ఓటరు జాబితాలో ఇప్పటివరకూ పేర్లు నమోదు చేయించుకోని వారి కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇందుకోసం ఆదివారం ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో పేర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
ఆయా కేంద్రాల్లో బూత్‌లెవెల్ అధికారులు (బీఎల్‌వో) అందుబాటులో ఉంటారు. ఇప్పటికే జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకున్నవారు జాబితాలో తమ పేరు చేరిందో లేదో చూసుకునేందుకు తాజా ఓటర్ల జాబితానబప్రదర్శిస్తారు. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 5 వరకు దరఖాస్తు చేసుకున్న వారు సైతం తమ పేర్లు జాబితాలో చేరాయో లేదో చూసుకోవచ్చు. పొరపాట్ల సవరణలు, చిరునామా మార్పులకు అవకాశం లేదు.
జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌వోలు అందుబాటులో ఉంటారు.ఉదయం 10-సాయంత్రం 5 వరకు వీరు అందుబాటులో ఉంటారు. కొత్తగా ఓటు హక్కు పొందాలనుకునేవారికి ఫారం-6 అందజేస్తారు. ఇందుకు 18 ఏళ్లు నిండినవారు అర్హులు. వయసు నిర్ధారణకు జనన ధ్రువీకరణ పత్రం సమర్పించాలి పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకువెళ్లాలి.చిరునామా ధ్రువీకరణకు రేషన్‌కార్డు/బ్యాంకు పుస్తకం/ఆధార్‌కార్డు/ ఇతరత్రా ఆధారమేదైనా చూపాలి.ఓటరు జాబితాలో ఎప్పుడైనా పేరు నమోదు చేసుకోవచ్చు.
కానీ మార్చి 31 లోగా దరఖాస్తు చేసుకునేవారికే మేలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం. తుది జాబితా ఏప్రిల్ 9న వెలువరిస్తారు.ఆ జాబితాలో పేర్లున్నవారే మే లో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులవుతారు.