అంధత్వానికి భారత్ సరికొత్త నిర్వచనం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిబంధనల ప్రకారం అంధత్వం గురించి భారత్ తన నిర్వచనాన్ని సవరించింది. 1976లో రూపొందించిన నిర్వచనం ప్రకారం దాదాపు 6 మీటర్ల దూరంలో ఉన్న వేళ్లను గుర్తించలేని వారికి అంధత్వం ఉన్నట్లు పరిగణించేవారు. దీన్ని ప్రస్తుతం మూడు మీటర్లకు కుదించారు.
2020 నాటికి దేశ జనాభాలో అంధత్వ సమస్యను 0.3 శాతానికి పరిమితం చేయాలన్న డబ్ల్యూహెచ్‌వో లక్ష్యానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం వల్ల దేశంలో అంధత్వంతో బాధపడుతున్న వారి సంఖ్య 1.20 కోట్ల నుంచి 80 లక్షలకు చేరుకోనుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం నోటిషికేషన్ జారీ చేసింది.