సమగ్రాభివృద్ధే లక్ష్యం | Telangana Formation Day Celebrations Medak | Sakshi
Sakshi News home page

సమగ్రాభివృద్ధే లక్ష్యం

Published Mon, Jun 3 2019 11:31 AM | Last Updated on Mon, Jun 3 2019 11:31 AM

Telangana Formation Day Celebrations Medak - Sakshi

మహనీయుల చిత్రపటాలకు వందనం చేస్తున్న జెడ్పీ చైర్‌పర్సన్‌

ఆత్మబలిదానాలు, అలుపెరగని ఉద్యమంతో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం.. సీఎం కేసీఆర్‌ సారథ్యంలో అభివృద్ధిలో దూసుకెళ్తోందని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఎర్రగొల్ల రాజమణి మురళీయాదవ్‌ అన్నారు. మెదక్‌పై కేసీఆర్‌కు ఎనలేని ప్రేమ ఉందని.. ఆయన ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లావ్యాప్తంగా వేడుకలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయతీలతోపాటు పలు కూడళ్లలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. మెదక్‌ పట్టణంలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన అధికారిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జెడ్పీ చైర్‌పర్సన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి.  

సాక్షి, మెదక్‌ : ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించే నాటికి తెలంగాణ అన్ని రంగాల్లో వెనుబడి ఉందని.. తీవ్రమైన విద్యుత్‌ కోతలతో పారిశ్రామిక రంగం కుదేలైందని రాజమణి మురళీయాదవ్‌ అన్నారు. సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయంతో తెలంగాణ పంట పొలాలు పడావు పడ్డాయని.. వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. గ్రామీణ వ్యవస్థ ఛిన్నాభిన్నమైందన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత దుర్భర పరిస్థితులను అధిగమించేందుకు సీఎం కేసీఆర్‌ అన్ని రంగాల్లో పనుర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించారని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ బంగారు తెలంగాణ దిశగా ముందుకు సాగుతున్నారని చెప్పారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉందన్నారు.

మరింత బాధ్యత పెరిగింది..
ఐదేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు తెలుసని.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనపై ప్రజలు ఎంత సానుకూలంగా ఉన్నారనడానికి ఇటీవల ఎన్నికలే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌కు అఖండ విజయాన్ని అందించి రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించారన్నారు. పంచాయతీ నుంచి ఎంపీ ఎన్నికల్లో వరుసగా గెలిపిస్తూ తమపై ప్రజలు అచెంచల విశ్వాసం ప్రకటించారని గుర్తు చేశారు. ప్రతి విజయం తమపై మరింత బాధ్యతను పెంచిం దని.. అందరం కలిసి అభివృద్ధిలో జిల్లాను ముందంజలో నిలుపుతామన్నారు. ఆ తర్వాత జిల్లా ప్రగతిని వివరించారు. అనారోగ్యం కారణంగా ప్రసంగ పాఠాన్ని జేసీ నగేష్‌తో చదివిం చారు. ప్రసంగ పాఠం ఆయన మాటల్లోనే..

  • రైతుబంధు పథకంలో భాగంగా రైతులకు వ్యవసాయకోసం ఏడాదికి పెట్టుబడి సాయంగా జిల్లాలోని 2,17,533 మందికి ఖరీఫ్‌ సీజన్‌లో రూ.142.67 కోట్లు, రబీ సీజన్‌కు రూ.139.33 కోట్లు పంపిణీ చేశాం. జిల్లాలో 1,68,958 మంది రైతులకు బీమా చేయించాం. ఇప్పటికీ జిల్లాలో 491 మంది రైతులు వివిధ కారణాలతో మరణించగా 441 మందికి ఇన్సూరెన్స్‌ డబ్బులు క్లెయిమయ్యాయి. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా రూ.10.91 కోట్లతో జిల్లాలోని రైతులకు వరికోత యంత్రాలు, ట్రాక్టర్లు, రోటివేటర్లు, వరినాటు యంత్రాలతోపాటు ఇతర సామగ్రి పంపిణీ చేశాం.
  • జిల్లాలో సూక్ష్మ సేద్య పథకం ద్వారా 690 మంది లబ్ధిదారులకు రూ.4.90 కోట్లతో సామగ్రిని అందించాం. సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం కింద పండ్ల తోటల ఉత్పత్తిలో నాణ్యత పెంచేందుకు 89 మంది లబ్ధిదారులకు రూ.7.73 లక్షలు ఖర్చు చేశాం. పాలీహౌస్‌ నిర్మించుకునే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు రూ.107.61 లక్షల సబ్సిడీని అందించాం. పట్టు పరిశ్రమను ప్రోత్సహించేం దుకు 100 ఎకరాలకు రూ.16.66 లక్షలు కేటాయించాం.
  • గొర్రెల ప్రత్యేక అభివృద్ధి పథకం కింది ఇప్పటి వరకు 12.067 గొర్రెల యూనిట్లను రూ.113.12 కోట్ల వ్యయంతో పంపిణీ చేశాం. వీటి ద్వారా రూ.26.24 కోట్ల విలువైన 58,317 గొర్రె పిల్ల ఉత్పత్తి జరిగింది. పాడి రైతుల ఆర్థిక ప్రగతికి జిల్లాలో రూ.13 కోట్ల సబ్సిడీతో 3,044 మంది లబ్ధిదారులకు పాడిగేదెలను అందజేశాం. 
  • జిల్లాలో మిషన్‌ కాకతీయ పథకం ద్వారా నాలుగు విడతల్లో 1,893 చెరువుల అభివృద్ధికి రూ.447.15 కోట్లు మంజూరయ్యాయి. ఈ చెరువుల కింద 1,06,590 ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చింది. ఇప్పటికీ 1,701 చెరువుల మరమ్మతు పనులు పూర్తయ్యియి. రూ.66.82 కోట్లతో ఘనపురం ప్రాజెక్ట్‌ ఎత్తు పెంపుతోపాటు పునరుద్ధరణ పనులు పురోగతిలో ఉన్నాయి. రూ.20.33 కోట్లతో నర్సాపూర్, మెదక్‌ ప్రధాన రహదారి నుంచి ఏడుపాయల దుర్గాభవాని ఆలయం వరకు చేరుకునేందుకు నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు సైతం పురోగతిలో ఉన్నాయి. 
  • మత్స్యశాఖ ద్వారా జిల్లాలోని 100 చెరువుల్లో రూ.65లక్షల ఖర్చుతో 68.76లక్షల చేప పిల్లలను పంపిణీ చేశారు. తద్వారా దాదాపు 1,600 టన్నుల చేపలు ఉత్పత్తి జరిగి చేపల పరిశ్రమపై ఆధారపడిన 10.815 కుటుంబాలకు జీవనోపాధి లభించనుంది. తెలంగాణలో మొట్టమొదటిసారిగా రొయ్యల పెంపకం సాగుపై దృష్టి సారించాం. పోచారం ప్రాజెక్ట్‌లో మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు రూ.6,20 వేల రొయ్య పిల్లలను వేసి పెంచుతున్నాం. సుమారు 30 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. 
  • ముఖ్యమంత్రి మానస పుత్రిక వాటర్‌ గ్రిడ్‌ పనులు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జిల్లాలో రూ.1,500 కోట్లతో 958 గ్రామాల్లో 1,96,232 ఇళ్లకు నల్లాల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోంది. జిల్లా కేంద్రంలో ప్రత్యేక నిధులతో రానున్న మూడు నెలల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా సరఫరా అవుతుంది. 
  • ఈ సంవత్సరం జిల్లాలో 438 నర్సరీల ద్వారా రూ.4.24 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా నిర్ణయించాం. ప్రభుత్వం ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 322 నర్సరీల ఏర్పాటుతో పాటు 2.99 కోట్ల మొక్కలను నాటేందుకు, అటవీశాఖ ఆధ్వర్యంలో 112 నర్సరీల ద్వారా 1.25కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. 
  • లబ్ధిదారునికి ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వమే ఇంటిస్థలం, ఇతర మౌలిక సదుపాయాలతో జిల్లాలో 514 రెండు పడక గదుల ఇళ్లు మంజూరు కాగా.. ఇందులో 3,623 నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తయింది. శివ్వంపేట మండలం దంతాన్‌పల్లి గ్రామంలో నిర్మించిన 30, వెల్దుర్తి మండల కేంద్రంలో 36, చేగుంట మండలం బి.కొండాపూర్‌లో 30 డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. 
  • జిల్లాలో 2,14లక్షల కుటుంబాలకు సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి వ్యక్తికి ఆరుకిలోల చొప్పు న నెలకు 4,099 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని 521 చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నాం. 13.013 కుటుంబాలకు అంత్యోదయ కార్డుల ద్వారా 419 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో ఉజ్వల పథకం కింద బీపీఎల్‌ కుటుంబాలకు 18,045 గ్యాస్‌ కనెక్షన్లు అందజేశాం. 
  • జిల్లాలో 139 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాం. 171 పాఠశాలల్లో డిజిటల్‌ క్లాసులు ప్రారంభించాం. దీని ద్వారా హాజరు శాతం గణనీయంగా పెరిగింది. రూ.3.15 కోట్లతో 42 పాఠశాలల్లో అదనపు గదులను నిర్మించుకుంటున్నాం. మూడు కస్తూర్బా పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్‌ విద్యను సైతం ప్రారంభించుకున్నాం. రాష్ట్ర స్థాయిలో జరిగిన వైజ్ఞానిక ప్రదర్శనలో అద్భుత ప్రదర్శన కనబర్చి దక్షిణ భారతదేశ ప్రదర్శనలకు ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలుపుతున్నాం. 
  • కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు జిల్లాలో 372 గ్రామాల్లో 4.37 లక్షల మందికి దృష్టి పరీక్షలు నిర్వహించి 69.430 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశాం. 1.10లక్షల మందికి సాధారణ వైద్య సేవలను అందించాం. మాతాశిశు మరణాలను నియంత్రించడంలో భాగంగా కేసీఆర్‌ కిట్లను ఇప్పటివరకు జిల్లాలో 9,428 మందికి పంపిణీ చేశాం. 
  • వ్యవసాయ రంగానికి జూలై 2017 నుంచి 24గంటల విద్యుత్‌ సౌకర్యాన్ని రైతులకు ఉచితం గా అందిస్తున్నాం. దీన్‌దయాల్‌ గ్రామీణ జ్యోతి యోజన పథకం కింద దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 32,697 కుటుంబాలకు కనెక్షన్లు ఇచ్చాం.  
  • జిల్లాలో మెగా, భారీ, మధ్య తరహా పరిశ్రమలు, 288 చిన్న తరహా పరిశ్రమలు.. మొత్తం రూ. 29.98 కోట్ల పెట్టుబడితో స్థాపించాం. వీటిలో దాదాపు 2,264 మందికి ఉపాధి కల్పిస్తున్నాం. టీఎస్‌ ఐపాస్‌ విధానం ద్వారా రూ.282.54 కోట్ల పెట్టుబడితో 81 పరిశ్రమలకు 192 అనుమతులకు దరఖాస్తులు వచ్చాయి. 171 అనుమతులను వివిధ శాఖల నుంచి జారీ చేశాం. ఇందులో ఇప్పటి వరకు 40 పరిశ్రమలు ప్రారంభించడం జరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ యువతకు సేవారంగంలో 151 పరిశ్రమలకు రూ.9.60 కోట్ల రూపాయల పెట్టుబడి రాయితీ మంజూరు చేశాం.
  • ఆసరా పింఛన్ల పథకం కింద ప్రతినెల రూ.1000 చొప్పున జిల్లాలోని 1,3,514 మంది వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, బోధకాలు వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.11.20 కోట్లు అందించాం. వీటితో పాటు పలు రకాలు పథకాలు జిల్లాలో అమలవుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement