మీ ఓటు లిస్టులో ఉందా? | Medak Collector Meet On Officer Telangana Elections | Sakshi
Sakshi News home page

మీ ఓటు లిస్టులో ఉందా?

Published Sun, Oct 28 2018 1:12 PM | Last Updated on Tue, Nov 6 2018 9:24 AM

Medak Collector Meet On Officer  Telangana Elections - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ ధర్మారెడ్డి, పక్కన ఎస్పీ చందనాదీప్తి

సాక్షి, మెదక్‌ అర్బన్‌: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాలో పేర్లు పరిశీలించుకోవాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి సూచించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ చందనాదీప్తితో కలిసి ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయా? లేదా?  పరిశీలించుకోవాలని జాబితాలో పేరు ఉంటేనే ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. జాబితాను ఇప్పటికే పంచాయతీ  గోడలకు అతికించడం జరిగిందన్నారు.

ఓటరు లిస్టులో తమ పేర్లు లేని వారు నవంబరు 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం ఉందని తెలిపారు. పోలీస్, ఆర్టీసీ, రెవెన్యూ, ప్రభుత్వ సిబ్బందితో పాటు పోలింగ్‌ రోజున ప్రభుత్వం గుర్తించిన వాహనాలపై ఉండే డ్రైవర్లు, క్లీనర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా అవకాశం కల్పిస్తామని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అయితే వీళ్లు ఎన్నికల విధలల్లో ఉన్నట్లు ఫారం–12లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.

వాటిలో నియోజకవర్గం, పోలింగ్‌ బూత్‌ నంబరు తదితర వివరాలు అందచేస్తే సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఉపయోగించే వారు ఎన్నికల కమిషన్‌ సూచించిన మేరకు ఆయా శాఖలకు నోడల్‌ అధికారులను నియమించడం జరిగిందన్నారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌కు సీ–విజిల్‌ యాప్‌ ద్వారా నేరుగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ యాప్‌ ద్వారా వీడియో, ఫొటోలను అప్‌లోడ్‌ చేసి ఐదు నిమిషాల్లోనే ఫొటో తీసిన వంద మీటర్ల దూరం నుంచే అప్‌లోడ్‌ చేయాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు.

ఇది నేరుగా ఎన్నికల కమిషన్‌కు చేరుకుంటుందని... అక్కడ నుంచి జిల్లా అధికారులు, సిబ్బందికి ఐదు నిమిషాల్లో వస్తుందన్నారు. అనంతరం 15 నిమిషాల్లో ఫ్లయింగ్‌ సాŠవ్డ్‌ టీమ్‌ వెళ్లి విచారించడం జరుగుతుందని కలెక్టర్‌ వివరించారు. ఎన్నికల కమిషన్‌కు పంపిన ఫిర్యాదులు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అలాగే మరో రెండు మూడు యాప్‌లు కూడా ఉన్నాయని అన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం, ఇతర వస్తువులు ఇవ్వరాదని తెలిపారు.

‘సువిధ’ ద్వారా దరఖాస్తు..
పార్టీలు సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఎన్నికల కార్యాలయాలు, లౌడ్‌ స్పీకర్లు, హెలీకాప్టర్‌ గ్రౌండ్‌ వంటి వాటి కోసం ఎన్నికల కమిషన్‌ సువిధ అనే యాప్‌ను రూపొందించిందన్నారు.  ఈ యాప్‌లో 48 గంటల ముందు పార్టీలకు అవసరమైన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తే సంబంధిత ఆర్డీఓలు అనుమతిస్తారని కలెక్టర్‌  వివరించారు. అభ్యర్థులు ఎన్నికల సమయంలో ఎన్ని వాహనాలను వినియోగిస్తున్నారనేది సుగమ్‌ యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు తెలుస్తుందన్నారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్‌ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో మూడు స్టాటిస్టికల్‌ టీమ్‌లు, మూడు ఫ్లయింగ్‌ సాŠవ్డ్‌ టీమ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

స్వయం సహాయక సంఘాల గ్రూపుల ద్వారా డబ్బు పంపిణీ జరిగే అవకాశం ఉందని తమ దృష్టికి వచ్చిందని ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని ఆయా బ్యాంకులకు సూచించామని కలెక్టర్‌ తెలిపారు. మద్యంకు సంబంధించి జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నోడల్‌ అధికారిగా జిల్లాకు బాధ్యత వహిస్తారన్నారు. ప్రతి రోజు జిల్లాలోని ఆయా మద్యం దుకాణాల్లో అమ్మకాల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారని నిత్యం జరిగే విక్రయాలకంటే ఎక్కువ అమ్మకాలు జరిగితే విచారణ జరుపుతారని తెలిపారు. దీని కోసం అన్ని మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్‌ వివరించారు.

టోల్‌ ఫ్రీ నంబర్‌ వినియోగించుకోవాలి..
ప్రింటింగ్‌ ప్రెస్‌ల వారు కూడా 127–ఏ సెక్షన్‌ ప్రకారం పబ్లిషర్స్‌ వద్ద అఫిడవిట్‌ తీసుకోవాలని, ఖర్చు వివరాలు రిటర్నింగ్‌ అధికారికి కానీ జిల్లా ఎన్నికల అధికారికి కానీ మూడు రోజుల్లో పంపాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే 1950 టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేయవచ్చని అది నేరుగా సీఈఓ కార్యాలయానికి వెళ్తుందన్నారు. జిల్లాకు సంబంధించి ఫోన్‌ నంబరు 08452– 223360, 223361, 223362 నంబర్లకు ఫోన్‌ చేసి తమ సమస్యలను తెలియజేయాలని,  కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చని  తెలిపారు.

మీడియా సర్టిఫికేషన్‌ మానిటరింగ్‌ కమిటీ (ఎంసీఎంసీ)కి ప్రకటనలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతరులను కించపర్చకుండా ఆ ప్రకటనలు ఉండాలన్నారు. అలాగే లౌడ్‌ స్పీకర్లను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉందన్నారు.  ప్లాస్టిక్‌ జెండాలను వాడవద్దని కలెక్టర్‌ ధర్మారెడ్డి సూచించారు. ఎన్నికల సందర్భంగా దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు.. జిల్లా వ్యాప్తంగా 5,600 మందిని గుర్తించామని తెలిపారు. ఎన్నికల రోజున దివ్యాంగులను పోలింగ్‌ కేంద్రాలకు తీసుకురావడానికి వాహన సౌకర్యం కల్పిస్తామన్నారు.

కేసుల వివరాల తెలపాలి..
ప్రతీ పార్టీకి చెందిన అభ్యర్థి తనపై ఏమైనా క్రిమినల్‌ కేసులు ఉన్నాయా? అనే విషయాన్ని వారి పార్టీకి సమర్పించాలని కలెక్టర్‌ ఈ సందర్భంగా సూచించారు. కేసుల వివరాలను అభ్యర్థి మూడుసార్లు పత్రికల్లో, టీవీల్లో ప్రకటన ఇవ్వాలని, అలాగే పార్టీ నుంచి ఒకసారి ప్రకటన ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ నామినేషన్ల రోజు నుంచి ఎన్నికలకు 48 గంటల ముందు వరకు ఎప్పుడైనా చేయవచ్చన్నారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ప్రభుత్వానికి ఎలాంటి బకాయి లేదని నో డ్యూ సర్టిఫికెట్‌ను డిక్లరేషన్‌లో అఫిడవిట్‌లో వివరాలు పొందుపర్చాలన్నారు. లేనట్టయితే వారి నామినేషన్‌ తిరస్కరించబడుతుందని కలెక్టర్‌ స్పష్టం చేశారు. 

రూ.50వేల కంటే ఎక్కువ తీసుకెళ్లొద్దు: ఎస్పీ
ఎస్పీ చందనాదీప్తి మాట్లాడుతూ ఒక పార్టీ అభ్యర్థి మరో పార్టీ అభ్యర్థిపై ఎలాంటి వ్యక్తిగత దూషణలు చేయరాదన్నారు. ట్వీట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో కూడా ఇబ్బందికరమైన వివరాలు ఉంటే సంబంధిత అడ్మిన్‌పై చర్యలు చేపడతామని హెచ్చరించారు. జిల్లాలో ప్రతి చోట ఫ్లయింగ్‌ సాŠవ్డ్‌తో తనిఖీలు చేపడుతున్నామన్నారు. నియోజకవర్గానికి మూడు చొప్పున ఫ్లయింగ్‌ సాŠవ్డ్‌ టీంలు ఉన్నారన్నారు. వీరితో పాటు వీడియో గ్రాఫర్‌ ఉంటారని తెలిపారు.

ఎవరైనా రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో నగదు తీసుకువెళ్తే వాటికి సంబంధించిన రుజువులు ఉండాలని ఎస్పీ చందనాదీప్తి సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. చీరలు, క్రికెట్‌ కిట్లు, ఇతర సామగ్రిని ఎవరైనా పంపిణీ చేస్తున్నట్లు తెలిస్తే 100కు డయల్‌ చేయాలన్నారు. పోలింగ్‌ రోజున అభ్యర్థి వాహనంతో పాటు మరో నాలుగు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో నోడల్‌ అధికారులు శ్రీనివాస్, జయరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement