వానొచ్చినా కరెంటు పుట్టించే సోలార్ ప్యానెల్!
సూర్యుడు వెలుగులు చిమ్ముతున్నప్పుడు మాత్రమే కాకుండా.. వాన చినుకులు పడుతున్నప్పుడూ విద్యుత్తు ఉత్పత్తి చేయగల సరికొత్త సోలార్ ప్యానెల్స్‌ను చైనా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివద్ధి చేశారు. ఏసీఎస్ నానో జర్నల్ తాజా సంచిలో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. ఈ హైబ్రిడ్ సోలార్ ప్యానెల్‌లో సాధారణ సిలికాన్ సోలార్‌సెల్స్‌తోపాటు ట్రైబోఎలక్ట్రిక్ నానో జనరేటర్లు ఉంటాయి.
సిలికాన్ సెల్స్ సూర్యుడి వెలుతురును విద్యుత్తుగా మార్చేస్తే.. నానో జనరేటర్లు యాంత్రిక శక్తిని విద్యుత్తుగా మారుస్తాయి. వాన చినుకులు ఈ ప్యానెల్‌పై పడినప్పుడు ఈ జనరేటర్లు వాటి ద్వారా అందే యాంత్రిక శక్తిని విద్యుత్తుగా మారుస్తాయి. ఇలా రెండు రకాలుగా ఉత్పత్తి అయ్యే విద్యుత్తును జత చేసేందుకు ఒకే ఎలక్ట్రోడ్‌ను వాడటం ఇందులోని విశేషం.
నానో జనరేటర్‌కు, సోలార్ సెల్‌కు మధ్య ఉండే ఈ ఎలక్ట్రోడ్ సోలార్ సెల్‌కు రక్షణ కవచంగానూ ఉపయోగపడుతుందని తద్వారా దాని సామర్థ్యం తగ్గకుండా ఉంటుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తెలిపారు. అంతేకాకుండా ఈ ఎలక్ట్రోడ్ కాంతి ఎక్కువగా బయటకు వెళ్లకుండా అడ్డుకుని విద్యుదుత్పత్తిని పెంచుతుందని వివరించారు.
ఆ బ్యాక్టీరియాతో మధుమేహులకు మేలు!
పీచుపదార్థాలను పేగుల్లో పులిసిపోయేలా చేసే బ్యాక్టీరియాతో మధుమేహులకు ఎక్కువ లాభం చేకూరుతుందని రట్గర్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అంటున్నారు. వేర్వేరు రకాల పీచుపదార్థాలను తీసుకోవడం ద్వారా ఈ రకమైన బ్యాక్టీరియా పేగుల్లో వృద్ధి చెందేలా చేసుకోవచ్చునని.. తద్వారా రక్తంలో గ్లూకోజ్ మోతాదులను నియంత్రణలో ఉంచుకోవచ్చునని వారు అంటున్నారు.
ఆరేళ్లపాటు కొంతమంది ఆహారపు అలవాట్లను.. వారు తీసుకునే పీచుపదార్థాలను పరిశీలించడం ద్వారా తాము ఈ అంచనాకు వచ్చినట్లు ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త లిపింగ్ ఝావ్ తెలిపారు. పేగుల్లో మనం తినే ఆహారంలోని పీచుపదార్థాలు, కార్బోహైడ్రేట్లను బ్యాక్టీరియా చిన్నచిన్న ముక్కలుగా చేస్తుందని.. ఈ క్రమంలో ఏర్పడే షార్ట్ చెయిన్ ఫ్యాటీ యాసిడ్లు పేగు గోడలకు చేరి వాపు/మంటలను తగ్గిస్తాయి.
ఈ రకమైన ఫ్యాటీ యాసిడ్లు తక్కువైనప్పుడు మధుమేహం వంటి వ్యాధులు వస్తాయని ఇప్పటికే కొన్ని పరిశోధనలు రుజువు చేసిన నేపథ్యంలో తాజా అధ్యయనానికి ప్రాధాన్యం ఏర్పడింది. సాధారణ ఆహారం తీసుకునే వారితో పోలిస్తే... వేర్వేరు రకాల పీచు పదార్థాలు ఆహారం రూపంలో తీసుకునే వారి రక్తంలో గ్లూకోజ్ మోతాదు నియంత్రణలో ఉన్నట్లు తెలిసింది. దాదాపు పన్నెండు వారాలపాటు సాగిన ఈ అధ్యయనంలో మూడు నెలల గ్లూకోజ్ మోతాదులను లెక్కించారు.
బంగారం, టైటానియంతో అంధత్వానికి చెక్?
అంధత్వంతో బాధపడుతున్న వారికి ఎంతో కొంత స్థాయిలో చూపు కల్పించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. చైనాలోని యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తాజాగా చేసిన పరిశోధనల్లో పాక్షిక విజయం సాధించారు కూడా. బంగారం, టైటానియం వంటి లోహాలతో చూపు కోల్పోయిన ఎలుకలు మళ్లీ చూడగలిగేలా చేశారు వీరు. కళ్లల్లో కాంతికి స్పందించే కొన్ని ప్రత్యేక భాగాలు ఉంటాయి. వీటిని ఫొటో రిసెప్టర్లు అంటారు.
కొన్ని ఎలుకల్లో జన్యుమార్పుల తద్వారా ఈ ఫొటో రిసెప్టర్లు క్రమేపీ నాశనమయ్యేలా చేసి వీరు కొన్ని పరిశోధనలు చేశారు. నాశనమైన ఫొటో రిసెప్టర్ల స్థానంలో బంగారం, టైటానియం నానో తీగలతో చేసిన ఫొటో రిసెప్టర్లను అమర్చినప్పుడు ఆ ఎలుకలు మళ్లీ కొన్ని రంగులను చూడగలిగినట్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఒకరు చెప్పారు. అంతేకాకుండా లోహపు ఫొటో రిసెప్టర్లు కలిగి ఉన్న ఎలుకలు వెలుతురుకు స్పందించడం మొదలుపెట్టాయని.. ఎనిమిది వారాల తరువాత కూడా ఎలాంటి దుష్ప్రభావాలూ కనిపించలేదని వివరించారు. రెటినైటిస్ పిగ్మెంటోసా, మాక్యులర్ డిజనరేషన్ వంటి కంటివ్యాధులకూ ఈ పరిశోధన ద్వారా మెరుగైన చికిత్స అందించేందుకు వీలుందని నిపుణుల అంచనా.
Comments
Please login to add a commentAdd a comment