నవ దంపతులు–ప్రమోదిని, సరోజ్
అలల ప్రయాణం తీరం చేరేవరకే. కలల ప్రయాణం మెలకువ వచ్చేంత వరకే. కానీ స్పచ్ఛమైన ప్రేమ ప్రయాణం ఎన్ని అడ్డంకులెదురైనా వివాహ బంధంతో ముడి వేస్తుందని రుజువు చేశారా దంపతులు. ఆస్తి కానీ, అందం కానీ వారిని ఆకర్షించలేదు. ఒకరిలో ఇంకొకరు ఏదో ఆశించడంతో వారి మధ్య ప్రేమ చిగురించలేదు. తొలిచూపులోనే వారి మనసులు కలిశాయి. మాటలు ఒక్కటయ్యాయి. స్వచ్ఛమైన ప్రేమకు మనసులు అందంగా ఉంటే చాలనుకున్న వారిద్దరూ మమతానురాగాలు పంచుకుని వివాహ బంధంతో ఒక్కటయ్యారు. యాసిడ్ దాడికి గురై చూపు కోల్పోయిన యువతిని తొలిచూపులోనే ప్రేమించిన యువకుడు ఏడేళ్ల పాటు ఆమెకు అండగా ఉండి తన స్వచ్ఛమైన ప్రేమను అందించాడు. సుదీర్ఘ ప్రేమ ప్రయాణం తరువాత జగత్‌సింగ్ పూర్ జిల్లాలోని తిర్తోల్ సమితి కనకపూర్ గ్రామస్తురాలు ప్రమోదిని రౌల్, ఖుర్దా జిల్లాలోని బలిపట్న సమితి ఝియింటొ గ్రామానికి చెందిన సరోజ్ సాహుల వివాహం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ ప్రేమ జంట వివాహానికి ప్రముఖులు హాజరై ప్రశంసించారు. వివరాలిలా ఉన్నాయి.
భువనేశ్వర్ : తిర్తోల్ ప్రాంతంలోని ఆది కవి సరళా దాస్ కళాశాలలో +2 చదువుతున్న రోజుల్లో బంధువుల ఇంటి నుంచి సోదరునితో కలిసి వస్తుండగా 2009వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీన ప్రేమోన్మాది యాసిడ్ దాడిలో ప్రమోదిని గాయపడింది. యాసిడ్ దాడికి పాల్పడిన ప్రేమోన్మాది భద్రక్ ప్రాంతీయుడు సంతోష్ కుమార్ వేదాంత్. పారా మిలటరీ జవాన్. యాసిడ్ దాడిని పురస్కరించుకుని జగత్‌సింగ్‌పూర్ పోలీసులు సంతోష్‌ను అరెస్టు చేసి ఉద్యోగం నుంచి బహిష్కరించి కటకటాల పాలు చేశారు. యాసిడ్ దాడికి గురైన ప్రమోదిని తీవ్రంగా గాయపడి కోమాలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడింది.
కోమా నుంచి కోలుకుని
యాసిడ్ దాడి తీవ్రతతో బాధితురాలు ప్రమోదిని దాదాపు 5 ఏళ్లు కోమాలో ఉండి క్రమంగా 2014వ సంవత్సరంలో కోలుకోగా ఆమె కంటి చూపు కోల్పోయినట్లు గుర్తించారు. ఈ దశలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న సరోజ్ కుమార్ సాహు విధి నిర్వహణలో భాగంగా ఆసుపత్రికి వచ్చి ఆమెకు పరిచయమయ్యాడు. దీంతో ఆమె జీవితం కొత్త మలుపు తిరిగింది. ఆమె చికిత్స వ్యవహారాల్లో నిపుణులతో నిరంతర సంప్రదింపులు, ఆరోగ్య సంరక్షణతో ప్రమోదిని జీవితంలో కొత్త వెలుగులు నింపాడు. ఆత్మస్థైర్యంతో ఆమె స్వచ్ఛంద సేవా సంస్థలో చేరి తదుపరి జీవనం గడిపేందుకు సిద్ధమైంది. 2014వ సంవత్సరంలో ఏర్పడిన తొలి పరిచయంతోనే వారిద్దరి మధ్య కలిగిన ప్రేమబంధం బలపడి పెళ్లి బాట వైపు అడుగులు వేయించింది.
2018వ సంవత్సరంలో లక్నోలో వారిద్దరి వివాహ నిశ్చితార్థం జరిగింది. వధూవరుల కుటుంబీకులు, బంధుమిత్రుల సమక్షంలో వైదిక సంప్రదాయంలో వారి వివాహం అత్యంత ఆనందోత్సాహాలతో సోమవారం జరిగింది. పెళ్లి విందుకు రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్, రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ మీనతి బెహరా, జగత్‌సింగ్‌పూర్ జిల్లా ఎస్పీ ప్రకాష్ రంగరాజన్, సబ్ డివిజినల్ పోలీసు అధికారి ఎస్డీపీఓ దీపక్ రంజన జెనా, తిర్తోల్ పోలీసు స్టేషన్ అధికారి భావగ్రాహి రౌత్, సర్పంచ్ నమిత రౌల్ ప్రత్యక్షంగా హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment