అమరవీరు స్థూపం వద్ద నివాళులు అర్పిస్తున్న కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా
సాక్షి, వికారాబాద్: సంక్షేమం, అభివృద్ధితో పాటు వ్యవసాయ, సాగునీటి రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి అన్నారు. వికారాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఆమె జాతీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టర్ మస్రత్ ఖానమ్ ఆయేషా, ఎస్పీ నారాయణ, జేసీ అరుణకుమారి, స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌తో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రభుత్వం లక్ష రూపాయల పంట రుణమాఫీతోపాటు ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం అందజేస్తోందన్నారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్‌భగీరథ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కంటి వెలుగు వంటి పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు.
పెద్ద ఎత్తున నిధులు...
గత ఐదేళ్లుగా జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిందని సునీతారెడ్డి తెలిపారు. గత ఏడాది జెడ్పీ నిధులతో జిల్లా వ్యాప్తంగా రూ.33.91 కోట్లతో 1,026 అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. రూ.1,187 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథ పథకం ద్వారా 971 గ్రామాల్లోని ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నామని వివరించారు. మిషన్ కాకతీయ పథకం కింద రూ.233 కోట్లతో 733 చెరువుల్లో పునరుద్ధరణ పనులు చేశామన్నారు. ఈజీఎస్ ద్వారా జిల్లాలో రూ.54 కోట్లతో గ్రామాల్లో సీసీ రోడ్లు వేసినట్లు తెలిపారు. రూర్బన్ పథకం ద్వారా రూ.9.24 కోట్లతో అంగన్‌వాడీలు, పాఠశాలలకు మరమ్మతు పనులు
చేపట్టినట్లు వివరించారు. మినరల్ ఫౌండేషన్ ట్రస్టు ద్వారా రూ.13.9 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రూ.1.70 కోట్లతో వికారాబాద్, తాండూరు, పరిగిలో రైతుబజార్లు నిర్మించినట్లు చెప్పారు. రూ.6.25 కోట్లతో ఆరు సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. రూ.600 కోట్లతో జిల్లాలో రహదారుల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మన్నెగూడ నుంచి రావులపల్లి వరకు జాతీయ రహదారి విస్తరణ పనులు ప్రారంభించామన్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో మరిన్ని అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
రైతు, ప్రజాసంక్షేమానికి పెద్దపీట
జిల్లాలోని రైతులు, ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి తెలిపారు. రైతుబంధు పథకం ద్వారా రెండు లక్షల మందికిపైగా రైతులకు రూ.459 కోట్ల పెట్టబడి సహాయం అందజేసినట్లు చెప్పారు. రైతు బీమా ద్వారా 1.16 లక్షల మందికి ఇన్సూరెన్స్ వర్తింపజేశామన్నారు. భూ పంపిణీ పథకం ద్వారా 42 మంది షెడ్యూల్ కులాల రైతులకు రూ.4.34 కోట్ల వ్యయంతో 77 ఎకరాల భూమి కొనుగోలు చేసి పంపిణీ చేశామన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తున్నట్లు చెప్పారు. కంటి వెలుగు పథకం ద్వారా 3.88 లక్షల మందికి పరీక్షలు నిర్వహించి 91,584 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మత్స్యకారులకు రూ.8 కోట్ల విలువ చేసే వాహనాలు, సామగ్రి అందజేశామన్నారు.
గత ఆర్థిక సంవత్సరంలో కళ్యాణలక్ష్మి ద్వారా 415, షాదీముబారక్ ద్వారా 123 మంది లబ్ధిపొందినట్లు వివరించారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.3.71 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు చెప్పారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఆరు బాలికల మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలోని భరోసా కేంద్రం ద్వారా 60 మంది మహిళలకు ఉపాధి కల్పించినట్లు చెప్పారు. జిల్లాలో నేరాల అదుపుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటంతోపాటు వికారాబాద్ కమాండ్ ఆండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధిలో ప్రజలు, అధికారులు అన్నివర్గాల వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అవతరణ వేడుకల్లో భాగంగా కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబ సభ్యులను జెడ్పీ చైర్‌పర్సన్, కలెక్టర్ సన్మానించారు. అవతరణ వేడుకలసందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment