ఓటరు పేరు.. థథ భర్త పేరు.. పప | Mistakes in Municipal Elections Voter Lists Rangareddy | Sakshi
Sakshi News home page

ఓటరు పేరు.. థథ భర్త పేరు.. పప

Published Thu, Jan 2 2020 9:27 AM | Last Updated on Thu, Jan 2 2020 1:54 PM

Mistakes in Municipal Elections Voter Lists Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా: మున్సిపాలిటీ ఓటర్ల ముసాయిదా జాబితాల్లో అనేక తప్పులు ఉన్నాయి.   మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి సోమవారం విడుదలైన ఓటర్ల ముసాయిదా జాబితాలో పాదర్శకత లోపించింది. జిల్లాలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీల్లోని ఓటరు జాబితాలను పరిశీలిస్తే అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వందల సంఖ్యలో బోగస్‌ ఓటర్లను నమోదు చేసి యథాతథంగా జాబితాను విడుదల చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టులోనే మున్సిపల్‌ ఎన్నికలు వస్తాయన్న సంకేతాల నేపథ్యంలో అంతకు ముందటి నెలజులైలో ముసాయిదా ఓటరు జాబితాలను ఆయా మున్సిపాలిటీల్లో విడుదల చేశారు. ఈ సమయంలో చోటు చేసుకున్న తప్పిదాలను గుర్తించి.. సరిచేశారు. అయినా, తాజా ముసాయిదా జాబితాలో యథాతథంగా తప్పులు పునరావృతం కావడం అధికారుల పనితీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఒకే ఓటరును రెండు, మూడుసార్లు ఓటరుగా నమోదు చేసిన దృశ్యాలు ప్రతి పురపాలక సంఘం పరిధిలో కనిపించాయి. ఓటు జాబితాలో పక్కపక్కనే ఈ తరహా తప్పిదాలు చోటుచేసుకున్నా గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓటరు పేరు, ఫొటోలు, ఇంటి చిరునామా, వయసు ఇలా అన్ని వివరాల్లోనూ తప్పులే ఉన్నాయి. దీంతోపాటు సామాజిక వర్గాలు సైతం మార్చేశారు. ఎస్సీలను బీసీలుగా.. బీసీలను ఓసీలుగా నమోదు చేసి ప్రచురించారు. అసలు కొన్ని చోట్ల ఓటరు, తండ్రి పేరు స్థానంలో తెలుగు అక్షరాలను ముద్రించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించలేదు.  

కుప్పలుగా బోగస్‌ ఓటర్ల పేర్లు
బోగస్‌ ఓటర్ల జాబితా చాంతాడంత ఉన్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నంలో రెండు ఇంటి నంబర్లపై మొత్తం 160 మందిని ఓటర్లుగా నమోదు చేశారు. గతంలో ఇలాంటి తప్పిదాలను గుర్తించిన అధికారులు.. వందల సంఖ్యలో బోగస్‌ ఓటర్లను తొలగించారు. ఇంకా వందల సంఖ్యలో ఈ తరహా ఓటర్లు ఉన్నట్లు తాజా ముసాయిదా జాబితాను చూస్తే స్పష్టమవుతోంది. ఇంకొన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో స్థానికంగా నివసించిన వారికి ఓటు హక్కు కల్పించడం అనుమానాలకు తావిస్తోంది. ఇంటింటికి తిరిగి ఓటర్ల సమగ్ర వివరాలు సేకరించాల్సిన అధికారులు దాన్ని మరిచినట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్థానికంగా కొందరు వ్యక్తులను నమ్ముకుని ఓటర్ల వివరాలు నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీని కారణంగానే జాబితాలో పారదర్శకత లోపించినట్లు అర్థమవుతోంది. ఈ తరహా పరిస్థితి మీర్‌పేట, నార్సింగి మున్సిపాలిటీల్లో నెలకొంది. కొన్ని నెలల కిందట ఓటరు కార్డుకు ఆధార్‌ నంబర్‌ లింక్‌ చేయాలన్న నిబంధన వచ్చింది. ఇది చాలా చోట్ల పకడ్బందీగా అమలు కాలేదు. దీంతో ఒకరి వివరాలు పలుచోట్ల నమోదైనా.. గుర్తించడం కష్టంగా మారింది. దీని కారణంగానే డుప్లికేట్‌ ఓటర్ల పేర్లు జాబితాలో ఉన్నాయని ఓ మున్సిపల్‌ కమిషనర్‌ వెల్లడించారు. చాలా వరకు తామే స్వయంగా గుర్తిస్తున్నట్లు కొందరు అధికారులు పేర్కొంటున్నారు. అలాగే స్థానికులు, రాజకీయ పార్టీల నుంచి వీటిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు. వీటి ఆధారంగా తప్పులను సవరించడంతోపాటు బోగస్‌ ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తామని పేర్కొంటున్నారు. ఆ తర్వాత ఈనెల 4న ఓటర్ల తుదిజాబితా విడుదల చేస్తామంటున్నారు. 

ఒకరికే రెండుసార్లు చోటు..
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో కొన్ని వార్డుల్లో ఒకరినే రెండుచోట్ల ఓటర్లుగా నమోదు చేశారు. సీరియల్‌ నంబర్‌ 1024పై సంతోష బిజ్జాల (తండ్రి జగన్‌)కు ఓటు హక్కు కల్పించగా.. 1025 నంబర్‌పైనా ఆమె పేరునే జాబితాలో చేర్చారు. ఇక్కడ భర్త వీరేశంగా పేర్కొన్నారు. అలాగే 1027 సీరియల్‌ నంబర్‌పై రిజ్వానా బేగంకు ఓటు కల్పించిన అధికారులు.. 1028 సీరియల్‌ నంబర్‌పై ఆమె పేరును మరోసారి నమోదు చేశారు. ఒకచోట భర్త పేరు షమీం అలీ ఉండగా.. మరోచోట మహ్మద్‌ షమీం అలీగా పేర్కొన్నారు. ఇక్కడ ఒకరి ఫొటోనే రెండుసార్లు  ముద్రించారు.

ఓటరు పేరు థథ
షాద్‌నగర్‌ పట్టణంలోని 1–7–152/1/అ నంబర్‌ గల ఇంట్లో నివాసం ఉంటున్న ఓ మహిళా ఓటరు పేరు ‘థథ’ అని ముసాయిదా జాబితాలో ప్రచురించారు. ఆమె భర్త పేరును ‘పప’గా నమోదు చేయడం గమనార్హం. అంతేగాక చాలా మంది ఓటర్ల సామాజిక వర్గాలను తారుమారు చేశారు.  ఓసీలను.. బీసీలుగా, ఎస్సీలను.. బీసీలుగా మార్చారు.

రెండు ఇళ్లలో 160 మంది ఓటర్లు
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఇష్టారాజ్యంగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగినట్లు స్పష్టమవుతోంది. రెండు ఇంటి నంబర్లపై(6–54, 6–71/ఏ) మొత్తం 160 మందిని ఓటర్లుగా జాబితాలో చేర్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement