ఈ చిరుదివ్వెలను వెలిగించండి!
► పుట్టుకతోనే చూపు కోల్పోయిన కవలలు
► ఆపరేషన్ చేయాలన్న వైద్యులు
► దాతల సాయం కోసం తల్లిదండ్రుల ఎదురుచూపు
కర్ణాటక: బళ్లారి జిల్లాలోని కంప్లి పట్టణంలో స్థానిక 22వ వార్డు ఆశ్రయ కాలనీ ఎండీ క్యాంప్‌లోని చౌడేశ్వరి ఆలయ సమీపంలో నివాసం ఉంటున్న రామాంజిని, శ్యామల దంపతులు ప్లాస్టిక్ బిందెలు, బుట్టలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. శ్యామలకు తొలి కాన్పులో మగశిశువు జన్మించి క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. రెండో కాన్పులో ఆడపిల్ల పుట్టింది. ఆ శిశువుకు ఎలాంటి సమస్య లేదు. మూడు నెలల క్రితం జరిగిన మూడో కాన్పులో ఇద్దరు ఆడ కవల పిల్లలు పుట్టారు. అయితే వారికి కంటి చూపు లేకపోవడంతో వెంటనే సమీపంలోని గంగావతికి వెళ్లి నేత్ర వైద్య నిపుణులకు చూపించగా, మెరుగైన వైద్యం కోసం హుబ్లీకి తీసుకెళ్లమని సూచించారు.
వారు చెప్పినట్లుగానే హుబ్లీకి వెళ్లి వైద్యులకు చూపించగా శస్త్రచికిత్స అవసరమని తేల్చారు. అయితే ఇద్దరు పిల్లల వయస్సు కేవలం నెల రోజుల్లోపే ఉండటంతో మూడు నెలలు నిండిన తర్వాత రావాలని, ఇద్దరి వైద్యానికి సుమారు రూ.70 వేలు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో శ్యామల దంపతులు తిరిగి కంప్లికి చేరుకున్నారు. ప్రస్తుతం చిన్నారులకు మూడు నెలలు నిండటంతో పిల్లల వైద్యానికయ్యే ఖర్చు భరించే ఆర్థిక స్తోమత లేక సతమవుతున్నారు. దాతలెవరైనా స్పందిస్తారోమని ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే సురేష్‌బాబును కలిసి పరిస్థితి వివరించగా స్పందించిన ఆయన బళ్లారి విమ్స్ ఆస్పత్రిలోనే చిన్నారులకు చికిత్సలు చేయిస్తానని భరోసా ఇచ్చారు.