
సాక్షి, మహబూబ్‌నగర్: అనేక అభ్యంతరాలు.. సవరణల అనంతరం ఎట్టకేలకు ‘పుర’ ఓటర్ల జాబితా విడుదలైంది. ఉమ్మడి పాలమూరు జిల్లా పరిధిలో ఎన్నికలు జరగనున్న 17 మున్సిపాలిటీల్లో ఉన్న 338 వార్డుల్లో మొత్తం 5,23,489 మంది ఓటర్లు ఉన్నట్లు తేలింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఓటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ఎన్నికల నిర్వహణలో భాగంగా.. గతేడాది జూన్ నెలాఖరులోనే అన్ని మున్సిపాలిటీల్లో ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన కులాల వారీగా ఓటర్లను గుర్తించారు. అయితే.. ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లడం.. అందులో తమ పేర్లు లేకపోవడం, లోపభూయిష్టమైన వార్డుల విభజనతో అనేక మంది ఆశావహులు, వివిధ పార్టీల నాయకులు మూడు నెలల క్రితమే హైకోర్టును ఆశ్రయించారు.
అనేక వాదనలు, ఫిర్యాదులపై వచ్చిన విచారణ అనంతరం గత నెలలోనే హైకోర్టు ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో అధికారులను పంపింది. ఓటర్ల జాబితా, వార్డుల విభజన విషయంలో దొర్లిన తప్పులను సవరించింది. తాజాగా గత నెల 30న ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించి ఈనెల 2 తేదీ వరకు 374 అభ్యంతరాలను స్వీకరించింది. 3న పరిశీలించి శనివారం తుది జాబితాను విడుదల చేసింది.
మహిళలే న్యాయ నిర్ణేతలు
ఈసారి ఎన్నికలు జరగనున్న 17 మున్సిపాలిటీలకు గానూ 11 పురపాలికల్లో మహిళా ఓటర్లే న్యాయనిర్ణేతలుగా మారనున్నారు. మహబూబ్‌నగర్, గద్వాల, నారాయణపేట, వడ్డేపల్లి, మక్తల్, అయిజ, కోస్గి, ఆత్మకూరు, భూత్పూర్, అమరచింత, ఆలంపూర్ మున్సిపాలిటీల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో మొత్తం 5,23,489 మంది ఓటర్లు ఉంటే.. వారిలో 2,62,449 మంది మహిళలు, 2,60,912 మంది పురుషులు మిగిలినవి ఇతరులు ఉన్నారు.