medak collectorate
-
డిప్యూటీ తహసీల్దార్ నారాయణపై సస్పెన్షన్ వేటు
సాక్షి, మెదక్ : జిల్లాలోని నర్సాపూర్ మండలం చిప్పల్‌తుర్తిలో 112 ఎకరాలకు ఎన్ఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం డిమాండ్ ఘటనలో అదనపు కలెక్టర్ నగేశ్, నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డితోపాటు మరో ముగ్గురు కటకటాలపాలయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ బాగోతాన్ని మరువక ముందే మెదక్ కలెక్టరేట్లో డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్న నారాయణపై సస్పెన్షన్ వేటు పడింది. గతంలో పనిచేసిన జిన్నారం మండలంలో మృతిచెందిన తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి.. నకిలీ పట్టాపాస్ బుక్కులు సృష్టించడంలో ఆయన పాత్ర ఉన్నట్లు తేలింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం రాత్రి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. (రూ.80 కోట్ల భూమికి ఎసరు) అదేవిధంగా.. ఆ సమయంలో అక్కడ వీఆర్వోగా ఉండి.. ఆ తర్వాత మెదక్ జిల్లా నర్సాపూర్‌లో గిరిధావర్‌గా పని చేసి 2016లో రిటైర్డ్ అయిన జె.వెంకటేశ్వర్రావు హస్తం కూడా ఉన్నట్లు గుర్తించగా.. క్రిమినల్ చర్యలకు సర్కారు ఆదేశించడం కలకలం సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఖాజీపల్లి గ్రామంలో సర్వే నంబర్ 181లో అసైన్డ్ భూమి ఉంది. ఈ భూములు రూ.కోట్ల విలువ చేస్తుండడంతో ఇదివరకే కన్నేసిన ఎక్స్ సర్వీస్మెన్లకు సహకరించి.. భారీగా దండుకునేందుకు అప్పటి మండల రెవెన్యూ శాఖ అధికారులు స్కెచ్ వేశారు. 2013లో దరఖాస్తు రాగా.. అప్పుడు తహసీల్దార్‌గా పనిచేసిన, ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓ జి.నరేందర్, డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేసిన, ప్రస్తుత మెదక్ కలెక్టరేట్లో విధులు నిర్వర్తిస్తున్న డీటీ కె.నారాయణ, ఖాజీపల్లి వీఆర్ఓగా పనిచేసి.. నర్సాపూర్‌లో గిరిధావర్‌గా రిటైర్డ్ అయిన జె.వెంకటేశ్వర్రావు కుట్రకు తెరదీశారు. (అడిషనల్ కలెక్టర్ కేసుపై కోర్టులో ఏసీబీ పిటిషన్) స్థానికంగా పనిచేసి మృతిచెందిన తహసీల్దార్ పేరుతో ఫోర్జరీ సంతకం చేసి నకిలీ పట్టా సర్టిఫికెట్లు సృష్టించారు. నలుగురు ఎక్స్సర్వీస్మెన్లు ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున రూ.80 కోట్ల విలువైన 20 ఎకరాలు కట్టబెట్టారు. అసైన్డ్ భూమి కావడంతో ఎన్ఓసీ తప్పనిసరి అయింది. ఈ క్రమంలో 2019లో సదరు వ్యక్తులు దరఖాస్తు చేసుకోగా.. సంగారెడ్డి కలెక్టర్‌కు అనుమానం వచ్చి విచారణ జరిపించారు. మృతి చెందిన తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి.. నకిలీ పట్టాలు సృష్టించినట్లు విచారణాధికారి నిగ్గు తేల్చడంతో వీరిపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ ఘటనలో భాగస్వాములైన ముగ్గురిపై బొల్లారం పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓతోపాటు మెదక్ కలెక్టరేట్ డీటీపై సస్పెన్షన్ వేటు పడింది. ఏసీబీ నజర్.. 112 ఎకరాలకు రూ.1.12 కోట్ల లంచం ఘటనలో అదనపు కలెక్టర్ నగేశ్, నర్సాపూర్ ఆర్డీఓ అరుణారెడ్డి, చిలప్‌చెడ్ తహసీల్దార్ సత్తార్, సర్వే, ల్యాండ్ జూనియర్ అసిస్టెంట్ వసీంతోపాటు ఏసీ బినామీ కోల జీవన్ గౌడ్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న వీరిని విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకునేందుకు ఏసీబీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఖాజీపల్లి భూబాగోతంలో మెదక్ కలెక్టరేట్ డిప్యూటీ తహసీల్దార్ ఉండడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆయనపై నజర్ వేసినట్లు తెలుస్తోంది. ముందస్తు బెయిల్ కోసం.. ఫోర్జరీ.. నకిలీ పట్టాలు సృష్టించి రూ.80 కోట్ల భూమిని కట్టబెట్టిన ఘటనలో ఎనిమిది మంది రెవెన్యూ అధికారులు, నలుగురు ఎక్స్ సర్వీస్మెన్లపై కేసు నమోదైన విషయం తెలిసిందే. పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో డీటీ నారాయణతోపాటు మిగిలిన వారు తమ అడ్వకేట్ ద్వారా మెదక్ జిల్లా కోర్టులో ముందస్తు (యాంటిసిపేటరీ) బెయిల్‌కు అప్లై చేసినట్లు సమాచారం. కాగా, డిప్యూటీ తహసీల్దార్ నారాయణ ప్రస్తుతం సెలవులో ఉన్నారు. సుమారు నెల రోజులుగా విధులకు రావడం లేదని జిల్లా ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా వరుసగా అవినీతి కోణాలు వెలుగు చూడడం రెవెన్యూ వర్గాల్లో అలజడి రేపుతోంది. -
ఎంపీపీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
మెదక్ రూరల్: మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఎంపీపీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీఓలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పరోక్ష ఎన్నికలకు సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు ముందుగానే చేసుకోవాలని సూచించారు. సమావేశ మందిరంలో ఎంపీటీసీలుగా ఎంపికైన వారు ఒకవైపు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లాంటి ప్రత్యేక ఆహ్వానితులు కూర్చునేందుకు మరోవైపు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్నికల రోజున ముందుగా కోఆప్షన్ సభ్యుల ఎన్నిక కోసం నామినేషన్లను స్వీకరించడం జరుగుతుం దన్నారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు తర్వాత అభ్యర్థి ఎన్నికను అధికారికంగా ప్రకటించాలన్నారు. కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక జరిగేందుకు సరైన కోరం లేనట్లయితే సరిపడా సభ్యులు వచ్చేంత వరకు అధికారులు వేచి చూడాలన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అనుమానాలకు చోటివ్వకుండా పారదర్శకంగా పరోక్ష ఎన్నికలను నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ లక్ష్మీబాయి, డీపీఓ హనోక్‌తో పాటు ప్రిసైడింగ్ అధికారులు, ఎంపీడీఓలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
సమగ్రాభివృద్ధే లక్ష్యం
ఆత్మబలిదానాలు, అలుపెరగని ఉద్యమంతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. సీఎం కేసీఆర్ సారథ్యంలో అభివృద్ధిలో దూసుకెళ్తోందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎర్రగొల్ల రాజమణి మురళీయాదవ్ అన్నారు. మెదక్‌పై కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ ఉందని.. ఆయన ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా వేడుకలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలతోపాటు పలు కూడళ్లలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మెదక్ పట్టణంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన అధికారిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్పర్సన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. సాక్షి, మెదక్ : ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించే నాటికి తెలంగాణ అన్ని రంగాల్లో వెనుబడి ఉందని.. తీవ్రమైన విద్యుత్ కోతలతో పారిశ్రామిక రంగం కుదేలైందని రాజమణి మురళీయాదవ్ అన్నారు. సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయంతో తెలంగాణ పంట పొలాలు పడావు పడ్డాయని.. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. గ్రామీణ వ్యవస్థ ఛిన్నాభిన్నమైందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత దుర్భర పరిస్థితులను అధిగమించేందుకు సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో పనుర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. మరింత బాధ్యత పెరిగింది.. ఐదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు తెలుసని.. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు ఎంత సానుకూలంగా ఉన్నారనడానికి ఇటీవల ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలు టీఆర్ఎస్కు అఖండ విజయాన్ని అందించి రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించారన్నారు. పంచాయతీ నుంచి ఎంపీ ఎన్నికల్లో వరుసగా గెలిపిస్తూ తమపై ప్రజలు అచెంచల విశ్వాసం ప్రకటించారని గుర్తు చేశారు. ప్రతి విజయం తమపై మరింత బాధ్యతను పెంచిం దని.. అందరం కలిసి అభివృద్ధిలో జిల్లాను ముందంజలో నిలుపుతామన్నారు. ఆ తర్వాత జిల్లా ప్రగతిని వివరించారు. అనారోగ్యం కారణంగా ప్రసంగ పాఠాన్ని జేసీ నగేష్‌తో చదివిం చారు. ప్రసంగ పాఠం ఆయన మాటల్లోనే.. రైతుబంధు పథకంలో భాగంగా రైతులకు వ్యవసాయకోసం ఏడాదికి పెట్టుబడి సాయంగా జిల్లాలోని 2,17,533 మందికి ఖరీఫ్ సీజన్లో రూ.142.67 కోట్లు, రబీ సీజన్‌కు రూ.139.33 కోట్లు పంపిణీ చేశాం. జిల్లాలో 1,68,958 మంది రైతులకు బీమా చేయించాం. ఇప్పటికీ జిల్లాలో 491 మంది రైతులు వివిధ కారణాలతో మరణించగా 441 మందికి ఇన్సూరెన్స్ డబ్బులు క్లెయిమయ్యాయి. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రూ.10.91 కోట్లతో జిల్లాలోని రైతులకు వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు, రోటివేటర్లు, వరినాటు యంత్రాలతోపాటు ఇతర సామగ్రి పంపిణీ చేశాం. జిల్లాలో సూక్ష్మ సేద్య పథకం ద్వారా 690 మంది లబ్ధిదారులకు రూ.4.90 కోట్లతో సామగ్రిని అందించాం. సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద పండ్ల తోటల ఉత్పత్తిలో నాణ్యత పెంచేందుకు 89 మంది లబ్ధిదారులకు రూ.7.73 లక్షలు ఖర్చు చేశాం. పాలీహౌస్ నిర్మించుకునే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు రూ.107.61 లక్షల సబ్సిడీని అందించాం. పట్టు పరిశ్రమను ప్రోత్సహించేం దుకు 100 ఎకరాలకు రూ.16.66 లక్షలు కేటాయించాం. గొర్రెల ప్రత్యేక అభివృద్ధి పథకం కింది ఇప్పటి వరకు 12.067 గొర్రెల యూనిట్లను రూ.113.12 కోట్ల వ్యయంతో పంపిణీ చేశాం. వీటి ద్వారా రూ.26.24 కోట్ల విలువైన 58,317 గొర్రె పిల్ల ఉత్పత్తి జరిగింది. పాడి రైతుల ఆర్థిక ప్రగతికి జిల్లాలో రూ.13 కోట్ల సబ్సిడీతో 3,044 మంది లబ్ధిదారులకు పాడిగేదెలను అందజేశాం. జిల్లాలో మిషన్ కాకతీయ పథకం ద్వారా నాలుగు విడతల్లో 1,893 చెరువుల అభివృద్ధికి రూ.447.15 కోట్లు మంజూరయ్యాయి. ఈ చెరువుల కింద 1,06,590 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. ఇప్పటికీ 1,701 చెరువుల మరమ్మతు పనులు పూర్తయ్యియి. రూ.66.82 కోట్లతో ఘనపురం ప్రాజెక్ట్ ఎత్తు పెంపుతోపాటు పునరుద్ధరణ పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.20.33 కోట్లతో నర్సాపూర్, మెదక్ ప్రధాన రహదారి నుంచి ఏడుపాయల దుర్గాభవాని ఆలయం వరకు చేరుకునేందుకు నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు సైతం పురోగతిలో ఉన్నాయి. మత్స్యశాఖ ద్వారా జిల్లాలోని 100 చెరువుల్లో రూ.65లక్షల ఖర్చుతో 68.76లక్షల చేప పిల్లలను పంపిణీ చేశారు. తద్వారా దాదాపు 1,600 టన్నుల చేపలు ఉత్పత్తి జరిగి చేపల పరిశ్రమపై ఆధారపడిన 10.815 కుటుంబాలకు జీవనోపాధి లభించనుంది. తెలంగాణలో మొట్టమొదటిసారిగా రొయ్యల పెంపకం సాగుపై దృష్టి సారించాం. పోచారం ప్రాజెక్ట్‌లో మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు రూ.6,20 వేల రొయ్య పిల్లలను వేసి పెంచుతున్నాం. సుమారు 30 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి మానస పుత్రిక వాటర్ గ్రిడ్ పనులు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జిల్లాలో రూ.1,500 కోట్లతో 958 గ్రామాల్లో 1,96,232 ఇళ్లకు నల్లాల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోంది. జిల్లా కేంద్రంలో ప్రత్యేక నిధులతో రానున్న మూడు నెలల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా సరఫరా అవుతుంది. ఈ సంవత్సరం జిల్లాలో 438 నర్సరీల ద్వారా రూ.4.24 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా నిర్ణయించాం. ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 322 నర్సరీల ఏర్పాటుతో పాటు 2.99 కోట్ల మొక్కలను నాటేందుకు, అటవీశాఖ ఆధ్వర్యంలో 112 నర్సరీల ద్వారా 1.25కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. లబ్ధిదారునికి ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఇంటిస్థలం, ఇతర మౌలిక సదుపాయాలతో జిల్లాలో 514 రెండు పడక గదుల ఇళ్లు మంజూరు కాగా.. ఇందులో 3,623 నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. శివ్వంపేట మండలం దంతాన్పల్లి గ్రామంలో నిర్మించిన 30, వెల్దుర్తి మండల కేంద్రంలో 36, చేగుంట మండలం బి.కొండాపూర్‌లో 30 డబుల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో 2,14లక్షల కుటుంబాలకు సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి వ్యక్తికి ఆరుకిలోల చొప్పు న నెలకు 4,099 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 521 చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నాం. 13.013 కుటుంబాలకు అంత్యోదయ కార్డుల ద్వారా 419 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో ఉజ్వల పథకం కింద బీపీఎల్ కుటుంబాలకు 18,045 గ్యాస్ కనెక్షన్లు అందజేశాం. జిల్లాలో 139 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాం. 171 పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు ప్రారంభించాం. దీని ద్వారా హాజరు శాతం గణనీయంగా పెరిగింది. రూ.3.15 కోట్లతో 42 పాఠశాలల్లో అదనపు గదులను నిర్మించుకుంటున్నాం. మూడు కస్తూర్బా పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యను సైతం ప్రారంభించుకున్నాం. రాష్ట్ర స్థాయిలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలో అద్భుత ప్రదర్శన కనబర్చి దక్షిణ భారతదేశ ప్రదర్శనలకు ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలుపుతున్నాం. కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో 372 గ్రామాల్లో 4.37 లక్షల మందికి దృష్టి పరీక్షలు నిర్వహించి 69.430 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశాం. 1.10లక్షల మందికి సాధారణ వైద్య సేవలను అందించాం. మాతాశిశు మరణాలను నియంత్రించడంలో భాగంగా కేసీఆర్ కిట్లను ఇప్పటివరకు జిల్లాలో 9,428 మందికి పంపిణీ చేశాం. వ్యవసాయ రంగానికి జూలై 2017 నుంచి 24గంటల విద్యుత్ సౌకర్యాన్ని రైతులకు ఉచితం గా అందిస్తున్నాం. దీన్‌దయాల్ గ్రామీణ జ్యోతి యోజన పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 32,697 కుటుంబాలకు కనెక్షన్లు ఇచ్చాం. జిల్లాలో మెగా, భారీ, మధ్య తరహా పరిశ్రమలు, 288 చిన్న తరహా పరిశ్రమలు.. మొత్తం రూ. 29.98 కోట్ల పెట్టుబడితో స్థాపించాం. వీటిలో దాదాపు 2,264 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. టీఎస్ ఐపాస్ విధానం ద్వారా రూ.282.54 కోట్ల పెట్టుబడితో 81 పరిశ్రమలకు 192 అనుమతులకు దరఖాస్తులు వచ్చాయి. 171 అనుమతులను వివిధ శాఖల నుంచి జారీ చేశాం. ఇందులో ఇప్పటి వరకు 40 పరిశ్రమలు ప్రారంభించడం జరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ యువతకు సేవారంగంలో 151 పరిశ్రమలకు రూ.9.60 కోట్ల రూపాయల పెట్టుబడి రాయితీ మంజూరు చేశాం. ఆసరా పింఛన్ల పథకం కింద ప్రతినెల రూ.1000 చొప్పున జిల్లాలోని 1,3,514 మంది వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోధకాలు వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.11.20 కోట్లు అందించాం. వీటితో పాటు పలు రకాలు పథకాలు జిల్లాలో అమలవుతున్నాయి. -
జోరుగా మట్టి దందా
నిజాంపేట(మెదక్): నిజాంపేటకు చెందిన ఘడీం చెరువు నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. రెండు రోజులుగా చెరువులో జేసీబీతో మట్టి తీసి ట్రాక్టర్ల ద్వారా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేఉండా ఓ కాంట్రాక్టర్ చెరువు నుంచి మట్టిని తోడేస్తున్నారు. ఓ కాంట్రాక్టరు పగటి పూట అక్రమంగా మట్టిని తరలిస్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వింతగా ఉంది. గతంలో మట్టిని తీసిన గోతుల పక్కనే ప్రస్తు తం మట్టిని తవ్వి తీస్తున్నారు. చెరువు చివరి భాగంలో మట్టిని తీసుకుపోయేందుకు తవ్వకాలు చేపట్టడంతో పెద్ద గోతులు ఏర్పడుతున్నా యి. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న నార్లాపూర్, వెంకటపూర్(కె) గ్రామంలోని ఉన్న చెరువులల్లో చాలా వరకు పెద్ద ప్రమాదకరమైన గోతులు ఏర్పడాయి. చెరువులో జేసీబీ గోతులలో ప్రమాదాలు జరిగి ప్రాణా లకు ముప్పు వాటిల్లుతున్నా ఏ శాఖ అధికారులు అక్రమ తవ్వకాలను అడ్డుకోవడం లేదని స్థానికంగా ప్రజలు ఆరోపిస్తున్నారు. అక్రమ తవ్వకాలు జరిపితే చర్యలు తీసుకుంటాం మండల పరిధిలోని పలు గ్రామాల్లోని చెరువుల్లో అక్రమంగా మట్టిని తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనుమతులు లేకుండా చెరువుల్లో మట్టిని తోడితే అడ్డుకుంటాం. ఇప్పటి వరకు సమస్య మా దృష్టికి తీసుకురాలేదు. వెంటనే చర్యలు తీసుకుంటాం. – జైరామ్, తహసీల్దార్ -
ఆదర్శంగా ఉంటేనే మార్పు
నర్సాపూర్: నాయకులుగా, ప్రజాప్రతినిధులుగా మీరు గ్రామంలో పది మందికి ఆదర్శంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి సర్పంచులకు సూచించారు. స్థానిక మండల ప్రజా పరిషత్తు కార్యాలయంలో సర్పంచులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో శుక్రవారం సాయంత్రం ఆయన పాల్గొని మాట్లాడారు. మీ హయాంలో మీమీ గ్రామాలలో ప్రభుత్వ పరంగా చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలపై మీ పేర్లు ఎలా శాశ్వతంగా ఉండాలని ఆశిస్తారో పనులలో నాణ్యత ప్రమాణాలు ఉండేలా శ్రద్ద తీసుకుంటేనే పనులు నాణ్యతగా ఉండటంతోపాటు మీకు మంచి పేరు వస్తుందని కలెక్టర్ సూచించారు. పలు గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్లు త్వరలోనే పాడవుతున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. అందుకు పనులలో నాణ్యత లోపించడంతోపాటు వాటిపై నుంచి కేజీవీల్స్‌తో ట్రాక్టర్లు తిప్పడం మరో కారణమని ఆయన అన్నారు. అభివృద్ధి పనులు చేపట్టే సమయంలో గ్రామ సర్పంచ్‌లు బాధ్యతగా వాటిని పర్యవేక్షించినపుడే పనులలో నాణ్యత సాధ్యమని ఆయన వివరించారు. చెట్లను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ చెప్పారు. మొక్కలు పెంపకాన్ని బాధ్యతగా తీసుకోండి జిల్లాలో హరితహారం కార్యక్రమం కింద గతంలో వంద నర్సరీలు ఏర్పాటు చేసి కోటి నుంచి కోటీ 30లక్షల మొక్కలు పెంచగా.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 450 నర్సరీలు ఏర్పాటు చేసి సుమారు నాలుగు కోట్ల మొక్కలు పెంచుతున్నామని చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో మొక్కలు పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. ఇప్పటికే చెట్లను నరకడంతో అడవుల విస్తీర్ణం తగ్గి వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. సర్పంచ్‌లు హరితహారం కార్యక్రమం పట్ల అందరూ బాధ్యతగా వ్యవహరించి మొక్కలు నాటి కాపాడేందుకు చర్యలు తీసుకున్నపుడే హరితహారం విజయవంతం అవతుందని ఆయన చెప్పారు. ఇండ్ల నుంచి పొడి, తడి చెత్తను వేరుగా సేకరించేందుకు ఏర్పాటు చేసుకోవాలని ఆయన చెప్పారు. అందుకుగాను ప్రజలలో చైతన్యం తేవాలని చెప్పారు. ప్లాస్టిక్‌తో భూమి ఎంత కలుషితమవుతుందో ప్రజలకు తెలియచేయాలని ఆయన చెప్పారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంత ఏర్పాటు చేయించాలని చెప్పారు. కాగా గతంలో ఆదర్శ గ్రామాలుగా ఎంపికైన గ్రామాలకు మిమ్మల్ని తీసుకుపోయి అక్కడి పనులను మీకు చూపిస్తామని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో డీపీఓ హనూక్, కొల్చారం జెడ్పీటీసీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, నర్సాపూర్ మండల తహసీల్దార్ బిక్షపతి, ఎంపీడీఓ శ్రవన్‌కుమార్, డీఏఓ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
మీ ఓటు లిస్టులో ఉందా?
సాక్షి, మెదక్ అర్బన్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల తుది జాబితాలో పేర్లు పరిశీలించుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ చందనాదీప్తితో కలిసి ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయా? లేదా? పరిశీలించుకోవాలని జాబితాలో పేరు ఉంటేనే ఓటు వేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. జాబితాను ఇప్పటికే పంచాయతీ గోడలకు అతికించడం జరిగిందన్నారు. ఓటరు లిస్టులో తమ పేర్లు లేని వారు నవంబరు 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉందని తెలిపారు. పోలీస్, ఆర్టీసీ, రెవెన్యూ, ప్రభుత్వ సిబ్బందితో పాటు పోలింగ్ రోజున ప్రభుత్వం గుర్తించిన వాహనాలపై ఉండే డ్రైవర్లు, క్లీనర్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశం కల్పిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. అయితే వీళ్లు ఎన్నికల విధలల్లో ఉన్నట్లు ఫారం–12లో నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. వాటిలో నియోజకవర్గం, పోలింగ్ బూత్ నంబరు తదితర వివరాలు అందచేస్తే సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించే వారు ఎన్నికల కమిషన్ సూచించిన మేరకు ఆయా శాఖలకు నోడల్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌కు సీ–విజిల్ యాప్ ద్వారా నేరుగా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ యాప్ ద్వారా వీడియో, ఫొటోలను అప్లోడ్ చేసి ఐదు నిమిషాల్లోనే ఫొటో తీసిన వంద మీటర్ల దూరం నుంచే అప్లోడ్ చేయాలని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. ఇది నేరుగా ఎన్నికల కమిషన్‌కు చేరుకుంటుందని... అక్కడ నుంచి జిల్లా అధికారులు, సిబ్బందికి ఐదు నిమిషాల్లో వస్తుందన్నారు. అనంతరం 15 నిమిషాల్లో ఫ్లయింగ్ సాŠవ్డ్ టీమ్ వెళ్లి విచారించడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. ఎన్నికల కమిషన్‌కు పంపిన ఫిర్యాదులు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. అలాగే మరో రెండు మూడు యాప్‌లు కూడా ఉన్నాయని అన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం, ఇతర వస్తువులు ఇవ్వరాదని తెలిపారు. ‘సువిధ’ ద్వారా దరఖాస్తు.. పార్టీలు సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఎన్నికల కార్యాలయాలు, లౌడ్ స్పీకర్లు, హెలీకాప్టర్ గ్రౌండ్ వంటి వాటి కోసం ఎన్నికల కమిషన్ సువిధ అనే యాప్‌ను రూపొందించిందన్నారు. ఈ యాప్‌లో 48 గంటల ముందు పార్టీలకు అవసరమైన వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తే సంబంధిత ఆర్డీఓలు అనుమతిస్తారని కలెక్టర్ వివరించారు. అభ్యర్థులు ఎన్నికల సమయంలో ఎన్ని వాహనాలను వినియోగిస్తున్నారనేది సుగమ్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుస్తుందన్నారు. జిల్లాలోని మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో మూడు స్టాటిస్టికల్ టీమ్‌లు, మూడు ఫ్లయింగ్ సాŠవ్డ్ టీమ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల గ్రూపుల ద్వారా డబ్బు పంపిణీ జరిగే అవకాశం ఉందని తమ దృష్టికి వచ్చిందని ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు తమకు తెలియజేయాలని ఆయా బ్యాంకులకు సూచించామని కలెక్టర్ తెలిపారు. మద్యంకు సంబంధించి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నోడల్ అధికారిగా జిల్లాకు బాధ్యత వహిస్తారన్నారు. ప్రతి రోజు జిల్లాలోని ఆయా మద్యం దుకాణాల్లో అమ్మకాల వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారని నిత్యం జరిగే విక్రయాలకంటే ఎక్కువ అమ్మకాలు జరిగితే విచారణ జరుపుతారని తెలిపారు. దీని కోసం అన్ని మద్యం దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. టోల్ ఫ్రీ నంబర్ వినియోగించుకోవాలి.. ప్రింటింగ్ ప్రెస్‌ల వారు కూడా 127–ఏ సెక్షన్ ప్రకారం పబ్లిషర్స్ వద్ద అఫిడవిట్ తీసుకోవాలని, ఖర్చు వివరాలు రిటర్నింగ్ అధికారికి కానీ జిల్లా ఎన్నికల అధికారికి కానీ మూడు రోజుల్లో పంపాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే 1950 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయవచ్చని అది నేరుగా సీఈఓ కార్యాలయానికి వెళ్తుందన్నారు. జిల్లాకు సంబంధించి ఫోన్ నంబరు 08452– 223360, 223361, 223362 నంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయాలని, కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చని తెలిపారు. మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ)కి ప్రకటనలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతరులను కించపర్చకుండా ఆ ప్రకటనలు ఉండాలన్నారు. అలాగే లౌడ్ స్పీకర్లను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ప్రచారం చేసుకోవడానికి అనుమతి ఉందన్నారు. ప్లాస్టిక్ జెండాలను వాడవద్దని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. ఎన్నికల సందర్భంగా దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు.. జిల్లా వ్యాప్తంగా 5,600 మందిని గుర్తించామని తెలిపారు. ఎన్నికల రోజున దివ్యాంగులను పోలింగ్ కేంద్రాలకు తీసుకురావడానికి వాహన సౌకర్యం కల్పిస్తామన్నారు. కేసుల వివరాల తెలపాలి.. ప్రతీ పార్టీకి చెందిన అభ్యర్థి తనపై ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా? అనే విషయాన్ని వారి పార్టీకి సమర్పించాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. కేసుల వివరాలను అభ్యర్థి మూడుసార్లు పత్రికల్లో, టీవీల్లో ప్రకటన ఇవ్వాలని, అలాగే పార్టీ నుంచి ఒకసారి ప్రకటన ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ నామినేషన్ల రోజు నుంచి ఎన్నికలకు 48 గంటల ముందు వరకు ఎప్పుడైనా చేయవచ్చన్నారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ప్రభుత్వానికి ఎలాంటి బకాయి లేదని నో డ్యూ సర్టిఫికెట్‌ను డిక్లరేషన్‌లో అఫిడవిట్లో వివరాలు పొందుపర్చాలన్నారు. లేనట్టయితే వారి నామినేషన్ తిరస్కరించబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. రూ.50వేల కంటే ఎక్కువ తీసుకెళ్లొద్దు: ఎస్పీ ఎస్పీ చందనాదీప్తి మాట్లాడుతూ ఒక పార్టీ అభ్యర్థి మరో పార్టీ అభ్యర్థిపై ఎలాంటి వ్యక్తిగత దూషణలు చేయరాదన్నారు. ట్వీట్టర్, ఫేస్బుక్, వాట్సాప్‌లలో కూడా ఇబ్బందికరమైన వివరాలు ఉంటే సంబంధిత అడ్మిన్‌పై చర్యలు చేపడతామని హెచ్చరించారు. జిల్లాలో ప్రతి చోట ఫ్లయింగ్ సాŠవ్డ్తో తనిఖీలు చేపడుతున్నామన్నారు. నియోజకవర్గానికి మూడు చొప్పున ఫ్లయింగ్ సాŠవ్డ్ టీంలు ఉన్నారన్నారు. వీరితో పాటు వీడియో గ్రాఫర్ ఉంటారని తెలిపారు. ఎవరైనా రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తంలో నగదు తీసుకువెళ్తే వాటికి సంబంధించిన రుజువులు ఉండాలని ఎస్పీ చందనాదీప్తి సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. చీరలు, క్రికెట్ కిట్లు, ఇతర సామగ్రిని ఎవరైనా పంపిణీ చేస్తున్నట్లు తెలిస్తే 100కు డయల్ చేయాలన్నారు. పోలింగ్ రోజున అభ్యర్థి వాహనంతో పాటు మరో నాలుగు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో నోడల్ అధికారులు శ్రీనివాస్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు బిజీబిజీ
మెదక్ అర్బన్: అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు బిజీ అయిపోయారు. ప్రతీ రోజు కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు, ఓటర్ల వివరాలు నమోదు చేసుకోవడం, వాటిలో మార్పులు, చేర్పులు, సవరణ పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లోని దాదాపు అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రతీ రోజు కలెక్టర్ ఎన్నికలకు సంబం«ధించి సమీక్షా సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు, ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఆయా పోలింగ్‌కేంద్రాల్లో చేపట్టిన, చేపట్టబోయే కార్యక్రమాలను ఎప్పటికప్పుడు జిల్లాలోని ఆయా గ్రామాలకు తెలియజేస్తూ... అక్కడ నుంచి సమాచారం రాబట్టుకుంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు. మెదక్, నర్సాపూర్ పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఏఏ పోలింగ్ కేంద్రాల్లో ర్యాంపులు ఉన్నాయి, విద్యుత్ సౌకర్యం, నీటి సౌకర్యం, దివ్యాంగులకు కావాల్సిన సదుపాయాల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ అక్కడ పని చేసే సిబ్బందికి సూచనలిస్తున్నారు. అలాగే ఎన్నికలకు సంబంధించి ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ వాటికి తగినట్లుగా çసలహాలిస్తున్నారు. మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలోని ఎన్నికల విభాగంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎన్నికల అధికారికి సహాయకులుగా మొత్తం ఆరుగురు సిబ్బంది ఉన్నారు. వారిలో ఎన్నికల సూపరింటెండెంట్, డిప్యూటీ తహసీల్దార్, జూనియర్ అసిస్టెంట్లు కాగా మరో ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు నెల రోజులుగా ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో తలమునకలవుతున్నారు. వీరే కాకుండా ఆయా శాఖల అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో బిజీగా మారారు. జిల్లా స్థాయి అధికారులైతే ఇటు తమ శాఖకు సంబంధించిన పనులు చేస్తూ మరో వైపు ఎన్నికల ఏర్పాట్ల గురించి తమకు కేటాయించిన మండలాలు, గ్రామాలకు వెళ్లి క్షేత్రపర్యటన చేస్తున్నారు. అక్కడ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న సదుపాయాలు, ఇంకా కావాల్సిన అవసరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇటు ఈ పనులు చేస్తూనే మరో వైపు శాఖాపరమైన పనులు కూడా ఉండటంతో వారు బిజీగా మారారు. జిల్లా స్థాయి అధికారులే కాకుండా ఆ కింది స్థాయి అధికారులు, సిబ్బంది సైతం తమకు కేటాయించిన పనుల్లో నిమగ్నమయ్యారు. అలాగే ఎన్నికలకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఎన్నికల సెల్‌ను కూడా ఏర్పాటు చేయడంతో వారు మరింత బిజీగా మారారు. ఏది ఏమైనా మరో నెలరోజుల పాటు ఎన్నికల హడావుడితో అధికారులు, సిబ్బంది బిజీగా ఉండనున్నారు. -
కలెక్టరేట్లో మిస్ ఫైర్, కానిస్టేబుల్ మృతి
-
కలెక్టరేట్లో మిస్ ఫైర్, కానిస్టేబుల్ మృతి
మెదక్ : మెదక్ జిల్లా సంగారెడ్డి కలెక్టరేట్లో మిస్ ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్ మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే కలెక్టరేట్ ట్రెజరీ కార్యాలయం వద్ద గార్డుగా విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ రమేష్ రెడ్డి చేతిలో తుపాకీ ప్రమాదవశాత్తూ పేలింది. దాంతో అతను అక్కడికక్కడే మరణించారు. కాగా తుపాకీ పేలుడుపై అధికారులు విచారణకు ఆదేశించారు. తుపాకీ మిస్ ఫైర్ అయ్యిందా, లేక కానిస్టేబుల్ కావాలనే పేల్చుకున్నారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుడు వైఎస్ఆర్ జిల్లా వాసి. సంఘటనా స్థలంఓ ఓ బులెట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.