సంగీత సరస్వతిని మెప్పించాడు..
ఢోలక్ వాయించడంలో దిట్ట
కంజీర, డప్పు వాయిస్తే మైమరపే
అంధుడైన సరిపురం మహేశ్ ఘనత
సంగీతంతో పాటు తెలుగులో నైపుణ్యత
పుట్టుకతోనే అంధత్వంతో అంతా చీకటి. కానీ తన కళతో చుట్టూ ఉన్న ప్రపంచానికి వెలుగులు పంచాడు. అంధత్వంతో పాటు పేదరికం పుట్టినప్పటి నుంచి అతడిని వెక్కిరిస్తూ వస్తోంది. అయినా తన సంకల్పం ముందు ఇవన్నీ దిగదుడుపే అయ్యాయి. ఢోలక్, కంజీర, రిథమ్ ప్యాడ్ వాయిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అతడి పేరే సిరిపురం మహేశ్. మంచిర్యాల జిల్లా హాజీపురం మండలం దొనబండ మహేశ్ స్వగ్రామం. ఇటీవలే నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన మహేశ్ తన ప్రతిభతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నాడు.
చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి ఉండేది. పుట్టుకతోనే చూపు లేకపోయినా తనకు వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుందని తన నమ్మకం. శాంతారాం అనే తన చిన్ననాటి స్నేహితుడు ఢోలక్‌ను పరిచయం చేశాడు. అప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి పెరిగిందని మహేశ్ పేర్కొన్నాడు. అయితే దుర్గం శంకర్ అనే మాస్టారు ఢోలక్‌లో మెళకువలు నేరి్పంచి, తనను ఇంతవరకూ తీసుకొచ్చాడని గుర్తు చేసుకున్నాడు. చాలా ఫంక్షన్లలో జరిగే ఆర్కెస్ట్రాల్లో వాయిద్య పరికరాలను వాయిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు.
అవార్డులు, రివార్డులు
తెలుగు టాలెంట్స్ మ్యూజిక్ అవార్డు, తెలంగాణ ప్రభుత్వం కళోత్సవం సందర్భంగా రెండుసార్లు అవార్డు తనను వరించింది. ఆర్కెస్ట్రాలో ఢోలక్, కంజీర వాయిస్తుంటే చాలా మంది ఆశ్చర్యపోయి మెచ్చుకునే వారని మహేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక సంగీతంతో పాటు తెలుగులో కూడా ప్రావీణ్యం సాధించాడు మహేశ్. పేరడీ పాటలు, కవితలు కూడా రాస్తుంటాడు.
అదే నా కల..
భవిష్యత్తులో తెలుగు టీచర్‌గా స్థిరపడాలనేది తన కల అని చెబుతున్నాడు. అంధులకు తెలుగులో వ్యాకరణం నేర్చుకోవడం చాలా కష్టం. కానీ నిజామ్ కాలేజీలో చంద్రయ్య శివన్న అనే తెలుగు మాస్టారు ఎంతో ఓపికగా పాఠాలు నేరి్పంచేవారని చెప్పుకొచ్చారు. పదో తరగతి వరకూ బ్రెయిలీ లిపిలో పాఠాలు ఉండేవని, ఇంటర్ తర్వాత అంధులు పాఠాలు నేర్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నాడు. చంద్రయ్య మాస్టారు పుస్తకాలను పీడీఎఫ్‌లోకి మార్చి తన లాంటి వారికి ఇచ్చేవారని చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment