
తమిళసినిమా: నటి వరలక్ష్మి రూటే సపరేటు అనవచ్చు. సాధారణంగా కథానాయకిగా ఎదుగుతున్న నటీమణులు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించడానికి అంగీకరించరు. తరువాత అలాంటి పాత్రలకే పరిమితం చేస్తారనే భయమే అందుకు కారణం. అయితే ఇందుకు పూర్తి భిన్నం వరలక్ష్మి. ఓటమి నుంచి విజ యం వైపు అడుగులు వేస్తున్న నటి వరలక్ష్మి. తొలి చిత్రం పోడాపోడీ నిరాశపరిచింది. బాలా దర్శకత్వంలో నటించి న తారైతప్పట్టై చిత్రం పరాజయం పొందినా, వరలక్ష్మి నటిగా ప్రశంసలందుకుంది. అలాంటి ఈ సంచలన నటి ఎలాంటి పాత్రకైనా రెడీ అంటున్నారు. అలాగని ఆమెకు హీరోయిన్‌గా అవకాశాలివ్వడానికి దర్శక నిర్మాతలు వెనుకాడడం లేదు. మిస్టర్ చంద్రమౌళి చిత్రంలో చిన్న పాత్రలోనే కని పించింది.
అయితే అది కథకు కీలకమేననుకోండి. అలా సండైకోళి–2, హెచ్చరికై ఇదు మనిదర్‌గళ్ నడమాడుం ఇడం, కన్నిరాశి, వెల్వెట్ నగరం, సర్కార్, మారి–2, నీయా 2, శక్తి చిత్రాలు చేస్తూ హీరోయిన్‌గా, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ వంటి పాత్రల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది. తాజాగా మరో చిత్రానికి సంతకం చేసింది. జేకే అనే నవదర్శకుడి దర్శకత్వంలో నటించనుంది. సాయి సమరత్ మూవీస్ పతాకంపై జయప్రకాశ్, పవిత్ర కే.జయరామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఇందులో వరలక్ష్మి అంధురాలిగా నటించనుండడం విశేషం.దీనికి శ్యామ్.సీఎస్ సంగీతాన్ని, మెథ్యూ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.