటపడ్డారు. చాపాడు మండలం రేపల్లె గ్రామానికి చెందిన వారు ఏపీ03 టియు 2739 నెంబరు గల లారీలో గాలివీడు నుంచి వరి గడ్డిని కొనుగోలు చేసి తీసుకొస్తుండగా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులోని నాలుగవ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో జక్కల రామసుబ్బయ్య (55), గూడె శ్రీనివాసులు (45) అక్కడికక్కడే మృతి చెందారు. లారీ ఓనర్ జయన్న, దస్తగిరి అలియాస్ టీకన్న తీవ్ర గాయాలపాలయ్యారు. 5 మంది ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా బయటపడ్డారు. ప్రమాద విషయాన్ని తెలుసుకున్న డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్,సీకే దిన్నె ఎస్ఐలు కుళాయప్ప, చాంద్‌బాషా, రాయచోటి సీఐ మహేశ్వర్‌రెడ్డి, ఘటనా స్థలానికి చేరుకుని బోల్తా పడ్డ లారీలో ఇరుక్కున్న మృతదేహాలను వెలికి తీశారు. గాయపడ్డ వారిని 108 వాహనంలో రిమ్స్‌కు తరలించారు. బోల్తా పడ్డ లారీని పక్కకు తొలగించారు.