
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మున్సిపాలిటీ ఎన్నికలకు త్వరితగతిన అడుగులు పడుతున్నాయి. అన్ని మున్సిపాలిటీల్లో ఈనెల 23 నుంచి ప్రారంభమైన ఓటర్ల కుల గణన ముమ్మరంగా సాగుతుండగా మరోపక్క ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు అవసరమైన మానవ వనరులపై పురపాలికలు దృష్టి సారించాయి. పాత మున్సిపాలిటీలను పక్కనబెడితే.. కొత్తగా ఏర్పాటైన తొమ్మిది మున్సిపాలిటీల్లో ప్రత్యేకంగా ఎన్నికల విభాగాలు ఎక్కడా లేవు.
పురపాలికలు ఏర్పడ్డాక జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో ఎన్నికల విభాగాల ఏర్పాటు అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల్లో కొత్తగా ఎన్నికల విభాగాలు ఏర్పాటవుతున్నాయి. ఓటర్ల జాబితా, కుల గణన, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, వార్డులు, చైర్‌పర్సన్ స్థానాలకు రిజర్వేషన్ల అమలు, నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన, పోలింగ్, ఓట్ల లెక్కింపు ఇలా అన్ని స్థాయిల్లో ఎన్నికల సెక్షన్లు సేవలందించనున్నాయి. ఆయా అంశాలను విభజించి అధికారులకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నారు. అలాగే ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్న అధికారులను పలు సెక్షన్లకు ఇన్‌ఛార్జులుగా నియమించే ప్రక్రియను మున్సిపల్ కమిషనర్లు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment