సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల ముంగిట... రాష్ట్రంలో ఓటరుగా నమోదుకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇందుకు ఇక నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ స్వల్ప వ్యవధిలో నమోదు చేసుకోకపోతే వచ్చే నెల 11వ తేదీన జరిగే పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయలేరు. కొత్తగా అర్హత సాధించినవారైనా లేదా ఓటర్ జాబితాలో పేరు లేనివారైనా ఈ నెల 15వ తేదీలోగా ఆన్‌లైన్(www.nvsp.in) ద్వారా గాని, సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో ఫాం 6ను సమర్పించడం ద్వారాగాని ఓటర్‌గా నమోదుకు దరఖాస్తు చేయాలి. ఈ విధంగా సమర్పించినవారికే 11వ తేదీన ఓటు వేసే హక్కు కల్పిస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.
‘18 సంవత్సరాలు నిండి ఇంకా ఓటర్‌గా నమోదు కాని యువత రాష్ట్రంలో 11 లక్షల మంది ఉన్నారు. వారంతా ఈ నెల 15వ తేదీలోగా ఫామ్– 6 సమర్పించాలి. ఓటర్ గుర్తింపు కార్డు ఉంది కదా అని ఓటున్నట్లు భావించవద్దు. జాబితాలో పేరుందో లేదో ఒకసారి తనిఖీ చేసుకోవాలి. ఓటరు కార్డున్నప్పటికీ జాబితాలో పేరు లేకుంటే పోలింగ్ రోజు ఓటు వేయలేరు. ఆన్‌లైన్‌లో కూడా తనిఖీ చేసుకోవాలి. పేరు లేకపోతే ఈ నెల 15వ తేదీలోగా ఫాం6 సమర్పిస్తే తప్పకుండా ఓటు హక్కు కల్పిస్తాం. సాధారణంగా నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటర్‌గా నమోదుకు అవకాశం ఉంటుంది. అయితే, ఇలా వచ్చిన దరఖాస్తులను తనిఖీ చేయడానికి నిబంధనల మేరకు పది రోజులు సమయం అవసరం. ఏడు రోజుల పాటు నోటీసులు జారీ చేయాలని, ఆ తరువాత తనిఖీకి, ఆమోదానికి మూడు రోజల సమయం పడుతుందని’ ద్వివేది వివరించారు. ఈ నేపథ్యంలోనే 15ను ఓటర్‌గా నమోదుకు చివరి తేదీగా పేర్కొన్నట్లు ప్రకటించారు. అప్పటివరకు వచ్చిన దరఖాస్తులు సక్రమంగా ఉంటే వారికి ఈ నెల 25వ తేదీలోగా ఓటు హక్కు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment