పార్కు అంటే అందరికీ ఆహ్లాదం కలిగించేదే. కానీ లోకాన్ని చూడలేని అంధులు పార్కుకు వెళితే.. ఎలా నడవాలి, ఎటు వెళ్లాలి? ఊయలలోనో, మరో ఆట పరికరంపైనో పడిపోకుండా ఎలా ఆహ్లాదం పొందాలి? ఇలాంటి ప్రశ్నల నేపథ్యంలోనే.. ఖమ్మంలోని వినూత్నమైన పార్కును సిద్ధం చేశారు.
అంధులైన చిన్నారులతోపాటు ఇతర దివ్యాంగులు, వయో వృద్ధులకు సౌకర్యవంతంగా ఉండేలా అభివృద్ధి చేశారు. అంధుల కోసం ప్రత్యేక లిపిని సృష్టించిన లూయీస్ బ్రెయిలీ విగ్రహాన్ని కూడా ఇందులో ఏర్పాటు చేశారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించనున్న ఈ పార్కు విశేషాలివీ.. – ఖమ్మం మయూరి సెంటర్
సులువుగా నడిచేలా..
చేతికర్ర సాయంతో నడిచే అంధులు పార్కులో ఇబ్బంది పడకుండా వాకింగ్ ట్రాక్‌పై ప్రత్యేక టైల్స్ ఏర్పాటు చేయించారు. దారిలో ముందుకు వెళ్లాలని సూచించేలా పొడవుగా ఉండే బుడిపెలతో కూడిన టైల్స్‌ను ట్రాక్ మధ్యలో పెట్టారు. మలుపు తీసుకోవాల్సిన చోట, మధ్యలో పక్క నుంచి మరోదారి ఉన్న చోట.. ఈ విషయాన్ని గుర్తించగలిగేలా చిన్న బుడిపెలతో కూడిన ‘అలర్ట్ టైల్స్’ను ఏర్పాటు చేశారు. చేతికర్ర, లేదా పాదాలతో తాకడం ద్వారా అంధులు వీటిని గుర్తిస్తూ.. సులువుగా నడిచి వెళ్లేందుకు వీలుంటుంది.
పడిపోకుండా.. పట్టుకోల్పోకుండా..
అంధులతోపాటు ఇతర దివ్యాంగులు, వయో వృద్ధులకు కూడా ప్రయోజన కరంగా ఉండేలా ఆట వస్తువులను ఈ పార్కులో ఏర్పాటు చేశారు. సీ–సా (రెండు వైపులా ఇద్దరు కూర్చుని పైకి కింది ఊగే పరికరం), ఊయల, జారుడు బల్ల వంటి వాటికి.. రెండు పక్కలా, వెనకాల కుర్చిల తరహాలో పట్టుకునేలా తయారు చేయించారు.
♦ పార్కులో ఏర్పాటు చేసిన పంచతత్వ విభాగం (ఇసుక, సన్నని రాళ్లు, గడ్డి, సాధారణ మట్టి, నీళ్లు.. ఇలా ఐదు రకాలతో కూడిన వాకింగ్ ట్రాక్)లో కూడా రెండు వైపులా ఇనుప కడ్డీలను అమర్చారు. అంధులతోపాటు వయో వృద్ధులు వాటిని పట్టుకుని సులువుగా నడవడానికి వీలవుతుంది.
ప్రత్యేక సంగీత పరికరాలు కూడా..
దివ్యాంగులు, అంధులు మరింత ఏకాగ్రత సాధించేందుకు మ్యూజిక్ థెరపీ ఉపయోగపడుతుందని చెప్తుంటారు. ఈ క్రమంలో పార్కులో వారికోసం ప్రత్యేకంగా సంగీత పరికరాలను ఏర్పాటు చేశారు. కాండెజా, కాంగస్ డ్రమ్స్, సోప్రానో పెంటాటోనిక్, బెబల్ డ్రమ్ వంటి వాయిద్య పరికరాలను అమర్చారు. ఇక పార్క్ ఆవరణలో స్థానిక కార్పొరేటర్ మక్బూల్ సొంత నిధులతో చిన్న గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేయించారు.
Comments
Please login to add a commentAdd a comment