
పెద్దపప్పూరు: ఆస్తి కోసం అంధురాలిపై సొంత తమ్ముడి భార్యే హత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన మేరకు... పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటకు చెందిన పెద్దక్క, నాగార్జున అక్కాతమ్ముడు. పెద్దక్కకు కళ్లు కనిపించవు. ఆమె ఆస్తిపై కన్నేసిన తమ్ముడు నాగార్జున, అతని భార్య స్వాతి.. సోమవారం ఉదయం పెద్దక్కను గ్రామ శివారులోని అక్కమ్మ గుడి వద్దకు పిలుచుకెళ్లారు.
ఆమె పేరున ఉన్న ఆస్తిని తన పేరున రాయాలని ఆ సమయంలో పెద్దక్కతో నాగార్జున గొడవపడ్డాడు. ఇందుకు అంగీకరించకపోవడంతో పక్కనే ఉన్న పెద్ద బండరాయిని స్వాతి తీసుకుని పెద్దక్క తలపై దాడి చేసింది. ఆ సమయంలో ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. అప్పటికే నాగార్జున, స్వాతి పారిపోయారు. తలకు తీవ్రగాయమైన పెద్దక్కను స్థానికులు వెంటనే తాడిపత్రి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
కాగా, పెద్దక్క తండ్రికి ఐదుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అంధురాలైన పెద్దక్కకు పెళ్లి కాలేదు. తనకున్న నాలుగు ఎకరాల భూమిని కుమార్తెలతో పాటు కుమారుడికీ తండ్రి భాగ పరిష్కారాలు చేసిచ్చాడు. అయితే ఒంటరిగా ఉన్న పెద్దక్క ఆస్తిని ఎలాగైనా తమ పేరున రాయించుకోవాలని నాగార్జున భార్య స్వాతి ప్రయత్నించి విఫలం కావడంతో హతమార్చేందుకు ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment