Blind Woman Meenakshi Gupta Detects Early Stage Breast Cancer - Sakshi
Sakshi News home page

Breast Cancer: చూపు లేదు కాని క్యాన్సర్‌ని గుర్తిస్తారు!

Published Wed, Aug 2 2023 9:37 AM | Last Updated on Wed, Aug 2 2023 10:36 AM

Blind Woman Meenakshi Gupta Detects Early Stage Breast Cancer - Sakshi

స్త్రీలలో బ్రెస్ట్‌ కేన్సర్‌ ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుంది. రేడియేషన్‌తో కూడిన మామోగ్రఫీ కన్నా స్పర్శతో బ్రెస్ట్‌ కేన్సర్‌ను గుర్తించడాన్ని ‘టెక్టయిల్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌’ అంటారు. స్పర్శ మీద ఎక్కువగా ఆధారపడ్డ అంధ మహిళలకు ఒక ఉపాధిగా. స్పర్శతో కేన్సర్‌ను గుర్తించడంలో శిక్షణ ఇస్తున్నారు. ఢిల్లీలో ఇప్పటికే 18 మంది అంధ మహిళలు ఈ శిక్షణ పొందారు. ఇతర అంధ మహిళలను ఈ రంగంలోకి ఆహ్వానిస్తున్నారు. స్త్రీలు పరస్పరం మేలు పొందే ఈ విశేష కార్యక్రమాన్ని ‘లైఫ్‌ సేవింగ్‌ హ్యాండ్స్‌’ అంటున్నారు. 

న్యూఢిల్లీకి చెందిన 31 ఏళ్ల మీనాక్షి గుప్తా ప్రతి ఉదయం మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు అందరూ ఆమెను సాధారణ అంధురాలు అనుకుంటారు. కాని తాను పనిచేసే హాస్పిటల్‌కు ఆమె చేరుకున్నాక ఆ అంధురాలిలోని అసామాన్య నైపుణ్యం తెలిసి ఆశ్చర్యపోతారు. ఆమె ‘టెక్టయిల్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌’ నిపుణురాలు. ఇలాంటి నిపుణులను ‘మెడికల్‌ టెక్టయిల్‌ ఎగ్జామినర్‌’ (ఎం.టి.ఇ) అంటారు. వీరు చేతి స్పర్శతో స్త్రీల వక్షోజాలలో వచ్చిన అతి చిన్న లంప్స్‌ను కూడా గుర్తించి కేన్సర్‌ బారిన పడకుండా కాపాడుతారు. బ్రెస్ట్‌ కేన్సర్‌ను స్త్రీలు ఎవరికి వారు స్పర్శ ద్వారా చెక్‌ చేసుకుంటూ లంప్స్‌ను గుర్తించవచ్చు. కాని అందరూ సరిగ్గా గుర్తించలేరు. చిన్న లంప్స్‌ను అసలు గుర్తించలేరు. కాని ‘టెక్టయిల్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌’ నిపుణులు మాత్రం అతి చిన్న లంప్స్‌ను కూడా గుర్తించడంలో శిక్షణ పొందుతారు.

అంధ మహిళలే ఎందుకు?
‘టెక్టయిల్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌’ను జర్మనీకి చెందిన గైనకాలజిస్ట్‌ ఫ్రేన్‌ హాఫ్‌మేన్‌ కనుగొన్నాడు. బ్రెస్ట్‌ కేన్సర్‌ను గుర్తించే మామోగ్రఫీలో రేడియేషన్‌ ఉంటుంది. ఖర్చు కూడా. కాని చేతులతో గుర్తించడంలో ఎటువంటి రేడియేషన్‌ ఉండదు. ఖర్చు కూడా ఉండదు. అందుకే చేతి స్పర్శ ద్వారా ఎలా బ్రెస్ట్‌ కేన్సర్‌ను గుర్తించవచ్చో అతను కొన్ని పద్ధతులను ప్రతిపాదించాడు. ఇందులో శిక్షణకు అంధ మహిళలను ఎంచుకున్నాడు. ఎందుకంటే చూపు లేకపోవడం వల్ల అంధులు స్పర్శ మీద ఎక్కువగా ఆధారపడతారు. వారు తమ స్పర్శతో కచ్చితంగా లంప్స్‌ను గుర్తించగలరని ఊహించాడు. అతని ఊహ నిజమైంది. అంధ మహిళల స్క్రీనింగ్‌లో కేవలం 1 శాతం మాత్రమే తప్పు అంచనా వచ్చి మిగిలిన 99 శాతం నిర్థారిత అంచనా వచ్చింది. దాంతో అతను ఒక సేవాకార్యక్రమంగా ‘లైఫ్‌ సేవింగ్‌ హ్యాండ్స్‌’ పేరుతో ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, కొలంబియా, మెక్సికో, ఇండియాలలోని ఆయా ప్రభుత్వ అంధుల పర్యవేక్షణ సంస్థలను కోరారు. మన దేశంలో 2017 నుంచి ఈ శిక్షణ జరుగుతోంది. ఇప్పటికి 18 మంది ఎం.టి.ఇలు శిక్షణ పొందారు. మరో 8 మంది ఇప్పుడు శిక్షణ పొందుతున్నారు.

9 నెలల శిక్షణ
ఢిల్లీలోని ‘బ్లైండ్‌ ఇండియా సెంటర్‌ ఫర్‌ బ్లైండ్‌ విమెన్‌ అండ్‌ డిజేబిలిటీ స్టడీస్‌’ (ఎన్‌.ఏ.బి.సి.బి.డబ్లు్య)లో మెడికల్‌ టెక్టయిల్‌ ఎగ్జామినర్‌ (ఎం.టి.ఇ)లుగా శిక్షణను ఇస్తున్నారు. అంధ మహిళలు, చూపు లోపం పాక్షికంగా ఉన్నవారు ఈ శిక్షణను పొందవచ్చు. 9 నెలలు ట్రైనింగ్‌ ఉంటుంది. ఆరు నెలలు సెంటర్‌లో, మూడు నెలలు ఆస్పత్రిలో పని చేయాలి. ఈ ట్రయినింగ్‌లో ఇంగ్లిష్, కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేయడం, మానవ శరీర నిర్మాణంలో ప్రాథమిక అవగాహన తదితరాలు నేర్పిస్తారు. ‘అంధులు బ్రెస్ట్‌ కేన్సర్‌ను స్పర్శతో ఎలా గుర్తించగలరా అని ముందు సందేహించాను. కాని జర్మనీకి వెళ్లి చూశాక మన దేశంలో అంధ మహిళలకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను’ అన్నారు బ్లైండ్‌ ఇండియా సెంటర్‌ డైరెక్టర్‌ షాలినీ ఖన్నా.

క్యాంపులలో సేవలు
బ్లైండ్‌ ఇండియా సెంటర్‌ తరచూ బ్రెస్ట్‌ కేన్సర్‌ అవేర్‌నెస్‌ క్యాంపులను నిర్వహిస్తోంది. ఈ క్యాంపుల్లో ఎం.టి.ఇలు తమ స్పర్శతో స్క్రీనింగ్‌ సేవలు అందిస్తున్నారు. ‘4 మిల్లీమీటర్ల చిన్న లంప్‌ను కూడా ఎం.టి.ఇలు గుర్తిస్తున్నారు’ అని క్యాంప్‌ నిర్వాహకులు తెలియచేస్తున్నారు. వీరి నిర్థారణ తప్పడం లేదు కనుక అంధ మహిళలు ఈ శిక్షణ తీసుకుని ఈ సేవలను కొనసాగిస్తూ ఉపాధి పొందాలని బ్లైండ్‌ ఇండియా సెంటర్‌ తెలియచేసింది.

(చదవండి: వెన్నునొప్పే కదా! అని తేలిగ్గా తీసుకోకండి! ఆ వ్యాధికి సంకేతం కావోచ్చు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement