ఆమె లోకం చూడలేని అంధురాలు.. ఇద్దరు పిల్లలు.. వదిలి వెళ్లిపోయిన భర్త...
హత్యానేరం కింద విధించిన శిక్షను తగ్గించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఆమె లోకం చూడలేని అంధురాలు.. ఇద్దరు పిల్లలు.. వదిలి వెళ్లిపోయిన భర్త. నాన్న ఎప్పుడొస్తాడని పిల్లలు పదే పదే అడుగుతుండటంతో ఏం చెప్పాలో తోచక ఆ తల్లి మనోవ్యథకు లోనయ్యింది. క్షణికావేశంలో పిల్లలను చంపి, తానూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. విచారణ జరిపిన కింది కోర్టు.. హత్య నేరం కింద ఆమెకు శిక్ష విధించింది. దీనిపై ఆ అంధురాలు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది.
విచారణ జరిపిన హైకోర్టు, ఐపీసీ సెక్షన్ 302 కింద కింది కోర్టు విధించిన శిక్షను సవరించింది. హత్య నేరం కాకుండా పిల్లల మరణానికి కారకులయ్యారంటూ ఏడేళ్ల జైలు శిక్షనే విధించింది. ఇప్పటికే శిక్ష పూర్తి చేసి ఉంటే తక్షణమే విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ జె.ఉమాదేవిల ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది.
వరంగల్‌కు చెందిన దూడపాక హరిత అంధురాలు. ఆమెకు ఇద్దరు పిల్లలు. అయితే హరితను, పిల్లల్ని భర్త వదిలి వెళ్లిపోవడంతో నాన్న ఎక్కడుంటాడంటూ పిల్లలిద్దరూ తరచూ హరితను ప్రశ్నిస్తుండేవారు. భర్త వదిలేశాడన్న బాధ ఓవైపు. పిల్లలు తండ్రి ప్రేమకు నోచుకోలేదన్న మనోవ్యథ మరోవైపు. దీంతో క్షణికావేశంలో ఇద్దరు పిల్లలను చీరకొంగుతో చంపేసింది. తానూ ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీనిపై విచారణ జరిపిన వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు.. హత్యానేరం కింద 2010లో ఆమెకు శిక్ష విధించింది. దీనిపై హైకోర్టులో హరిత అప్పీల్ దాఖలు చేయగా విచారణ జరిపిన ధర్మాసనం, చంపాలన్న ఉద్దేశంతో పిల్లల్ని హరిత హత్య చేయలేదని, క్షణాకావేశంలో చేసినట్లు సాక్ష్యాధారాల ద్వారా అర్థమవుతోందని తీర్పులో పేర్కొంది. ఇందుకు గాను 304 పార్ట్–ఎ కింద ఏడేళ్ల జైలు శిక్షను విధిస్తున్నట్లు పేర్కొంది.