అంధ విద్యార్థుల నృత్యాలను తిలకిస్తున్న స్వామి పరిపూర్ణానంద, పాఠశాల నిర్వాహకులు తదితరులు
సనత్‌నగర్: చూపులేక పోవడం దురదృష్టం కాదని, చూపు ఉన్న మనం చూపులేని వారి వైభవాన్ని చూడలేకపోవడం దురదృష్టకరమని శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద అన్నారు. బేగంపేట మయూరీమార్గ్‌లోని దేవనార్ అందుల పాఠశాల వార్షికోత్సవం శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన స్వామిజీ మాట్లాడుతూ.. ఇక్కడ చదువుతున్న ప్రతిఒక్క విద్యార్థిలోని తన తల్లి కనిపిస్తుందన్నారు. అంధురాలైన తన తల్లికి చేసిన సేవలను గుర్తుచేసుకుని స్వామీజీ తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. తనకు తల్లి మొదటి గురువైతే....స్వామి దయానంద సరస్వతి రెండవ గురువని వివరించారు. కొడుకులా కాకుండా కూతురిలా దగ్గరుండి తల్లికి సపర్యలు చేశానని, తనకు సన్యాసం ఇష్టం లేకున్నా తల్లి ఆజ్ఞను శిరసావహించానని అన్నారు.
తన తల్లికి వేదాంతం, మంత్రం వినిపించడం తన అదృష్టమన్నారు. తన కోసం తాను జీవించడం సహజత్వమని, ఇతరుల కోసం జీవించడం మానవత్వమని, సమూహం కోసం జీవించడం దైవత్వంగా పేర్కొన్నారు. ఇక్కడి విద్యార్థులకు కళ్లు లేకున్నా బ్రెయిన్‌తో నృత్యాలు చేసిన తీరు అద్భుతమని కితాబిచ్చారు. త్వరలోనే దేవనార్ పాఠశాల విద్యార్థులతో కొంత సమయం గడుపుతానని స్పష్టం చేశారు. పాఠశాల నిర్వాహకులను అభినందించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సామాజిక అంశాలతో ప్రదర్శించిన స్కిట్లు ఎంతగానో అలరించాయి. కార్యక్రమంలో దేవనార్ ఫౌండేషన్ ఫర్ బ్‌లైండ్ ఛైర్మన్ సాయిబాబాగౌడ్, కరస్పాండెంట్ జ్యోతిగౌడ్, ప్రిన్సిపాల్ లిల్లీ ఎగ్‌బర్డ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment