
సాక్షి, హైదరాబాద్: : ఆమె పాట... స్వరాల ఊయలలూగించింది... అనుభూతుల లోకంలో ముంచింది. ప్రముఖ నేపథ్య గాయని సుమధుర గాత్రంతో సంగీత సంచలనం ఎఆర్ రెహమాన్‌ను సైతం తన అభిమానిగా మార్చుకున్న రోంకిణి గుప్తా... నగరవాసుల్ని పాటల లోకంలో విహరింపజేశారు.
తెలంగాణ పర్యాటక శాఖ, సురమండల్ సంస్థల ఆధ్వర్యంలో నగరంలోని మాసబ్ ట్యాంక్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ ఆవరణలో నిర్వహించిన సంగీత ప్రదర్శనలో ఈ సంప్రదాయ సంగీత కళాకారిణి...హిందూస్థానీ క్లాసికల్ రాగాలాపనతో ప్రారంభించి తన ప్రాచుర్యం పొందిన పాటల్ని ఆలపించి ప్రేక్షకులను అలరించారు.
ఆమెకు తోడుగా తబలా విద్వాంసులు అశిష్ రగ్వానీ, హార్మోనియం విద్వాంసులు దీపక్ మరాతెలు తమ స్వరాలతో సంగీతాభిమానులను ఓలలాడించారు. ఇద్దరు స్థానిక టంపోరా కళాకారులు సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.