వారి జీవితానికి వెలుగే లేకుండా చేసింది
న్యూఢిల్లీ: కిడ్నాప్కు గురైన తమవారిని రక్షించుకోవడం సాధారణ పౌరులకే కష్టం. అలాంటిది అంధులకు ఆ పరిస్థితి ఎదురైతే వారికి ఇంకెంత కష్టమో ఊహించనే లేము. అశారం, లక్ష్మీ అని అంధ దంపతులకు ఓ నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అతడి పేరు హృతిక్. చీకటితో నిండిని వారి జీవితానికి హృతికే ఆశాకిరణం. వారిది రాజస్థాన్ లోని నీమ్ది అనే గ్రామం. ఢిల్లీలో ఆశారం మంగోల్ పురిలోని ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. సెప్టెంబర్ 15న లక్ష్మీ తల్లిదండ్రులను చూసేందుకు రాజస్థాన్ బయలుదేరారు. ఢిల్లీలోని రైల్వే స్టేషన్ కు చేరిన వారు నాలుగో నెంబర్ రైల్వే ఫ్లాట్ ఫాంకు చేరాల్సి ఉంది.
ఆ సమయంలో వారి పరిస్థితి గమనించిన ఓ కిలాడీ లేడి తాను ప్లాట్ ఫాంకు తీసుకెళ్తానని చెప్పడంతోవారు అంగీకరించారు. ప్లాట్ ఫాంకు చేరుకున్న తర్వాత ఆ బాబు నీళ్లకోసం అడగగా తాను నీళ్లు తాగిస్తానని చెప్పి తీసుకెళ్లి కిడ్నాప్ చేసింది. ఎంతసేపటికి బాబు రాకపోవడంతో వారు తమ బిడ్డకోసం కేకలు పెట్టారు. అక్కడి సిబ్బందిగానీ, పోలీసులుగానీ, చుట్టుపక్కలవారుగానీ వారికి సహాయం చేయలేదు. దీంతో వారు బాధకు అంతులేకుండా పోయింది.
ఎట్టకేలకు అతడు తన అంధుల యూనియన్ తో కలిసి నగర పోలీస్ కమిషనర్ ను సంప్రదించగా ఆయన పోలీసులకు ఆదేశించారు. అంతేకాదు. ఆ బాబును గుర్తించిన వారికి రూ.50వేల పారితోషికం ఇస్తామని రివార్డు ప్రకటించారు. ఇప్పటికి ఆ బాబు కిడ్నాప్ కు గురై పది రోజులు అవుతుంది. వారంలోగా రక్షిస్తామని పోలీసులు చెబుతున్నారు.