తుమ్మల వర్సెస్‌ పువ్వాడ..పేలుతున్న మాటల తూటాలు | Tummala Versus Minister Puvvada Khammam Became Hot Segment In Telangana Assembly Elections - Sakshi
Sakshi News home page

తుమ్మల వర్సెస్‌ పువ్వాడ..పేలుతున్న మాటల తూటాలు

Published Fri, Nov 3 2023 8:11 PM | Last Updated on Sat, Nov 4 2023 1:26 PM

tummala versus minister puvvada khammam became hot segment in telangana assembly elections - Sakshi

సాక్షి, ఖమ్మం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వార్‌లో ఖమ్మం నియోజకవర్గం హాట్‌ సెగ్మెంట్‌గా మారింది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య రసవత్తరమైన పోరు నడుస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ రావు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ల మధ్య  మాటల తూటాలు పేలుతున్నాయి.ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు ఎక్కు పెడుతున్నారు.

ఖమ్మం నగరంలోని 50వ డివిజన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తుమ్మల  బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడపై తీవ్రస్తాయిలో ఫైర్ అయ్యారు. ఖమ్మం నగరంలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు.ఇసుక నుంచి మట్టి దాకా దోపిడీ దొంగల పాలయిందన్నారు.

సామాన్యుడు ఒక ప్లాటు కొనుక్కుంటే దాన్ని కూడా ఎప్పుడు ఎవరొచ్చి కబ్జా చేస్తారోనని బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొత్తగా ట్రాన్స్‌పోర్ట్‌ మాఫియా కూడా నగరంలో తయారైందన్నారు. ఈ దుర్మార్గపు పాలన నుంచి ఖమ్మం నగర ప్రజలు బయట పడాలంటే నవంబర్ 30న  జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ఓటు వేయాలని తుమ్మల కోరారు.

తుమ్మల వ్యాఖ్యలకు అదే స్థాయిలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు మంత్రి పువ్వాడ. ఖమ్మం 24వ డివిజన్‌లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పువ్వాడ తుమ్మలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖమ్మం, పాలేరు ప్రజలు ఇంటికి పంపిస్తే మళ్ళీ పొర్లు దండాలు పెడుతూ ఖమ్మంలో తిరుగుతున్నావని తుమ్మలను ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్పప్పుడు  ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కేవలం అధికారాన్ని అనుభవించి ప్రజలను బూతు పురాణంతో భయ బ్రాంతులకు గురి చెయ్యడం తప్ప తుమ్మల చేసిందేమీ లేదన్నారు. 40 ఏళ్ల పాటు ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారో అదే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారని,ఇదే నా మీరు చెప్పే నీతి నిజాయితీ అని ప్రశ్నించారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో  ఖమ్మం ప్రజలు తనవైపే నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు  పువ్వాడ.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement