ఎస్‌పీబీతో డ్యూయెట్ పాడాలి : గాయని
తమిళసినిమా : సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతంలో విడుదలైన కుక్కూ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నేపథ్య గాయని వైకొం విజయలక్ష్మి. ఈమె గళం ఎన్నమో ఏదో చిత్రంలో చోటుచేసుకున్న పుదియ ఉలగై పాట వైకొం విజయలక్ష్మి ఎవరా? అంటూ అభిమానులు వెతికేలా చేసింది. పుట్టుకతోనే అంధురాలైన విజయలక్ష్మి ఇటీవల శస్త్రచికిత్స ద్వారా చూపు పొందింది. ఈమె పాటలు పాడడమే కాకుండా వీణ వాద్య కళాకారిణి కూడా.
విజయలక్ష్మి వీణవాద్యంలో ప్రపంచ రికార్డును పొందింది. ఈమె సామర్థ్యాన్ని అభినందిస్తూ అమెరికాకు చెందిన వరల్డ్ తమిళ్ యూనివర్సిటీ ఆమెకు గౌరవ డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు డాక్టరేట్ పొందడం చాలా ఆనందంగా ఉన్నట్టు తెలిపారు. భగవంతుడి ఆశీర్వాదం వలనే తనకు డాక్టరేట్ లభించిందన్నారు. ఈ డాక్టరేట్‌ను ఆ భగవంతుడికి, గురు, అమ్మా, నాన్న అందరికీ అర్పిస్తున్నట్టు చెప్పారు. తనకు ఇన్ని చిత్రాల్లో పాడే అవకాశం వచ్చినప్పటికీ సంతృప్తిగా లేదన్నారు. ఎస్‌పీబీతో డ్యూయట్ పాడాలన్నదే తన ఆశ అని విజయలక్ష్మి వెల్లడించారు.