మీ ఓటు.. మీ హక్కు ! | Your Vote Your Life Mahabubnagar | Sakshi
Sakshi News home page

మీ ఓటు.. మీ హక్కు !

Published Fri, Jan 25 2019 7:53 AM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM

Your Vote Your Life Mahabubnagar - Sakshi

పాలమూరు : ఓటు సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం.. రాజకీయ చరిత్రను తిరగరాయాలన్నా.. సమర్థులైన నాయకులను ఎన్నుకోవాలన్నా ఓటు హక్కు ఉంటేనే సాధ్యం. ఇంతటి విలువైన ఓటు హక్కుపై పలువురు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఓటు హక్కు కోసం దరఖాస్తే చేసుకోకపోగా.. మరికొందరు ఓటు హక్కు ఉన్నా పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారు. తద్వారా రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు నిరాదరణకు గురవుతోంది. ఈ మేరకు శుక్రవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యారు.

10.26 లక్షల మంది 
జిల్లాలో చేపట్టిన 2018–స్పెషల్‌ సమ్మరి రివిజన్‌(ఎస్‌ఎస్‌ఆర్‌) పూర్తయ్యే సరికి మొత్తం 10,26,728 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 5,13,091 మంది కాగా, మహిళలు 5,13, 581 మంది ఉన్నారు. ఇక ఇతరులు (థర్డ్‌జెండర్‌) 56మంది ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నారు.

పెరిగిన ఓటర్లు 
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల వారీగా 2018 ఓటరు తుది జాబితా..తాజా లెక్కలను పరిశీలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగింది. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు తమకు ఓటు హక్కు గల్లంతైందని పేర్కొన్నారు. దీంతో ఎన్నికల కమిషన్‌ కొత్తగా అర్హత ఉన్న వారితో పాటు ఓటు హక్కు ఉండి జాబితాలో పేర్లు గల్లంతైన వారి కోసం మరో అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ఈ ఏడాది ఇప్పటి వరకు 46,994 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా ఇందులో 11,504మంది ఓటు హక్కు కల్పించారు. ఇంకా పలువురి దరఖాస్తులను తిరస్కరించగా.. మరికొన్ని పరిశీలనలో ఉన్నాయి.

ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు 
జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు శుక్రవారం ప్రత్యేకంగా ఓటరు సహాయ కేంద్రాలను జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల వద్ద బూత్‌లెవల్‌ అధికారు(బీఎల్‌ఓ)లు అందుబాటులో ఉంటారు. బీబిఎల్‌ఓలను కలిసి నేరుగా ఓటు నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులు వంటి సవరణలకు సంబంధించిన దరఖాస్తులు ఇవ్వొచ్చు. దీంతో పాటు ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే వెసలుబాటు కల్పించారు.

అలాగే, కొత్తగా ఓటర్లుగా నమోదైన పది మంది ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించనున్నారు. ఇవేకాకుండా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు, సెమినార్లు, మానవహారాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించనున్నారు. ఇంకా జిల్లా స్థాయిలో సైతం మానవహారాలు, ఓటర్ల దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. అలాగే, ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్‌ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు.

ఓటుహక్కు పొందడం ఇలా... 
సమాజంలో 18 ఏళ్ల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు పొందేందుకు అర్హులు. ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవడంతో పాటు.. ఇదివరకే ఓటు ఉన్న వారు జాబితాలో పేరు ఉందా, లేదా అన్నది తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ద్వారా అవకాశం కల్పించారు. తద్వారా కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌లో పరిశీలించొచ్చు. 

అవగాహన కల్పిస్తున్నాం 
జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ఇప్పటికే విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా ప్రతిభ కనబర్చిన ఐదుగురు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుండి క్లాక్‌ టవర్‌ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ విద్యార్థులతో మానవహారం, ప్రతిజ్ఞ చేయిస్తాం. టౌన్‌హాల్‌లో ఓటరు దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బీఎల్‌ఓల ఆద్వర్యంలో కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు జారీ చేస్తాం. – స్వర్ణలత, డీఆర్వో, మహబూబ్‌నగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement