
మార్‌బర్గ్.. జర్మనీలోని ఓ అద్భుత నగరం. కళ్లను కట్టిపడేసే ప్రాచీన భవంతులు, చుట్టూ పచ్చని పర్వతాలు, అందమైన రోడ్లు, ఆహ్లాదకరమైన వాతావరణం దీని సొంతం. జర్మనీలోని సుందర నగరాల్లో ఇది ఒకటి. వీటన్నింటిని మించిన ప్రత్యేకత మార్‌బర్గ్‌కు ఉంది. అంధుల సంక్షేమ నగరంగా దీనికి పేరుంది. వారు అత్యున్నత శిఖరాలను అందుకునేలా ముందుకు నడిపించే నగరంగా ఇది ప్రసిద్ధి చెందింది.
సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్: లియోన్ పోర్జ్‌కు పుట్టుకతో వచ్చిన అనారోగ్యం వల్ల 8 ఏళ్ల వయసులో క్రమంగా కంటిచూపు మందగించింది. సైన్స్ సంబంధిత విషయాల మీద లియోన్ పోర్జ్‌కు అమితాసక్తి ఉండేది. అదే సమయంలో మార్‌బర్గ్ నగరం గురించి.. అంధుల కోసం అక్కడ ఉన్న విద్యా సంస్థల గురించి పోర్జ్ తెలుసుకున్నాడు. వెంటనే సెంట్రల్ జర్మనీలోని తన స్వస్థలం నుంచి సమీపంలోని మార్‌బర్గ్‌కు మారిపోయాడు. ఇలాంటి వారు అనేక మంది ఇక్కడ చదువుకుంటున్నారు. ప్రతిభా పాటవాలు చాటుతున్నారు.
నగరమంతా ‘ప్రత్యేక’మే..
అంధుల విద్యోన్నతి కోసం మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇక్కడ ‘బ్లిస్టా’ అనే విద్యా సంస్థను ఏర్పాటు చేశారు. ఈ విద్యా సంస్థ ఎంతో మంది అంధ విద్యార్థుల జీవితాలను మార్చేసింది. దీనిని స్థాపించినప్పటి నుంచి ఇక్కడి విద్యార్థులు అనేకఆవిష్కరణలు చేశారు. టాక్టైల్ అనే మ్యాథమెటికల్ ఫాంట్‌ను కూడా కనుగొన్నారు. కాలక్రమేణా మార్‌బర్గ్.. ఓ ఆదర్శ నగరంగా మారింది. ఇక్కడ బ్లిస్టాతో పాటు అంధుల కోసం మరికొన్ని విద్యా సంస్థలు ఏర్పాటయ్యాయి. వారు నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనుకున్నా ఎలాంటి భయాలు లేకుండా తిరిగేలా మార్పులు తీసుకొచ్చారు. వారిని అప్రమత్తం చేసే బీపింగ్ ట్రాఫిక్ సిగ్నల్స్, ప్రత్యేక రహదారులు, అవసరమైన చోట్ల వాటిపై కాస్త ఎత్తయిన సిగ్నల్స్ ఏర్పాటు చేశారు.
చదవండి: వరల్డ్ కార్ ఫ్రీ డే: ఈ విశేషాలేంటో తెలుసా?
అలాగే మార్‌బర్గ్‌ను సందర్శించేందుకు వచ్చే పాక్షిక అంధుల కోసం ఎక్కడికక్కడ నగర ల్యాండ్‌మార్క్స్‌ను తెలియజేసే చిన్న చిన్న రూపాలను ఉంచారు. వీటి సాయంతో వారు సులభంగా తాము వెళ్లాలనుకొన్న ప్రదేశానికి వెళ్లొచ్చు. అంధుల కోసం ప్రత్యేకంగా హార్స్ రైడింగ్, ఫుట్‌బాల్, రోయింగ్, క్లైంబింగ్ క్లబ్‌లున్నాయి. తరచూ వారికి పోటీలు నిర్వహిస్తూ ప్రోత్సహిస్తుంటారు. అలాగే బస్ స్టాప్‌లను కూడా వీరికి తగిన సమాచారమిచ్చేలా రూపొందించారు. వీరితో ఎలా ప్రవర్తించాలనే అంశాలపై తరచూ డ్రైవర్లు, రెస్టారెంట్లలోని సిబ్బందికి శిక్షణ ఇస్తుంటారు. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాల మెనూ కూడా బ్రెయిలీ లిపిలో ఉంటుంది.
బయోకెమెస్ట్రీతో రికార్డుల్లోకి..
బ్లిస్టాతో పాటు ఇక్కడి విద్యాసంస్థల్లో చదువుకునే వారు భారీ పుస్తకాలతో ఇబ్బంది పడకుండా.. ప్రత్యేక స్క్రీన్ రీడర్స్ అందుబాటులో ఉంటాయి. లియోన్ పోర్జ్ ప్రస్తుతమిక్కడ కంప్యూటర్ సైన్స్, బయోకెమిస్ట్రీ చదువుతున్నాడు. మొత్తం జర్మనీలోనే చాలా తక్కువ మంది ఎంచుకొనే ‘బయోకెమిస్ట్రీ’ చదువుతున్న మొట్టమొదటి అంధ విద్యారి్థగా పోర్జ్ రికార్డుల్లోకి ఎక్కాడు. సాధారణ మనుషులే ఇందులో ఉండే చిత్రాలు, ల్యాబ్ ప్రయోగాలు నేర్చుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ దీనికి కూడా మార్‌బర్గ్‌లోని విద్యా సంస్థలు ప్రత్యామ్నాయాలను కనుగొన్నాయి. అంధ విద్యార్థులు వీలైనంత సులభంగా చదువుకునేలా ఇక్కడి అధ్యాపకులు ఎప్పటికప్పుడు సులభమైన మార్గాలు కనుగొంటూ, విద్యార్థులతోనే విభిన్న ఆవిష్కరణలు చేయిస్తున్నారు. కోవిడ్ పరిస్థితుల్లో కూడా వీరు ఎలాంటి ఇబ్బంది పడకుండా చదువులో ముందుకు దూసుకువెళ్తున్నారు.
చదవండి: వరల్డ్ రోజ్ డే: ఈరోజు గెలిచాను.. జీవిస్తున్నాను అనే అనుభూతి పొందండి