voter applications Checking
-
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ
సాక్షి, పాలకొండ : జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ పూర్తి చేసేందుకు పక్కాగా ఏర్పాట్లు చేపడుతున్నామని కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. శుక్రవారం ఆయన పాలకొండ నియోజకవర్గంలో పర్యటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కొత్తగా ఓటు నమోదు కోసం 84వేల దరఖాస్తులు అందాయని, అందులో ఇంకా 24వేల దరఖాస్తులు పరిశీలించి ఓటరు కార్డులు జారీ చేయాల్సి ఉందని తెలిపారు. వీరందరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇంతవరకూ జిల్లాలో 2,674 ఓట్లు తొలగించామని తెలిపారు. ఎన్నికలకు సంబంధించి పీవో, ఏపీవోలను నియమించామని వారికి 16వ తేదీన నియోజకవర్గాల్లో శిక్షణ అందిస్తామని వివరించారు. వచ్చేనెల 3వ తేదీన మరో మారు శిక్షణ అందించాల్సి ఉందని తెలిపారు. ప్రతి మండలానికి ఫ్లయింగ్ స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. వారితో పాటు 50మందిని ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి నిఘా పెంచామని వివరించారు. ఉధ్యోగులు ఎటువంటి ఇబ్బంది పడకుండా పోస్టల్ బ్యాలెట్లు వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. 470 పోలింగ్ కేంద్రాలకు ర్యాంపులు ఏర్పాటు చేశామని, 62 కేంద్రాలకు మరుగుదొడ్లు, 71 కేంద్రాల్లో తాగునీటి బోర్లు అందుబాటులోకి తీసుకువచ్చామని వివరించారు. మద్యం, ధనం, ఎన్నికల నియమావళి అమలుకు ప్రత్యేక బృందాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం ఆయన డీఎస్పీ ప్రేమ్‌కాజల్‌తో మాట్లాడి బందోబస్తు ఏర్పాట్లపై సూచనలు అందజేశారు. ఈవీఎంలను భద్రపరచనున్న డిగ్రీ కళాశాలను సందర్శించి పరిశీలించారు. పర్యటనలో కలెక్టర్‌తో పాటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎల్.రఘుబాబు, తహసీల్దార్ నరసింహ, ఎన్నికల సిబ్బంది ఉన్నారు. -
మీ ఓటు లేకపోతే.. దరఖాస్తు చేసుకోండిలా!
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన వేళా.. ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి ‘సాక్షి’ నడుం బిగించింది. తెలంగాణ, ఏపీలోని లోక్‌సభ స్థానాలతోపాటు.. ఏపీలో అసెంబ్లీకి ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటు నమోదు చేసుకోనివారు, ఓటరు జాబితాలో తమ పేరు లేనివారు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఐదు రోజు సమయం ఇచ్చింది. ఈ గడువు మార్చి 15 వ తేదీతో ముగుస్తుంది. ఆన్లైన్లో లేదా సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఫాం 6ను సమర్పించడం ద్వారాగాని ఓటర్‌గా నమోదుకు దరఖాస్తు చేయాలి. ఈ సందర్భంగా ఓటు ప్రాముఖ్యత తెలిపేలా సాక్షి ప్రచారం కల్పిస్తుంది. అంతేకాకుండా ఆన్లైన్లో ఓటు కోసం నమోదు చేసుకునేవారికి ఆ ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఓ వీడియోను రూపొందించింది. ఓటు ఎలా నమోదు చేసుకోవాలంటే... ఆన్లైన్లో ఓటు నమోదు చేసుకోవడానికి తొలుత ఎన్నికల సంఘం వెబ్సైట్ www.nvsp.in ఓపెన్ చేయాలి. అందులో ఫాం 6ను ఓపెన్ చేసి సంబంధిత భాషను ఎంచుకోవాలి. తర్వాత మీ రాష్ట్రం, మీ జిల్లా, నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాలి. తదుపరి మీ పేరు, ఇంటిపేరు, తండ్రిపేరు/భర్తపేరు(వారి ఇంటి పేరు కూడా) ఎంటర్ చేయండి. తదుపరి పుట్టిన తేదీ, జెండర్ వివరాలు నింపాలి. ప్రస్తుతం మీరు నివాసం ఉంటున్న చిరునామా, మీ శాశ్వత చిరునామాను దరఖాస్తులో పేర్కొనాలి. మీ కుటుంబ సభ్యుల లేదా మీ ఇంటి పక్కన ఉన్నవారి ఓటరు కార్డుపై ఉండే ఎపిక్ నంబర్‌ను ఎంటర్ చేయండి. తదుపరి మీ ఫొటో, వయస్సు ధ్రువీకరణ, అడ్రస్ ప్రూఫ్ డ్యాకుమెంట్లు అప్లోడ్ చేయాలి. మీ ఊరు, మీ రాష్ట్రం, మీ జిల్లా సెలక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎక్కడి నుంచి దరఖాస్తు చేస్తున్నారో తెలుపండి. చివరిగా క్యాప్చాలో చూపిన అక్షరాలను/నంబర్లను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఆ తర్వాత వెంటనే స్క్రిన్‌పై మీకు ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. మీరు ఆ నంబర్ సహాయంతో మీ దరఖాస్తు పురోగతిని ట్రాక్ చేసుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మన హక్కు.. దానిని వినియోగించుకోవడమంటే మన తలరాతను మనమే రాసుకోవడం. -
ఓటు ఎలా నమోదు చేసుకోవాలంటే...
-
ఓటరుగా నమోదుకు ఇక 4 రోజులే
సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల ముంగిట... రాష్ట్రంలో ఓటరుగా నమోదుకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇందుకు ఇక నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ స్వల్ప వ్యవధిలో నమోదు చేసుకోకపోతే వచ్చే నెల 11వ తేదీన జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయలేరు. కొత్తగా అర్హత సాధించినవారైనా లేదా ఓటర్ జాబితాలో పేరు లేనివారైనా ఈ నెల 15వ తేదీలోగా ఆన్లైన్(www.nvsp.in) ద్వారా గాని, సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఫాం 6ను సమర్పించడం ద్వారాగాని ఓటర్‌గా నమోదుకు దరఖాస్తు చేయాలి. ఈ విధంగా సమర్పించినవారికే 11వ తేదీన ఓటు వేసే హక్కు కల్పిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ‘18 సంవత్సరాలు నిండి ఇంకా ఓటర్‌గా నమోదు కాని యువత రాష్ట్రంలో 11 లక్షల మంది ఉన్నారు. వారంతా ఈ నెల 15వ తేదీలోగా ఫామ్– 6 సమర్పించాలి. ఓటర్ గుర్తింపు కార్డు ఉంది కదా అని ఓటున్నట్లు భావించవద్దు. జాబితాలో పేరుందో లేదో ఒకసారి తనిఖీ చేసుకోవాలి. ఓటరు కార్డున్నప్పటికీ జాబితాలో పేరు లేకుంటే పోలింగ్ రోజు ఓటు వేయలేరు. ఆన్లైన్లో కూడా తనిఖీ చేసుకోవాలి. పేరు లేకపోతే ఈ నెల 15వ తేదీలోగా ఫాం6 సమర్పిస్తే తప్పకుండా ఓటు హక్కు కల్పిస్తాం. సాధారణంగా నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటర్‌గా నమోదుకు అవకాశం ఉంటుంది. అయితే, ఇలా వచ్చిన దరఖాస్తులను తనిఖీ చేయడానికి నిబంధనల మేరకు పది రోజులు సమయం అవసరం. ఏడు రోజుల పాటు నోటీసులు జారీ చేయాలని, ఆ తరువాత తనిఖీకి, ఆమోదానికి మూడు రోజల సమయం పడుతుందని’ ద్వివేది వివరించారు. ఈ నేపథ్యంలోనే 15ను ఓటర్‌గా నమోదుకు చివరి తేదీగా పేర్కొన్నట్లు ప్రకటించారు. అప్పటివరకు వచ్చిన దరఖాస్తులు సక్రమంగా ఉంటే వారికి ఈ నెల 25వ తేదీలోగా ఓటు హక్కు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. -
దరఖాస్తులను ఆన్లైన్ చేయాలి
సాక్షి, సూపర్‌బజార్(కొత్తగూడెం): పోలింగ్ కేంద్రాల వారీగా వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తులను ఆన్లైన్ చేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ హాలులో ఓటరు నమోదు, తొలగింపు, మార్పులు, కళ్యాణలక్ష్మి, భూమి రికార్డుల శుద్ధీకరణ తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో పేరు తొలగింపును తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించడంతోపాటు నోటీసులు జారీ చేసిన తరువాత మాత్రమే తొలగించాలని అన్నారు. ఓటరు జాబితాలో పేరు తొలగింపు కోసం ఆన్లైన్ ద్వారా ఫారం 7లో వచ్చిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ నెల 2, 3 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో పోలింగ్ కేంద్రాల వారీగా వచ్చిన దరఖాస్తులను అప్లోడ్ చేయాలని అన్నారు. జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా లబ్ధిదారులకు ఆర్థికసాయం అందజేయడానికి వచ్చిన దరఖాస్తులను తక్షణం విచారణ జరిపించాలన్నారు. సమావేశంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గౌతం, జాయింట్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం సబ్ కలెక్టర్ భవేష్‌మిశ్రా, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు. సస్యరక్షణ కరపత్రాన్నిఆవిష్కరించిన కలెక్టర్ కొత్తగూడెంరూరల్: ఆయిల్‌పామ్, కొబ్బరి, జామ, ఇతర ఉద్యాన పంటలను ఆశిస్తున్న సర్పిలాకార తెల్లదోమ ఉనికి, ప్రభావం–సస్యరక్షణ చర్యలపై రూపొందించిన కరపత్రాన్ని జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆవిష్కరించారు. గురువారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎంతో మేలు చేసేవిధంగా ఉద్యాన శాఖాధికారులు ఈ కరపత్రాన్ని రూపొందించారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, ఎస్పీ సునీల్‌దత్, ఉద్యానవన శాఖాధికారి జినుగు మరియన్న తదితరులు పాల్గొన్నారు. -
మీ ఓటు.. మీ హక్కు !
పాలమూరు : ఓటు సామాన్యుడి చేతిలో బ్రహ్మాస్త్రం.. రాజకీయ చరిత్రను తిరగరాయాలన్నా.. సమర్థులైన నాయకులను ఎన్నుకోవాలన్నా ఓటు హక్కు ఉంటేనే సాధ్యం. ఇంతటి విలువైన ఓటు హక్కుపై పలువురు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఓటు హక్కు కోసం దరఖాస్తే చేసుకోకపోగా.. మరికొందరు ఓటు హక్కు ఉన్నా పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారు. తద్వారా రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు నిరాదరణకు గురవుతోంది. ఈ మేరకు శుక్రవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించేందుకు అధికారులు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు సిద్ధమయ్యారు. 10.26 లక్షల మంది జిల్లాలో చేపట్టిన 2018–స్పెషల్ సమ్మరి రివిజన్(ఎస్ఎస్ఆర్) పూర్తయ్యే సరికి మొత్తం 10,26,728 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 5,13,091 మంది కాగా, మహిళలు 5,13, 581 మంది ఉన్నారు. ఇక ఇతరులు (థర్డ్‌జెండర్) 56మంది ఓటర్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నారు. పెరిగిన ఓటర్లు మహబూబ్‌నగర్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల వారీగా 2018 ఓటరు తుది జాబితా..తాజా లెక్కలను పరిశీలిస్తే ఓటర్ల సంఖ్య పెరిగింది. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పలువురు తమకు ఓటు హక్కు గల్లంతైందని పేర్కొన్నారు. దీంతో ఎన్నికల కమిషన్ కొత్తగా అర్హత ఉన్న వారితో పాటు ఓటు హక్కు ఉండి జాబితాలో పేర్లు గల్లంతైన వారి కోసం మరో అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు ఈ ఏడాది ఇప్పటి వరకు 46,994 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోగా ఇందులో 11,504మంది ఓటు హక్కు కల్పించారు. ఇంకా పలువురి దరఖాస్తులను తిరస్కరించగా.. మరికొన్ని పరిశీలనలో ఉన్నాయి. ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు శుక్రవారం ప్రత్యేకంగా ఓటరు సహాయ కేంద్రాలను జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయనున్నారు. ఈ కేంద్రాల వద్ద బూత్‌లెవల్ అధికారు(బీఎల్ఓ)లు అందుబాటులో ఉంటారు. బీబిఎల్‌ఓలను కలిసి నేరుగా ఓటు నమోదు, తొలగింపు, మార్పులు, చేర్పులు వంటి సవరణలకు సంబంధించిన దరఖాస్తులు ఇవ్వొచ్చు. దీంతో పాటు ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకునే వెసలుబాటు కల్పించారు. అలాగే, కొత్తగా ఓటర్లుగా నమోదైన పది మంది ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించనున్నారు. ఇవేకాకుండా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు, సెమినార్లు, మానవహారాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ఓటు హక్కు ప్రాధాన్యతపై అవగాహన కల్పించనున్నారు. ఇంకా జిల్లా స్థాయిలో సైతం మానవహారాలు, ఓటర్ల దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. అలాగే, ఇటీవల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఓటుహక్కు పొందడం ఇలా... సమాజంలో 18 ఏళ్ల వయస్సు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు పొందేందుకు అర్హులు. ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవడంతో పాటు.. ఇదివరకే ఓటు ఉన్న వారు జాబితాలో పేరు ఉందా, లేదా అన్నది తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా అవకాశం కల్పించారు. తద్వారా కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వెబ్సైట్లో పరిశీలించొచ్చు. అవగాహన కల్పిస్తున్నాం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ఇప్పటికే విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించగా ప్రతిభ కనబర్చిన ఐదుగురు రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. శుక్రవారం కలెక్టరేట్ నుండి క్లాక్ టవర్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ విద్యార్థులతో మానవహారం, ప్రతిజ్ఞ చేయిస్తాం. టౌన్హాల్లో ఓటరు దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓల ఆద్వర్యంలో కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులు జారీ చేస్తాం. – స్వర్ణలత, డీఆర్వో, మహబూబ్‌నగర్ -
మున్సిపాలిటీల్లో ఎన్నికల విభాగాలు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మున్సిపాలిటీ ఎన్నికలకు త్వరితగతిన అడుగులు పడుతున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో ఈనెల 23 నుంచి ప్రారంభమైన ఓటర్ల కుల గణన ముమ్మరంగా సాగుతుండగా మరోపక్క ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు అవసరమైన మానవ వనరులపై పురపాలికలు దృష్టి సారించాయి. పాత మున్సిపాలిటీలను పక్కనబెడితే.. కొత్తగా ఏర్పాటైన తొమ్మిది మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా ఎన్నికల విభాగాలు ఎక్కడా లేవు. పురపాలికలు ఏర్పడ్డాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఎన్నికల విభాగాల ఏర్పాటు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల్లో కొత్తగా ఎన్నికల విభాగాలు ఏర్పాటవుతున్నాయి. ఓటర్ల జాబితా, కుల గణన, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వార్డులు, చైర్పర్సన్ స్థానాలకు రిజర్వేషన్ల అమలు, నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన, పోలింగ్, ఓట్ల లెక్కింపు ఇలా అన్ని స్థాయిల్లో ఎన్నికల సెక్షన్లు సేవలందించనున్నాయి. ఆయా అంశాలను విభజించి అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. అలాగే ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్న అధికారులను పలు సెక్షన్లకు ఇన్‌ఛార్జులుగా నియమించే ప్రక్రియను మున్సిపల్ కమిషనర్లు చేపట్టారు. -
మీ ఓటు లిస్టులో ఉందా?
సాక్షి, మెదక్ అర్బన్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాలో పేర్లు పరిశీలించుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ చందనాదీప్తితో కలిసి ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయా? లేదా? పరిశీలించుకోవాలని జాబితాలో పేరు ఉంటేనే ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. జాబితాను ఇప్పటికే పంచాయతీ గోడలకు అతికించడం జరిగిందన్నారు. ఓటరు లిస్టులో తమ పేర్లు లేని వారు నవంబరు 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉందని తెలిపారు. పోలీస్, ఆర్టీసీ, రెవెన్యూ, ప్రభుత్వ సిబ్బందితో పాటు పోలింగ్ రోజున ప్రభుత్వం గుర్తించిన వాహనాలపై ఉండే డ్రైవర్లు, క్లీనర్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశం కల్పిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే వీళ్లు ఎన్నికల విధలల్లో ఉన్నట్లు ఫారం–12లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. వాటిలో నియోజకవర్గం, పోలింగ్ బూత్ నంబరు తదితర వివరాలు అందచేస్తే సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించే వారు ఎన్నికల కమిషన్ సూచించిన మేరకు ఆయా శాఖలకు నోడల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు సీ–విజిల్ యాప్ ద్వారా నేరుగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ యాప్ ద్వారా వీడియో, ఫొటోలను అప్లోడ్ చేసి ఐదు నిమిషాల్లోనే ఫొటో తీసిన వంద మీటర్ల దూరం నుంచే అప్లోడ్ చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. ఇది నేరుగా ఎన్నికల కమిషన్‌కు చేరుకుంటుందని... అక్కడ నుంచి జిల్లా అధికారులు, సిబ్బందికి ఐదు నిమిషాల్లో వస్తుందన్నారు. అనంతరం 15 నిమిషాల్లో ఫ్లయింగ్ సాŠవ్డ్ టీమ్ వెళ్లి విచారించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఎన్నికల కమిషన్‌కు పంపిన ఫిర్యాదులు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అలాగే మరో రెండు మూడు యాప్‌లు కూడా ఉన్నాయని అన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం, ఇతర వస్తువులు ఇవ్వరాదని తెలిపారు. ‘సువిధ’ ద్వారా దరఖాస్తు.. పార్టీలు సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఎన్నికల కార్యాలయాలు, లౌడ్ స్పీకర్లు, హెలీకాప్టర్ గ్రౌండ్ వంటి వాటి కోసం ఎన్నికల కమిషన్ సువిధ అనే యాప్‌ను రూపొందించిందన్నారు. ఈ యాప్‌లో 48 గంటల ముందు పార్టీలకు అవసరమైన వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తే సంబంధిత ఆర్డీఓలు అనుమతిస్తారని కలెక్టర్ వివరించారు. అభ్యర్థులు ఎన్నికల సమయంలో ఎన్ని వాహనాలను వినియోగిస్తున్నారనేది సుగమ్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుస్తుందన్నారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో మూడు స్టాటిస్టికల్ టీమ్‌లు, మూడు ఫ్లయింగ్ సాŠవ్డ్ టీమ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల గ్రూపుల ద్వారా డబ్బు పంపిణీ జరిగే అవకాశం ఉందని తమ దృష్టికి వచ్చిందని ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని ఆయా బ్యాంకులకు సూచించామని కలెక్టర్ తెలిపారు. మద్యంకు సంబంధించి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నోడల్ అధికారిగా జిల్లాకు బాధ్యత వహిస్తారన్నారు. ప్రతి రోజు జిల్లాలోని ఆయా మద్యం దుకాణాల్లో అమ్మకాల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారని నిత్యం జరిగే విక్రయాలకంటే ఎక్కువ అమ్మకాలు జరిగితే విచారణ జరుపుతారని తెలిపారు. దీని కోసం అన్ని మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. టోల్ ఫ్రీ నంబర్ వినియోగించుకోవాలి.. ప్రింటింగ్ ప్రెస్‌ల వారు కూడా 127–ఏ సెక్షన్ ప్రకారం పబ్లిషర్స్ వద్ద అఫిడవిట్ తీసుకోవాలని, ఖర్చు వివరాలు రిటర్నింగ్ అధికారికి కానీ జిల్లా ఎన్నికల అధికారికి కానీ మూడు రోజుల్లో పంపాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే 1950 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయవచ్చని అది నేరుగా సీఈఓ కార్యాలయానికి వెళ్తుందన్నారు. జిల్లాకు సంబంధించి ఫోన్ నంబరు 08452– 223360, 223361, 223362 నంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయాలని, కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు. మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)కి ప్రకటనలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతరులను కించపర్చకుండా ఆ ప్రకటనలు ఉండాలన్నారు. అలాగే లౌడ్ స్పీకర్లను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉందన్నారు. ప్లాస్టిక్ జెండాలను వాడవద్దని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. ఎన్నికల సందర్భంగా దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు.. జిల్లా వ్యాప్తంగా 5,600 మందిని గుర్తించామని తెలిపారు. ఎన్నికల రోజున దివ్యాంగులను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడానికి వాహన సౌకర్యం కల్పిస్తామన్నారు. కేసుల వివరాల తెలపాలి.. ప్రతీ పార్టీకి చెందిన అభ్యర్థి తనపై ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా? అనే విషయాన్ని వారి పార్టీకి సమర్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. కేసుల వివరాలను అభ్యర్థి మూడుసార్లు పత్రికల్లో, టీవీల్లో ప్రకటన ఇవ్వాలని, అలాగే పార్టీ నుంచి ఒకసారి ప్రకటన ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ నామినేషన్ల రోజు నుంచి ఎన్నికలకు 48 గంటల ముందు వరకు ఎప్పుడైనా చేయవచ్చన్నారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ప్రభుత్వానికి ఎలాంటి బకాయి లేదని నో డ్యూ సర్టిఫికెట్‌ను డిక్లరేషన్‌లో అఫిడవిట్లో వివరాలు పొందుపర్చాలన్నారు. లేనట్టయితే వారి నామినేషన్ తిరస్కరించబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. రూ.50వేల కంటే ఎక్కువ తీసుకెళ్లొద్దు: ఎస్పీ ఎస్పీ చందనాదీప్తి మాట్లాడుతూ ఒక పార్టీ అభ్యర్థి మరో పార్టీ అభ్యర్థిపై ఎలాంటి వ్యక్తిగత దూషణలు చేయరాదన్నారు. ట్వీట్టర్, ఫేస్బుక్, వాట్సాప్‌లలో కూడా ఇబ్బందికరమైన వివరాలు ఉంటే సంబంధిత అడ్మిన్‌పై చర్యలు చేపడతామని హెచ్చరించారు. జిల్లాలో ప్రతి చోట ఫ్లయింగ్ సాŠవ్డ్తో తనిఖీలు చేపడుతున్నామన్నారు. నియోజకవర్గానికి మూడు చొప్పున ఫ్లయింగ్ సాŠవ్డ్ టీంలు ఉన్నారన్నారు. వీరితో పాటు వీడియో గ్రాఫర్ ఉంటారని తెలిపారు. ఎవరైనా రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో నగదు తీసుకువెళ్తే వాటికి సంబంధించిన రుజువులు ఉండాలని ఎస్పీ చందనాదీప్తి సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. చీరలు, క్రికెట్ కిట్లు, ఇతర సామగ్రిని ఎవరైనా పంపిణీ చేస్తున్నట్లు తెలిస్తే 100కు డయల్ చేయాలన్నారు. పోలింగ్ రోజున అభ్యర్థి వాహనంతో పాటు మరో నాలుగు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో నోడల్ అధికారులు శ్రీనివాస్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ఓటర్లు 25,41,346
నల్లగొండ : జిల్లాలో ఓటరు దరఖాస్తుల పరిశీలన పూర్తయ్యింది. ఈ ఏడాది జనవరి 1వతేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేయాలన్నది ఎన్నికల సంఘం ప్రధానఉద్దేశం. దీనిలో భాగంగా నవంబర్ 13వ తేదీ నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా కొత్తవారు ఓటరుగా నమోదయ్యేందుకు దరఖాస్తులు స్వీకరించారు. ఎన్నికల సిబ్బంది వద్దకు, ఆన్లైన్ ద్వారా 15,684 దరఖాస్తులొచ్చాయి. వీటి ఆధారంగా ఇంటింటికీ వెళ్లి తనిఖీ చేశారు. ఈ కార్యక్రమం సోమవారంతో ముగిసింది. దీంట్లో కొత్తగా ఓటరు నమోదు పొందేందుకు 9,390 దరఖాస్తులు అర్హత సాధించాయి. వివిధ కారణాల దృష్ట్యా 6,294 దరఖాస్తులు తిరస్కరించారు. దీంతో జిల్లాలో గతేడాది అసెంబ్లీ ఎన్నికల నాటికి 25,38,250 మంది ఓటర్లు ఉండగా, కొత్తగా ఓటర్లు 25,41,346 మంది పెరిగారు. కాగా కొత్త ఓటర్ల జాబితాను అధికారికంగా ఈ నెల 16వ తేదీన ప్రకటిస్తారు. ఆధార్ కార్డుకు అనుసంధానం ఓటరు జాబితాలో బోగస్ ఓటర్లను తొలగించాలన్న ఉద్దేశంతో కొత్త ఓటర్ల జాబితాను ఆధార్ కార్డులకు అనుసంధానం చేయాలని ఈసీ నిర్ణయించింది. ఒక ప్రాం తంలో నివసిస్తూ, మరొక ప్రాంతంలో ఓటు కలిగి ఉండడం, మరణించిన వారి ఓట్లు, వల స వెళ్లిన వారి ఓట్లు కూడా తొలగించడం సుల భ మవుతుంది. ఆధార్‌కార్డుకు అనుసంధానించే క్రమంలో ఆ వివరాలను ఓటర్ల నుంచి సేకరించాలా..? ఆధార్ కార్డు డేటా బ్యాంకు నుంచి సేకరించాలా..? అనే అంశాలపై ఎన్నికల సంఘం ఆలోచిస్తోంది. ఇప్పటి కే మన రాష్ర్టంలో పలు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పెలైట్ ప్రాజెక్టుగా చేపట్టారు. ఇది వి జయవంతమైన పక్షంలో ఫిబ్రవరిలో మన జిల్లాలో ఓటరుకార్డును ఆధార్ కార్డుకు అనుసంధానం చే సే అవకాశముందని అధికారులు తెలిపారు.