న్యూఢిల్లీ: ప్రత్యేక సందర్భాలైన జాతీయ భద్రత, ప్రజా జీవనం ప్రమాదంలో పడినప్పుడు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ తరహా యాప్స్‌ను బ్లాక్ చేసేందుకు అనుసరించాల్సిన సాంకేతిక చర్యల విషయమై పరిశ్రమ అభిప్రాయాల్ని టెలికం శాఖ కోరింది. టెలికం ఆపరేటర్లు, ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ల అసోసియేషన్ (ఐఎస్‌పీఏఐ), సీవోఏఐలకు టెలికం శాఖ జూలై 18నే లేఖలు రాసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద మొబైల్ అప్లికేషన్లను బ్లాక్ చేయడంపై తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది.
కంప్యూటర్ ద్వారా ఏ సమాచారాన్ని కూడా పొందకుండా నిరోధించేందుకు ఉపయోగించతగిన అధికారాలను ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ తెలియజేస్తోంది. వాట్సాప్‌లో వచ్చిన వదంతుల ఆధారంగా ఇటీవలి కాలంలో అల్లరి మూకలు కొందరిపై దాడులకు దిగడం, కొట్టి చంపడం వంటి ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తాజా చర్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఐటీ శాఖ అధికారి ఒకరు దీనిపై మాట్లాడుతూ... ‘‘సదరు సందేశాలు ఎలా వచ్చాయన్నది తనవంతుగా గుర్తించేందుకు వాట్సాప్ కట్టుబడి లేదు.
ప్రభుత్వ డిమాండ్లలో ఇది కూడా ఒకటి. దుర్వినియోగానికి అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. నకిలీ వార్తలకు చెక్ పెట్టేందుకు వాట్సాప్ తీసుకున్న చర్యల విషయమై కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసింది. తన ప్లాట్ ఫామ్‌ను దుర్వినియోగం చేస్తున్న వారిని, సందేశాలతో రెచ్చగొడుతున్న వారిని గుర్తించే విషయమై బాధ్యతను విస్తరించజాలదని ఐటీ శాఖ స్పష్టం చేసింది. అలాగే, తగిన చర్యలు తీసుకోకపోతే వదంతుల వ్యాప్తి, ప్రోత్సాహక ప్లాట్‌ఫామ్‌గా ఫేస్‌బుక్‌ను గుర్తించాలంటూ ఆ శాఖకు పంపిన రెండో నోటీసులో హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment