
హైదరాబాద్ లో ప్రపంచ అంధుల టి20 సెమీస్
హైదరాబాద్: వచ్చే నెల 10వ తేదీన నగరంలోని ఎల్బీ స్టేడియంలో అంధుల టి20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నట్లు నిర్వాహక సంస్థ సమర్ధనం ట్రస్ట్ ఫర్ డిసేబుల్డ్ వ్యవస్థాపక ట్రస్టీ , క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద బ్లైండ్ ఇన్ ఇండియా సభ్యుడు మహంతేష్ జీకే పేర్కొన్నారు. శుక్రవారం బేగంపేట పర్యాటక భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జనవరి 28వ తేదీన ఢిల్లీలో ప్రారంభమయ్యే పోటీల్లో భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, నేపాల్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు బరిలోకి దిగుతాయని తెలిపారు.
ఫైనల్ మ్యాచ్‌ను బెంగళూరులో నిర్వహిస్తామని తెలిపారు. భారత జట్టు మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ టోర్నీ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారన్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... దివ్యాంగులకు సానుభూతి కాకుండా అన్ని రంగాల్లో అవకాశాలు ఇచ్చి వారి సత్తాను వెలికితీయడానికి పాటుపడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి , సమర్ధనం ట్రస్ట్ నిర్వాహకుడు సుబ్బు, కమిటీ సభ్యులు జెహరా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.