జాన్, బాధితుడు
ఉద్యోగ దీపాన్ని వెలిగించండి
Published Wed, Oct 5 2016 5:39 PM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM
* వికలాంగుల కోటాలో ఉద్యోగం పొందిన అంధుడు
* అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా తిప్పుకుంటున్న పోలీసు అధికారులు
* ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితుడు
విధి చిన్నచూపు చూసింది.. తన రెండు కళ్లను చీకటి చేసింది.. అయినా వెనకడుగు వేయలేదు. గుండెల్లో మనో సంకల్పాన్ని రగిలించి విద్యా దీపాన్ని వెలిగించాడు.. ఆ దీపమే వికలాంగుల కోటాలో ఉద్యోగాన్ని సంపాదించి పెట్టి జీవితపు బాటలో వెలుగు రేఖలు పరిచింది. ఇక బతుకంతా కాంతిమయమేననుకున్నాడు.. ఉద్యోగంలో చేరేందుకు పరుగున అధికారుల వద్దకు వెళ్లాడు.. బతుకులో చీకట్లు పారదోలాల్సిన అధికారులు..‘అంధుడివి ఉద్యోగం ఎలా చేస్తావంటూ’ గుమ్మం వద్దే తన అదృష్టాన్ని వెక్కిరించారు.
పట్నంబజారు: గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని సంగడిగుంట బావాజీనగర్‌కు చెందిన తుమ్మాటి జాన్ అంధుడు. ఇంట్లో చిన్నచితక పనులు కూడా చేసుకోలేని పరిస్థితి ఆ అభాగ్యుడిది. భర్త కష్టాన్ని భుజాన వేసుకున్న భార్య అంజమ్మ కూలీనాలీ చేసి కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఈ కష్టంలోనే పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారకూడదన్న తలంపుతో వారిని చదివిస్తున్నారు. కుమార్తె లుంబినీ డిగ్రీ, కుమారుడు పాల్ ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం అభ్యసిస్తున్నారు. ఇంటి దగ్గరే ఉండే జాన్‌కు 2015 సంవత్సరం మార్చిలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వికలాంగుల బ్యాక్‌లాగ్ (క్లాస్ 4) పోస్టుల పరీక్షల్లో ఉద్యోగం సంపాదించాడు. మొత్తం 43 మంది ఎంపిక కాగా వారిలో జాన్ ఒకరు. జిల్లా ఉన్నతాధికారులు జాన్‌ను జిల్లా పోలీసు కార్యాలయంలోని రూరల్ విభాగంలో స్వీపర్‌గా నియమిస్తూ ఈ సంవత్సరం జూన్ ఆఖరులో ఉత్తర్వులిచ్చారు. దీంతో సంబంధిత నియామక పత్రాలను తీసుకుని రూరల్ ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన జాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇక్కడ మీరు ఏమి చేయగలరంటూ... కొంత మంది అధికారులు చేసిన వ్యాఖ్యలకు ఆయన మనసు బాధతో మూగబోయింది. ఇదేమని అడిగితే...వేరే ఉద్యోగం చూస్తామని రూరల్ జిల్లా ఎస్పీ కె. నారాయణ్‌నాయక్ అప్పట్లో హామీ ఇచ్చారు. మూడు నెలలుగా గడిచిపోయింది. ఇప్పటి వరకు ఇక్కడా ఉద్యోగం ఇవ్వలేదు. చేసేదేమి లేక గ్రీవెన్స్‌లో పలుమార్లు కలెక్టర్‌కు విన్నవించాడు. అయినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం కుటుంబం గడవక..ఏ పనీ చేయలేక మనోవేదనలో జాన్ అల్లాడిపోతున్నాడు.
ఆత్మహత్యే శరణ్యం..
– జాన్, అంధుడు
వికలాంగులకు మాత్రమే పోస్టులని చెప్పి అన్ని పరీక్షలు నిర్వహిస్తే అర్హతలు సాధించాను. మూడు నెలల నుంచి ఉద్యోగం వచ్చి కూడా ఖాళీగానే ఉంటున్నా. నాతోపాటు అర్హత పరీక్షలకు హాజరైన వారందరికీ పోస్టింగ్ ఇచ్చారు. నా పరిస్ధితి ఎందుకు ఇలా ఉందో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఉద్యోగం కల్పించకపోతే ఆత్మహత్యే శరణ్యం.
Advertisement
Advertisement