ఇంట్లోకి పడే ఎండతో కరెంటు! | Innovative power-generating blinds from Ukrainian start-up | Sakshi
Sakshi News home page

ఇంట్లోకి పడే ఎండతో కరెంటు!

Published Tue, May 16 2017 4:04 AM | Last Updated on Wed, Apr 3 2019 4:04 PM

ఎండ నుంచి రక్షణే కాదు, ఈ ‘బ్లైండ్స్‌’ నుంచి విద్యుత్తునూ పొందవచ్చు - Sakshi

ఎండ నుంచి రక్షణే కాదు, ఈ ‘బ్లైండ్స్‌’ నుంచి విద్యుత్తునూ పొందవచ్చు

ఒక్కదెబ్బకు రెండు పిట్టలంటే ఇదే. ఎండ వేడిమి నుంచి రక్షణ కోసం మనం కిటికీలకు పరదాలు కట్టుకుంటామా? అవే పరదాలతో సూర్యుడి నుంచి కొంచెం కరెంటును కూడా పొందగలిగితే.. భలే ఉంటుందన్న ఆలోచనకు వాస్తవ రూపం ఈ ఫొటోల్లో కనిపిస్తున్న బ్లైండ్స్‌.  బ్లైండ్స్‌ అంటే అవేవో అనుకునేరు. మనం పరదాలంటాం.. ఇంగ్లిష్‌ వాళ్లు బ్లెండ్స్‌ అంటారు.  ఇంతకీ ఈ బ్లైండ్స్‌ పేరేమిటో తెలుసా? సోలార్‌ గ్యాప్స్‌. ఉక్రెయిన్‌కు చెందిన శాస్త్రవేత్త ఎవ్‌గిన్‌ ఎరిక్‌ వీటిని తయారు చేశాడు. ఒకవైపు సోలార్‌ సెల్స్, ఇంకోవైపు అల్యూమినియంతో ఇవి తయారయ్యాయి.

కేవలం పది చదరపు అడుగుల విస్తీర్ణమున్న కిటికీకి ఈ  బ్లైండ్స్‌ ను తగిలిస్తే చాలు.. దాదాపు వంద వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసుకోవచ్చు. ప్రతి కిటికీ పక్కనే ఏర్పాటు చేసుకునే చిన్న ఇన్వర్టర్‌ బ్యాటరీల్లో ఈ విద్యుత్తు స్టోర్‌ అవుతుంది. ఆ.. వంద వాట్‌లు ఏమీ సరిపోతాయి అనుకునేరు! ఈ మాత్రం కరెంటు మూడు ల్యాప్‌టాప్‌లను ఛార్జ్‌ చేయగలదు. 5 రూముల్లోని ఎల్‌ఈడీ బల్బులను వెలిగించగలదు. ఇంకోలా చెప్పాలంటే ఒక్క కిటికీ  బ్లైండ్స్‌తో ఇంట్లోని లైటింగ్‌ మొత్తం ఫ్రీ అయిపోతుందన్నమాట. బాగానే ఉందిగానీ... వీటిని బిగించుకోవడం కష్టమేమో? కాదట. అదికూడా సులువేనట. అంతేకాదు, స్మార్ట్‌ఫోన్‌ అప్లికేషన్‌ ద్వారా ఎప్పుడు ఎంత కరెంటు ఉత్పత్తి అవుతున్నదీ చూసుకోవచ్చు. అధిక విద్యుదుత్పత్తికి ఈ  బ్లైండ్స్‌ను ఎప్పుడు పైకి, ఎప్పుడు కిందకు కదిలించాలో కూడా యాప్‌ ద్వారా సూచనలు అందుతాయి.

యాప్‌ ద్వారానే వాటిని కదిలించవచ్చు కూడా. ఒకసారి కొనుక్కుంటే పాతికేళ్లపాటు ఇవి పనిచేస్తూనే ఉంటాయని ఎరిక్‌ ఏర్పాటు చేసిన కంపెనీ సోలార్‌ గ్యాప్స్‌ అంటోంది. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది పనిచేస్తుందని, వేర్వేరు సైజుల్లోనూ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ సోలార్‌ పరదాలను వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ఎరిక్‌ బృందం ప్రస్తుతం కిక్‌స్టార్టర్‌ ద్వారా నిధులు సమీకరిస్తోంది.  
– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement