మనం ఏ బాట ఎంచుకోవాలో అనేది విధి నిర్ణయిస్తుందో లేదోగానీ పరిస్థితులు మాత్రం నిర్ణయిస్తాయి. డాక్టర్ కావాలనుకున్న అక్షితా సచ్‌దేవా పరిస్థితుల ప్రభావం వల్ల పరిశోధన రంగంలోకి వచ్చింది. ఎన్నో రంగాలకు చెందిన ఎంతోమంది అంధులతో మాట్లాడింది. వారి సమస్యల గురించి లోతుగా తెలుసుకుంది. వారు ఎదుర్కొంటున్న సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు కనుక్కోవాలనుకుంది. బెంగళూరు కేంద్రంగా ఆమెప్రారంభించిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ ‘ట్రెస్టిల్ ల్యాబ్స్’ అంధులకు బాట చూపించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ల్యాబ్స్ నుంచి వచ్చిన ‘కిబో’ పరికరం ఆ దిశగా వేసిన తొలి అడుగు....
అక్షితా సచ్‌దేవా అమ్మమ్మ క్యాన్సర్‌తో చనిపోయింది. ఇక అప్పటి నుంచి డాక్టర్ కావాలనేది తన లక్ష్యంగా మారింది. అయితే కాలేజీ రోజుల్లో ఒక లెక్చరర్‌తో మాట్లాడిన తరువాత తన ఆలోచనల్లో మార్పు వచ్చింది. ‘డాక్టర్ కావాలి’ అనే తన లక్ష్యం గురించి చెప్పినప్పుడు క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించే సాంకేతికత, దాని ప్రాధాన్యతతో పాటు హెల్త్‌కేర్ రంగంలోని ఎన్నో ఆవిష్కరణల గురించి చెప్పారు ఆ లెక్చరర్.
‘నా కళ్లు తెరిపించిన సందర్భం అది’ అని ఆ రోజును గుర్తు చేసుకుంటుంది అక్షిత. ఆ రోజు నుంచి హెల్త్‌కేర్ రంగానికి సంబంధించిన సాంకేతికత, సరికొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టింది. ఫరీదాబాద్‌లోని మానవ్ రచన కాలేజ్‌లో ఇంజినీరింగ్ చేస్తున్న రోజుల్లో దృష్టి లోపం ఉన్నవారి కోసం ఒక గ్లోవ్‌ను రూపొందించింది అక్షితా సచ్‌దేవా. చూపుడు వేలిపై కెమెరా ఉండే ఈ హ్యాండ్‌గ్లోవ్ సహాయంతో దృష్టి లోపం ఉన్నవారు చదవవచ్చు.
ఈ గ్లోవ్ గురించి న్యూ దిల్లీలోని నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్(ఎన్‌ఏబీ)కి వివరించింది అక్షిత. దృష్టి లోపం ఉన్న ఒక యువకుడు ఈ గ్లోవ్‌ను ఉపయోగించి న్యూస్‌పేపర్ చదవగలిగాడు. ఈ విజయం ఆమెలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఇంకా ఏదో సాధించాలనే పట్టుదలను పెంచింది. అంధులకు జీవనోపాధి, విద్య, దైనందిన జీవన విషయాల్లో సహాయపడడానికి తన ఆవిష్కరణను ముందుకు తీసుకువెళ్లాలనుకుంది.
అంధులు ఎదుర్కొనే సమస్యలను లోతుగా అర్థం చేసుకోవాలనుకుంది. బ్యాంకర్లు, పీహెచ్‌డీ స్కాలర్లు, గృహిణులు... వివిధ విభాగాలకు చెందిన అంధులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకుంది. ఆ సమయంలోనే దీపాలి పవార్ అనే స్టూడెంట్‌తో మాట్లాడింది.
కాలేజీలో ఒక సెమిస్టర్ పూర్తి చేసిన దీపాలి హటాత్తుగా చూపు కోల్పోయింది. ఆమెను తిరిగి తీసుకోవడానికి కాలేజి వారు నిరాకరించారు. బ్రెయిలీ నేర్చుకోమని సలహా ఇచ్చారు. బ్రెయిలీ నేర్చుకోవడానికి దీపాలి రెండేళ్లు గడిపింది. అయితే అది ఆమెకు కష్టంగా ఉండేది. బ్రెయిలీ నేర్చుకున్న తరువాత కూడా ఆమెకు కాలేజీలో చదివే అవకాశం రాలేదు. యశ్వంత్‌రావ్ చవాన్ మహారాష్ట్ర ఓపెన్ యూనివర్శిటీలో చేరడమే దీపాలి ముందు ఉన్న ఏకైక మార్గం అయింది.
ఆడియో–రికార్డెడ్ పుస్తకాలను అందించే ఒక స్వచ్ఛంద సంస్థను సంప్రదించింది దీపాలి. అయితే ఒక్కొక్క పుస్తకం కోసం నాలుగు నుంచి ఆరువారాల పాటు ఎదురుచూడాల్సిన పరిస్థితి. ఆమె దగ్గర మూడు పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. ఆ పుస్తకాలను తీసుకువెళ్లిన అక్షిత వాటిని మొబైల్ అప్లికేషన్ ఫామ్‌లోకి మార్చి దీపాలికి ఇచ్చింది.
మూడు నెలల తరువాత..
దీపాలి నుంచి ఫోన్ వచ్చింది. ‘సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్‌ను సింగిల్ అటెంప్ట్‌లో పూర్తి చేశాను’ అని సంతోషంగా చెప్పింది. ఇది అక్షితకు మరో విజయం. మరింత ఉత్సాహాన్ని ఇచ్చిన విజయం. ఈ ఉత్సాహ బలమే బోనీదేవ్‌తో కలిసి బెంగళూరు కేంద్రంగా ‘ట్రెస్టిల్ ల్యాబ్స్’ అనే రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీప్రారంభించేలా చేసింది.
నాసిక్‌లోని ‘నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్’లో పెద్దయంత్రాన్ని చూసింది అక్షిత. అయితే అది పెద్దగా ఉపయోగంలో లేదు. ఈ మెషిన్ ప్రింటెడ్ డాక్యుమెంట్స్‌ను చదవగలుగుతుంది. అయితే కేవలం ఇంగ్లీష్‌లో మాత్రమే. అప్పుడే అక్షితకు ఎన్నో భారతీయ భాషలకు సంబంధించిన పుస్తకాలను చదవగలిగే యంత్రాన్ని రూపొందించాలనే ఐడియా తట్టింది.
అది ‘కిబో’ రూపంలో సాకారం అయింది. ఈ పరికరం విజయం సాధించడంతో నాసిక్ మున్సిపల్ కార్పోరేషన్, ఐఐఎం–అహ్మదాబాద్... మొదలైన సంస్థల నుంచి ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ‘భారతీయ భాషలపై దృష్టి కేంద్రీకరించిన తొలి అసిస్టివ్ టెక్ టూల్ కిబో’ అంటుంది అక్షిత.
మరింతగా..
అంధులకు ఉపకరించే దిశగా ఆసియా, ఆఫ్రికాలలో మా సంస్థను విస్తరించాలనుకుంటున్నాం. ‘కిబో’కు మరిన్ని భాషలను జోడించాలనుకొంటున్నాము. ఏఐ సాంకేతికతతో సెల్ఫ్–లెర్నింగ్, సెల్ఫ్–ట్రైనింగ్ మాడ్యూల్స్‌కు రూపకల్పన చేస్తాం. – అక్షితా సచ్‌దేవా, కో–ఫౌండర్, ట్రెస్టిల్ ల్యాబ్స్
కిబో ఇలా..
‘కిబో’ వాటర్ బాటిల్ ఆకారంతో ఉంటుంది. దీని ఎడమవైపు ఉన్న బటన్‌ను నొక్కితే టేబుల్ ల్యాంప్ ఆకారంలోకి మారుతుంది. యూఎస్‌బీ కేబుల్ దీన్ని ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేస్తుంది. పుస్తక పాఠాన్ని ‘కిటో’ సంగ్రహిస్తుంది.
అరవై భాషలలో ఏ భాషలలోనైనా అనువాదం అడగవచ్చు. వ్యక్తులు, సంస్థల కోసం విడిగా నాలుగు ‘కిబో’ప్రాడక్ట్స్‌ను రూపొందించారు. ‘కిబో ఎక్స్‌ఎస్’ను స్కూలు, కాలేజీలలోని లైబ్రరీల కోసం అందుబాటులో ఉంచారు. ‘కిబో 360’ని వ్యాపారసంస్థలు, యూనివర్శిటీలు, ప్రచురణ సంస్థల కోసం రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment