సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగిన వేళా.. ఓటర్లలో చైతన్యం తీసుకురావడానికి ‘సాక్షి’ నడుం బిగించింది. తెలంగాణ, ఏపీలోని లోక్‌సభ స్థానాలతోపాటు.. ఏపీలో అసెంబ్లీకి ఏప్రిల్ 11న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటు నమోదు చేసుకోనివారు, ఓటరు జాబితాలో తమ పేరు లేనివారు దరఖాస్తు చేసుకునేందుకు ఎన్నికల సంఘం ఐదు రోజు సమయం ఇచ్చింది. ఈ గడువు మార్చి 15 వ తేదీతో ముగుస్తుంది. ఆన్‌లైన్‌లో లేదా సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఫాం 6ను సమర్పించడం ద్వారాగాని ఓటర్‌గా నమోదుకు దరఖాస్తు చేయాలి. ఈ సందర్భంగా ఓటు ప్రాముఖ్యత తెలిపేలా సాక్షి ప్రచారం కల్పిస్తుంది. అంతేకాకుండా ఆన్‌లైన్‌లో ఓటు కోసం నమోదు చేసుకునేవారికి ఆ ప్రక్రియను సులభతరం చేయడం కోసం ఓ వీడియోను రూపొందించింది.
ఓటు ఎలా నమోదు చేసుకోవాలంటే...
ఆన్‌లైన్‌లో ఓటు నమోదు చేసుకోవడానికి తొలుత ఎన్నికల సంఘం వెబ్‌సైట్ www.nvsp.in ఓపెన్ చేయాలి. అందులో ఫాం 6ను ఓపెన్ చేసి సంబంధిత భాషను ఎంచుకోవాలి. తర్వాత మీ రాష్ట్రం, మీ జిల్లా, నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాలి. తదుపరి మీ పేరు, ఇంటిపేరు, తండ్రిపేరు/భర్తపేరు(వారి ఇంటి పేరు కూడా) ఎంటర్ చేయండి. తదుపరి పుట్టిన తేదీ, జెండర్ వివరాలు నింపాలి. ప్రస్తుతం మీరు నివాసం ఉంటున్న చిరునామా, మీ శాశ్వత చిరునామాను దరఖాస్తులో పేర్కొనాలి. మీ కుటుంబ సభ్యుల లేదా మీ ఇంటి పక్కన ఉన్నవారి ఓటరు కార్డుపై ఉండే ఎపిక్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
తదుపరి మీ ఫొటో, వయస్సు ధ్రువీకరణ, అడ్రస్ ప్రూఫ్ డ్యాకుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. మీ ఊరు, మీ రాష్ట్రం, మీ జిల్లా సెలక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీరు ఎక్కడి నుంచి దరఖాస్తు చేస్తున్నారో తెలుపండి. చివరిగా క్యాప్చాలో చూపిన అక్షరాలను/నంబర్‌లను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఆ తర్వాత వెంటనే స్క్రిన్‌పై మీకు ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది. మీరు ఆ నంబర్ సహాయంతో మీ దరఖాస్తు పురోగతిని ట్రాక్ చేసుకోవచ్చు.
ప్రజాస్వామ్యంలో ఓటు అనేది మన హక్కు.. దానిని వినియోగించుకోవడమంటే మన తలరాతను మనమే రాసుకోవడం.
Comments
Please login to add a commentAdd a comment