
భీమవరం టౌన్:ఆయన ఎందరికో విద్యనేర్పిన మాస్టారు. నేడు వృద్ధాప్య పింఛను కోసం అందరి చుట్టూ తిరుగుతూ.. మలి జీవితంలో కొత్త పాఠాలు నేర్చుకుంటున్నారు. జీవనయాత్రలో తగిలిన ఎదురు దెబ్బలకు మతిచలించి, కంటిచూపు దెబ్బతిన్న ఆ మాస్టారుకు తోడు, నీడగా భార్య ఉన్నారు. కుటుంబ పోషణకు ప్రభుత్వం మంజూరు చేసే వెయ్యి రూపాయల పింఛను కోసం ఆ వృద్ధ దంపతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా ఫలితం మాత్రం దక్కడం లేదు.
ఈ నెలలో అయినా పింఛను వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసినఆ దంపతులకు మళ్లీ నిరాశే ఎదురైంది. ప్రజా సాధికారిత సర్వేలోనమోదు కాలేదంటూ ఆ మాస్టారుకు పెన్షన్ మంజూరు చేయలేదు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఓ తెలుగు మాస్టారు గోడు ఇది.
ఆ మాస్టారు పేరు తూరుభట్ల కృష్ణ. వయస్సు 68. నడుము వంగిపోయి.. మతిస్థిమితం సరిగా లేక.. కళ్లు కనిపించని స్థితిలో ఉన్న కృష్ణ మాస్టారును భార్య శ్యామల రిక్షాలో ఎక్కించుకుని సోమవారం భీమవరం మున్సిపాలిటీకి తీసుకువచ్చింది. ఈనెల కూడా పింఛను మంజూరు కాలేదని తెలిసి ఆమె నిశ్చేçష్టురాలయ్యారు. ఒక్క నిమిషం పాటు భర్త చేతిని వదిలి ఆమె మున్సిపల్ సిబ్బందిని వివరాలు కనుక్కుంటున్న సమయంలో.. ఆసరా కోల్పోయానేమోనని కంగారు పడుతూ ఓయ్ ఓయ్ అని పిలుస్తున్న భర్తను సమీపించి చేతిని ఆసరాగా ఇచ్చి ఏమీకాలేదులెండి అంటూ సముదాయిస్తున్న ఆమెను సాక్షి పలుకరించగా కన్నీటి పర్యంతమయ్యారు. తమ కుటుంబ గోడును శ్యామల వెళ్లబోసుకున్నారు. ఆమె తెలిపిన వివరాలు ఆమె మాటల్లోనే...
మతిస్థిమితం లేదు.. కళ్లు కనిపించవు
తూరుభట్ల కృష్ణ 1949లో రాజమహేంద్రవరంలో జన్మించారు. బీఏ వరకు చదువుకున్నారు. తెలుగుభాషపై మంచి పట్టు ఉంది. ప్రైవేటు విద్యా సంస్థల్లో తెలుగు పాఠాలు బోధించేవారు. భీమవరానికి చెందిన తనకు ఆయనతో వివాహమైంది. మాకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. 1985లో పాలకోడేరు వచ్చి భారతీ కాన్వెంట్‌ను స్థాపించాం. 2004 వరకూ ఆ కాన్వెంట్‌ను నడిపాం. ఆ తర్వాత ఇద్దరు కుమార్తెల వివాహ నిమిత్తం కాన్వెంట్‌ను అమ్మేశాం. ఒక కుమార్తెకు గోపాలపురం, మరో కుమార్తెకు రాజమహేంద్రవరంలో సంబంధాలు చూసి పెళ్లిళ్లు చేశాం. భీమవరం ప్రాంతంలో పలు ప్రైవేటు కాన్వెంట్లలో ఆయన తెలుగు పాఠాలు బోధించేవారు. ఆ వచ్చిన జీతంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాళ్లం. కొన్నేళ్ల క్రితం గోపాలపురం సంబంధం చేసిన కుమార్తె సమస్యలతో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందింది. కుమార్తె మృతదేహాన్ని చూసిన కృష్ణ మాష్టారు షాక్‌కు గురై తలను గోడకేసి కొట్టుకోవడంతో నరాలు చిట్లి మతి చలించడంతో పాటు కంటిచూపు కోల్పోయారు.
తోటివారి సాయంతో కుటుంబ పోషణ
ఆ తర్వాత ఆయన వద్ద పనిచేసిన కొందరు ఉపాధ్యాయులు, పలు కాన్వెంట్లు,, విద్యా సంస్థల్లోని అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు చేసిన సహాయంతో జీవనం గడుపుతున్నాం. మందులు, కుటుంబ పోషణకు ఎన్నో ఇబ్బందులు పడుతూ నెట్టుకువస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా ఆయనకు వృద్ధాప్య పింఛను వస్తుందని దరఖాస్తు చేసుకుంటున్నా రావడంలేదు. ఇటీవలే ఏలూరు వెళ్లి అధికారులను కలిసి గోడు చెప్పుకున్నాం. ఏప్రిల్ నెలలో వస్తుందని చెప్పడంతో ఇక్కడికి వచ్చాం. తీరా సర్వేలో నమోదు కా>లేదని అందువల్ల పింఛను రాదని చెబుతున్నారు. విషయాన్ని మున్సిపల్ అధికారుల దృష్టికి సాక్షి తీసుకువెళ్లగా ప్రజా సాధికారిత సర్వేలో ఆ కుటుంబ వివరాలు నమోదు చేయించి పింఛనుకు దరఖాస్తు చేయిస్తే మంజూరు అవుతుందని చెప్పారు.
మున్సిపల్ కమిషనర్ ఏమన్నారంటే
కృష్ణ మాస్టారు పింఛను వ్యవహారంపై సాక్షి మున్సిపల్ కమిషనర్ నాగనర్సింహారావును ప్రశ్నించగా ఆయన ఇలా అన్నారు. ఆయన గతంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ పింఛను మంజూరు కాకపోవడానికి కారణాలు ఏమిటో తెలుసుకుంటాను. ఆయన అర్హుడైనప్పటికీ మంజూరు సమయంలో దరఖాస్తుపై పొందుపరిచిన చిరునామాలో అందుబాటులో లేకపోతే నాట్ ట్రేస్డ్ అని ఉద్యోగులు పైకి నివేదిక పంపాల్సి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కృష్ణ మాస్టారుకు పింఛను మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తాం. సాధికారిత సర్వేలో లేరని తెలిసింది. ఆ సర్వేలో కూడా ఆ కుటుంబం పేర్లు పొందుపరిస్తే త్వరితగతిన పింఛను మంజూరయ్యేందుకు అవకాశాలు ఉంటాయి. ఆయనకు సొంతిల్లు లేకపోతే ప్రభుత్వం అందరికీ ఇళ్లు పథకంలో వచ్చేందుకు కృషి చేస్తాను.
Comments
Please login to add a commentAdd a comment