సాక్షి, రామాపురం : గువ్వల చెరువు ఘాట్.. ఈ పేరు వింటూనే అందరికీ దట్టమైన అడవి.. లోతైన లోయలు గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయంటూ ఓ ముఠా అన్వేషణ ప్రారంభించింది. గత రెండు నెలల నుంచి ఈ ప్రాంతంలో మహారాష్ట్రకు చెందిన ఓ ముఠా తవ్వకాలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంత వాసులకు తెలియని గుప్తనిధులు పరాయి రాష్ట్రం వారికి ఎలా తెలిశాయా అని అందరూ చర్చించుకుంటున్నారు.
గువ్వలచెరువు ఘాట్‌రోడ్డులోని బీఎస్‌ఎన్‌ఎల్ టవర్ వద్ద నుంచి దాదాపు 5 కిలోమీటర్ల పొడవైన గుహను గుర్తించారు. ఈ గుహలోకి మహారాష్ట్ర వ్యక్తులు దాదాపు రెండు కిలో మీటర్ల దూరం వెళ్లగా లోపల ఊపిరాడక వెంటనే బయటకు వచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత ఆక్సిజన్ సిలిండ్లతో గుహలోకి వెళ్లగా బ్రిటీష్ పాలకుల కాలం నాటి వజ్రాల పెట్టెలు ఉన్నట్లు గుర్తించారని తెలిసింది. అయితే ఆ పెట్టెలను బయటకు తెచ్చేందుకు వీలుకాక అక్కడే వదిలేసి వచ్చారనే చర్చ జరుగుతోంది. గుట్టు చప్పుడు కాకుండా గత వారం రోజులుగా ఆ గుహ చుట్టూ మహారాష్ట్ర వాసులు సంచరిస్తున్నారనే విషయం పోలీసుల దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని మహారాష్ట్ర పోలీసు కేడర్‌లో ఉన్న ఓ అధికారి ఇక్కడి పోలీసులకు చేరవేసినట్లు సమాచారం. సోమవారం రాత్రి కూడా ఆ ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఉన్నట్లు అక్కడి ప్రజలు తెలిపారు. ఈ విషయంపై ఎస్‌ఐ కృష్ణమూర్తిని వివరణ కోరగా విషయం తెలిసిన వెంటనే తమ సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించామన్నారు. అక్కడ గుహ మాత్రం ఉందని, అయితే అది ఎంత దూరం ఉంది, అక్కడ ఏమైనా ఉన్నాయా అనే దానిపై అధికారులతో సంప్రదించి చర్యలు చేపట్టనున్నామన్నారు. ఈ ప్రాంతంలో తమ సిబ్బంది గస్తీ కాస్తున్నారని, కొత్త వ్యక్తులు కనిపిస్తే అదుపులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.
గువ్వలచెరువు ఘాట్‌లో గుప్తనిధులు?
Published Wed, Dec 20 2017 8:52 AM | Last Updated on Sat, Jul 7 2018 3:22 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment