అభివృద్ధి వైపు అడుగులు.. | Telangana Formation Day Celebrations Warangal | Sakshi
Sakshi News home page

అభివృద్ధి వైపు అడుగులు..

Published Mon, Jun 3 2019 10:56 AM | Last Updated on Mon, Jun 3 2019 10:56 AM

Telangana Formation Day Celebrations Warangal - Sakshi

జెండావందనం చేస్తున్న ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి , కలెక్టర్‌ హరిత తదితరులు పరేడ్‌ నిర్వహిస్తున్న పోలీసులు

సాక్షి, వరంగల్‌ రూరల్‌: అభివృద్ధి వైపు తెలంగాణ అడుగులు వేస్తోంది.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ప్రతీ ఎకరాకు సాగు నీరందిస్తాం.. దేశ సాగునీటి రంగానికే దిక్సూచిలా నిలిచిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి.. మొదటి దశలోనే జిల్లా సస్యశ్యామలం కాబోతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణం సందర్భంగా రూరల్‌ జిల్లా వేడుకలను ఆదివారం హన్మకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హజరైన ఆయన జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లాలోని చెరువులను ఎస్సారెస్పీ నీటితో నింపి మూడు పంటలకు నీరందిస్తామన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా, సకాలంలో విత్తనాలు, ఎరువుల పంపిణీ, రైతు రుణమాఫీ, రైతు బంధు పథకాలతో తెలంగాణ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తుందని తెలిపారు. సంపూర్ణ వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన వరంగల్‌ రూరల్‌లోని రైతాంగానికి ఖరీఫ్‌లో 10,428 క్వింటాళ్ల విత్తనాలను రబీలో 9,490 క్వింటాళ్ల వివిధ రకాల విత్తనాలను రాయితీపై సరఫరా చేశామని పేర్కొన్నారు.

రైతు బంధు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం ద్వారా జిల్లాలో 1లక్ష 49 వేల మంది రైతులకు రూ.240 కోట్లను గత సంవత్సరం అందించామని, ఈ సంవత్సరం నుంచి ప్రతి ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తామని తెలిపారు. రైతులు దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబాలు వీధిన పడకుండా వారిని ఆర్థికంగా అదుకునేందుకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి బీమా చేస్తుందని చెప్పారు. రైతు బీమా పథకంలో భాగంగా జిల్లాలో 241 మంది రైతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.12.05 కోట్లను చెల్లించామని వివరించారు.
 
పెన్షన్లు 
వృద్ధులకు, వితంతువులకు, చేనేత, కల్లుగీత, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు ఇస్తున్న పెన్షన్‌ మొత్తాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అన్నిరకాల పెన్షన్లను రూ.1000 నుంచి రూ.2016లకు, వికలాంగులకు ఇచ్చే రూ.1500లను రూ.3016లకు పెంచినట్లు చెప్పారు. ఈ నెల నుంచే పెంచిన పెన్షన్లు ఇస్తామన్నారు.

తండాలు గ్రామ పంచాయతీలుగా..
గిరిజన ప్రజల కలలను సాకారం చేస్తూ మిగిలిన ప్రాంతాలతో ధీటుగా తండాలు, గూడెలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో జిల్లాలో 132 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దీంతో జిల్లాలో గ్రామ పంచాయతీల సంఖ్య 401కి చేరిందని తెలిపారు. వీటికి 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 30.45 కోట్లు కేటాయించి వివిధ రకాల అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందన్నారు.

ఇంటింటికీ తాగు నీరు..
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మిషన్‌ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. దీని ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించాలనే సంకల్పంలో భాగంగా జిల్లాలోని 16 మండలాల్లోని 776 అవాసాలకు తాగునీరు అందించడం జరుగుతుందని అన్నారు.

ప్రతి గ్రామంలో నర్సరీ
తెలంగాణకు హరిహారం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటి రాష్ట్రంలోని అటవీ సంపదను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. జిల్లాలో 2018–19 హరితహారం కార్యక్రమం కింద 1 కోటి 12 లక్షల మొక్కలను నాటడం జరిగిందని, 16 కిలోమీటర్ల మేర రోడ్ల వెంబడి ప్లాంటేషన్‌ చేశామన్నారు. ఏ గ్రామానికి అవసరమైన మొక్కలను అదే గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసి పెంచి ప్రజలకు అందించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 401 గ్రామ పంచాయతీల్లో 411 నర్సరీలను ఏర్పాటు చేసి 2 కోట్ల 54 లక్షల మొక్కలను పెంచుతున్నామని తెలిపారు.

ఆడబిడ్డలకు అండగా..
ఆడబిడ్డలకు అండగా ఉండాలని, వారి పెళ్లి చేయడానికి ఏ ఒక్క నిరుపేద కుటుంబం కూడా అప్పులు చేయకుండా వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం కల్యాణలక్ష్మీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకంలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు 3707 మంది లబ్ధిదారులకు, షాదీముబారక్‌ ద్వారా 144 కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనాన్ని అందించామని స్పష్టం చేశారు.

మెరుగైన వైద్య సేవలు
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్, సిటీస్కాన్, ఎమ్మారై, డిజిటల్‌ రేడియాలజీ, టుడీ లాంటి అత్యాధునిక పరికరాలను ప్రభ్వుం మంజూరు చేసిందన్నారు. రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ద్వారా జిల్లాలో 1.10 లక్షల మంది బాలబాలికలకు పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

వేగంగా టెక్స్‌టైల్‌ పార్కు పనులు
దేశం గర్వించదగ్గ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ రూరల్‌ జిల్లాలో ఉండడం గర్వకారణమని ఆయన అన్నారు. 1200 ఎకరాలలో రూ.11 వేల కోట్ల పెట్టుబడితో పార్కు పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. అన్ని రకాల వస్త్రాల తయారి, మార్కెటింగ్, ఎగుమతులు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. టీఎస్‌ ఐపాస్‌ ద్వారా 224 పరిశ్రమలు ఇప్పటికే అనుమతి పొందాయని, టీ–ప్రైడ్‌ కింద 249 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు క్యాబ్, గూడ్స్‌ వాహనాలకు పెట్టుబడి రాయితీ కింద రూ.652 లక్షల మంజూరు చేయడం జరిగిందన్నారు.

గొర్రెల పంపిణీ
వ్యవసాయంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. దీనిలో భాగంగా యాదవ, గొల్ల, కురుమ కుటుంబాలకు 75 శాతం సబ్సిడీతో 12909 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశామన్నారు. పాడి రైతుల ఆర్థిక ప్రగతి చెందాలని జిల్లాలో ఇప్పటి వరకు 217 ఎస్సీ, 240 ఎస్టీ, 640 ఇతర వర్గాల కుటుంబాలకు పాడి పశువులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. 

గర్బిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం

ఆరోగ్యలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలోని 908 అంగన్‌వాడీ కేంద్రాల్లో 7 నెలలు నుంచి 3 సంవత్సరాలు గల 15,349 మంది పిల్లలకు నెలకు 2.5 కిలోల బాలామృతం, 16 గుడ్లు, 3 నుంచి 6 సంవత్సరాలు గల 8,874 మంది పిల్లలకు ఒకపూట భోజనంతో పాటు ఉడికంచిన గుడ్లు, స్నాక్స్‌ ఇస్తున్నామని చెప్పారు. 7614 మంది గర్భిణులు, బాలింతలకు పోషక విలువలతో కూడిన ఒకపూట భోజనం, 200 మిల్లీ గ్రాములు పాలు, ఉడికించిన గుడ్లను ప్రతి రోజు ఇస్తున్నామన్నామని తెలిపారు. దివ్యాంగులను వివాహం చేసుకున్న 39 మందికి వివాహ ప్రోత్సాహం కింద రూ.50 వేల చొప్పున రూ.19.50 లక్షలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. 17 మంది దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం రూ.24.60 లక్షల ప్రభుత్వ సబ్సిడీ అందించడం జరిగిందన్నారు. అనంతరం పలువురికి ప్రశంస పత్రాలు అందించారు.

7646 మందికి కేసీఆర్‌ కిట్లు..

మహిళలు, శిశువుల ఆరోగ్యం, వారి భద్రత కోసం ప్రారంభించిన కేసీఆర్‌ కిట్‌ గర్భిణులకు వరంగా మారిందని, దీంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు. గర్భిణులుగా నమోదు చేసుకున్న నాటి నుంచి నాలుగు విడతల్లో ఆడశిశువు అయితే రూ13 వేలు, మగ శిశువు అయితే రూ12 వేలు నేరుగా ఖాతాలో జమచేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో నవజాత శిశువులకు, బాలింతలకు అవసరమయ్యే 16 రకాల వస్తువులతో కూడిన 7646 కేసీఆర్‌ కిట్లను ఇప్పటి వరకు అందించామని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి జబ్బులతో బాధపడకూడదని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. 52709 మందికి కళ్లద్దాలు, 25817 మంది ప్రిస్కిప్షన్‌ గ్లాసులు అందజేయడం జరిగిందన్నారు. 

14 మందికి 10/10 మార్కులు
2019 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 14 మంది విద్యార్థులు 10 జీపీఏ, 60 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. 16 మండల్లాలోని 684 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 38274 మంది విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని వివరించారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి కస్తూర్భా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. పట్టణ, వీధి బాలల కోసం నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన పాఠశాలలో 65 మంది విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు.

వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌..
వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్‌ నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ అందించేందుకు ఇప్పటి వరకు రూ.12.96 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ విద్యుదీకరణ యోజన పథకంలో భాగంగా 15897 సర్వీసులు విద్యుదీకరించబడ్డాయని, 101 యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగిస్తున్న ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల విద్యుత్‌ చార్జీలను ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు.

32.04లక్షల ఉపాధి పని దినాలు 
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని 1, 29496 మంది కూలీలకు 32.04 లక్షల పని దినాలు కల్పించి రూ.46.33 కోట్లను వేతనంగా చెల్లించడం జరిగిందని చెప్పారు. గత సంవత్సరం ఉపాధి హామీ పథకం అమలులో అత్యుత్తమ ఫలితాలు సాధించి జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లా అవార్డు, రాష్ట్ర స్థాయిలో హరితమిత్ర అవార్డు, రాష్ట్ర ఎక్సలెన్సీ అవార్డు పాందడం జరిగిందని వివరించారు.

3.17లక్షల ఎకరాలకు పట్టాల పంపిణీ
భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం కోసం భూ రికార్డులను ప్రక్షాళన చేశామని, రికార్డుల నిర్వాహణ పారదర్శకంగా, సరళంగా ఉండాలనే ఉద్దేశంతో జిల్లాలో 3 లక్షల 17 వేల 852 ఎకరాలను చేసి ఇప్పటి వరకు 1లక్ష 64 వేల 648 మంది రైతులకు పట్టా పాసుబుక్కులు ఇచ్చామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement