segment
-
తుమ్మల వర్సెస్ పువ్వాడ..పేలుతున్న మాటల తూటాలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వార్‌లో ఖమ్మం నియోజకవర్గం హాట్ సెగ్మెంట్‌గా మారింది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల మధ్య రసవత్తరమైన పోరు నడుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు ఎక్కు పెడుతున్నారు. ఖమ్మం నగరంలోని 50వ డివిజన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తుమ్మల బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడపై తీవ్రస్తాయిలో ఫైర్ అయ్యారు. ఖమ్మం నగరంలో అరాచకం రాజ్యమేలుతోందన్నారు.ఇసుక నుంచి మట్టి దాకా దోపిడీ దొంగల పాలయిందన్నారు. సామాన్యుడు ఒక ప్లాటు కొనుక్కుంటే దాన్ని కూడా ఎప్పుడు ఎవరొచ్చి కబ్జా చేస్తారోనని బిక్కు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కొత్తగా ట్రాన్స్పోర్ట్ మాఫియా కూడా నగరంలో తయారైందన్నారు. ఈ దుర్మార్గపు పాలన నుంచి ఖమ్మం నగర ప్రజలు బయట పడాలంటే నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కే ఓటు వేయాలని తుమ్మల కోరారు. తుమ్మల వ్యాఖ్యలకు అదే స్థాయిలో గట్టిగా కౌంటర్ ఇచ్చారు మంత్రి పువ్వాడ. ఖమ్మం 24వ డివిజన్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న పువ్వాడ తుమ్మలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఖమ్మం, పాలేరు ప్రజలు ఇంటికి పంపిస్తే మళ్ళీ పొర్లు దండాలు పెడుతూ ఖమ్మంలో తిరుగుతున్నావని తుమ్మలను ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్పప్పుడు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం అధికారాన్ని అనుభవించి ప్రజలను బూతు పురాణంతో భయ బ్రాంతులకు గురి చెయ్యడం తప్ప తుమ్మల చేసిందేమీ లేదన్నారు. 40 ఏళ్ల పాటు ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేశారో అదే కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారని,ఇదే నా మీరు చెప్పే నీతి నిజాయితీ అని ప్రశ్నించారు. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఖమ్మం ప్రజలు తనవైపే నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు పువ్వాడ. -
ఒంటరిగా 119 స్థానాల్లో వైఎస్సార్టీపీ పోటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడించారు. గురువారం ఇక్కడి లోటస్‌పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను పాలేరుతోపాటు మరో సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. అవసరమైతే తన తల్లి విజయలక్ష్మి, బ్రదర్ అనిల్ కూడా ఎన్నికల్లో నిలబడతారని తెలిపారు. వైఎస్సార్టీపీ తర ఫున పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులు టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని షర్మిల సూచించారు. -
ప్రీ–ఓన్డ్ విభాగంలోకి భారత్ బెంజ్ సర్టిఫైడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాణిజ్య వాహనాల తయారీలో ఉన్న దైమ్లర్ ఇండియా తాజాగా పాత వాహనాల విక్రయాల్లోకి ప్రవేశించింది. భారత్ బెంజ్ సర్టిఫైడ్ పేరుతో కార్యకలాపాలు సాగించనున్నట్టు సోమవారం ప్రకటించింది. ఈ కేంద్రాల్లో భారత్ బెంజ్ ట్రక్కులను పునరుద్ధరించి విక్రయిస్తారు. ప్రతి వాహనానికి 125 రకాల నాణ్యత పరీక్షలు జరిపి, రిపేర్ చేస్తారు. ఆరు నెలల వారంటీ ఉంటుంది. భారత్ బెంజ్ సర్టిఫైడ్ డిజిటల్ వేదికగా క్రయ విక్రయాలను జరుపుతుంది. కంపెనీ తొలుత బెంగళూరులో ఈ సేవలు ప్రారంభించింది. దశలవారీగా ఇతర నగరాలకు విస్తరిస్తారు. కాగా, ఇతర బ్రాండ్లకు చెందిన వాణిజ్య వాహనాలను మార్పిడి చేసుకుని వినియోగదార్లు భారత్ బెంజ్ వాహనాలను కొనుగోలు చేయవచ్చని కంపెనీ తెలిపింది. -
మారుతీ సుజుకీ కొత్త ప్లాన్స్: మారుతీ మిడ్-ఎస్యూవీ
న్యూఢిల్లీ: దేశంలో కంపెనీ మార్కెట్ వాటాను పెంచుకోవడానికి స్పోర్ట్ యుటిలిటీ వెహికిల్స్ (ఎస్యూవీ) విభాగాన్ని కీలకంగా పరిగణిస్తున్నట్టు మారుతీ సుజుకీ వెల్లడించింది. ప్యాసింజర్ వెహికిల్స్ రంగంలో ప్రస్తుతం సంస్థ వాటా 45 శాతంగా ఉంది. దీనిని 50 శాతానికి చేర్చాలన్నది మారుతీ సుజుకీ లక్ష్యం. ‘ఎస్‌యూవీయేతర విభాగంలో కంపెనీ వాటా 65 శాతం పైచిలుకు. ఎస్‌యూవీల్లో అంత పెద్దగా లేదు. దేశంలో అతిపెద్ద, వేగంగా వృద్ధి చెందుతున్న విభాగం ఇది. ఇందులో మారుతీ సుజుకీ తప్పనిసరిగా సుస్థిర స్థానం సంపాదించాలి. ప్రారంభ స్థాయి ఎస్‌యూవీల విపణి వార్షిక పరిమాణం 6.6 లక్షల యూనిట్లు. ఇందులో సంస్థకు 20 శాతం వాటా ఉంది. 5.5 లక్షల యూనిట్ల వార్షిక పరిమాణం ఉన్న మధ్యస్థాయి ఎస్యూవీ విభాగంలో కంపెనీకి ఒక్క మోడల్ కూడా లేదు. ఈ సెగ్మెంట్లోకి ప్రవేశించాల్సిన అవసరం ఉంది. ఈ నెలాఖరులో మిడ్ సైజ్ ఎస్యూవీ ఆవిష్కరించనున్నాం. 4 మీటర్ల లోపు పొడవు ఉండే ఎస్‌యూవీలపైనా దృష్టిసారిస్తాం’ అని మారుతీ సుజుకీ సీనియర్ ఈడీ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. -
మరో రంగంలోకి రిలయన్స్ సునామీ: దిగ్గజాలకు దిగులే!
సాక్షి,ముంబై: రిలయన్స్ జియో పేరుతో టెలికాం రంగంలో సునామీ సృష్టించిన ఆయిల్-టు-టెలికాం దిగ్గజం రిలయన్స్ త్వరలోనే మరో రంగంలో ఎంట్రీ ఇస్తోంది. రిటైల్ విభాగం, రిలయన్స్ రిటైల్ వ్యాపారంలో భారీ వృద్ధి తర్వాత ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఎఫ్ఎంసీజీ) విభాగంలోకి అడుగు పెట్టనునున్నామని రిలయన్స్ మెగా ఈవెంట్లో ప్రకటన వెలువడింది. కంపెనీ 45వ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు. హైక్వాలిటీ, సరసమైన ఉత్పత్తులను అభివృద్ధి, డెలివరీతో పాటు, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఎఫ్ఎంసీజీ విభాగంలో అడుగుపెడుతున్నట్లు తెలిపారు .అలాగే కస్టమర్లకు షాపింగ్ అనుభవాన్ని మెరుగుపర్చే ఉద్దేశంతో 2021లో ప్రారంభించిన WhatsApp-JioMart భాగస్వామ్యం ఎలా పనిచేస్తుందో ప్రదర్శించి చూపించారు. ఇషా అంబానీ ఇంకా ఏమన్నారంటే.. ‘‘డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రతిరోజూ దాదాపు 6లక్షలకు ఆర్డర్లు డెలివరీ చేస్తున్నాం. ఇది గత సంవత్సరం కంటే 2.5 రెట్లు పెరిగింది. 260కి పైగా పట్టణాల్లో డెలివరీ చేస్తున్న జియోమార్ట్ ఆన్లైన్ గ్రోసరీ ఇండియా నంబర్ వన్ విశ్వసనీయ బ్రాండ్‌గా రేట్ సాధించింది. 42 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మా స్టోర్ల సంఖ్యను 15,000కు పైగా పెంచడానికి ఈ ఏడాది 2,500 స్టోర్లను ప్రారంభించాం. స్టోర్ నెట్వర్క్ , మర్చంట్ పార్టనర్ల జోడింపు ద్వారా మరింత మంది కస్టమర్లు మా ఖాతాలో చేరుతున్నారు. రిలయన్స్ రిటైల్ రాబోయే ఐదేళ్లలో 7,500 పట్టణాలు, 3 లక్షల గ్రామాలకు సేవలందించాలనేది మా లక్ష్యం’’ అని ఇషా అంబానీ వెల్లడించారు. ప్రతి భారతీయుడి రోజువారీ అవసరాలను తీర్చే లక్క్ష్యంతో ఈ రంగంలోకి అడుగు పెడుతున్నట్టు ఆమె తెలిపారు. అంతేకాదు భారతదేశం అంతటా గిరిజనులు, ఇతర అణగారిన వర్గాలు ఉత్పత్తి చేసే నాణ్యమైన వస్తువుల మార్కెటింగ్ త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. తద్వారా ఆయా కమ్యూనిటీలకు ఉపాధి, వ్యవస్థాపకత కోసం లాభదాయకమైన అవకాశాలను అందించడమే కాకుండా, సాంప్రదాయ భారతీయ కళాకారులు, ముఖ్యంగా మహిళల అద్భుతమైన ప్రతిభ, నైపుణ్యం, వారి క్రియేటివిటీని సంరక్షించడంలో సహాయపడుతుందని భావిస్తున్నామన్నారు. తద్వారా రిలయన్స్ రిటైల్ హిందుస్తాన్ యూనిలీవర్, నెస్లే బ్రిటానియా వంటి ఎఫ్ఎంసిజి దిగ్గజాలకు గట్టి షాకే ఇవ్వనుంది. చదవండి: Reliance Industries AGM: జియో 5జీ కోసం 2 లక్షల కోట్ల పెట్టుబడి 'అల్ట్రా-అఫర్డబుల్' 5జీ స్మార్ట్‌ఫోన్ త్వరలో: ముఖేశ్ అంబానీ -
‘తాండవ’ ఎన్నికలు నేడు
నలుగురు డెరైక్టర్లు ఏకగ్రీవం 11 సెగ్మెంట్లకు పోటీ పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి ఉదయం 7 గంటల నుంచి 2 గంటల వరకు పోలింగ్ సాయంత్రం ఓట్ల లెక్కింపు పాయకరావుపేట: తాండవ చక్కెర కర్మాగారం పాలక వర్గం ఎన్నికలు మంగళవారం నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫ్యాక్టరీ పరిధిలో 15 డెరైక్టర్ స్థానాలు ఉన్నాయి. వీటిలో నాలుగు ఏకగ్రీవమయ్యాయి. కొడవటిపూడి సెగ్మెంట్‌కు ఆనాల సత్యనారాయణ, డి.పోలవరం సెగ్మెంట్‌కు సుర్లలోవరాజు, చినబొడ్డేపల్లికి అల్లూరి సూర్యనారాయణరాజు,ఎస్ఆర్పేటకు లాలం బాబ్జీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 11నియోజకవర్గాల డెరైక్టర్ పదవులకు 23 మంది బరిలో ఉన్నారు. పాయకరావుపేట సెగ్మెంట్‌కు కంద నూకరాజు,నాగం వెంకటవాసు దొరప్ప,పెదరామభద్రపురానికి మందపాటి శ్రీనివాసరాజు, చెక్కల వెంకటరమణ,గిడజాంకు కాట్రెడ్డి రాంబాబు,బలిజ సత్యన్నారాయణ, పి.రామకృష్ణ, కోటేశ్వరరావు,సుబద్రయ్యమ్మపేటకు బి. నాగేశ్వరరావు, వేగి తులసీరావు, ఎన్.ఎస్. వెంకటనగరానికి చిట్టుమూరి సత్యన్నారాయణ,మోర్త కృష్ణ,పి.కొట్టాంకు తోలెం రాజులు, సాలాది దేముడు, గుమ్మిడిగొండకు కురపల్లి పోతురాజు, రేగాటి సత్తి బాబు, నర్సీపట్నానికి కలిమి శ్రీను, కె,కన్నయ్యనాయుడు, కోటనందూరుకు కె.నాగేశ్వరరావు,జి. జగ్గునాయుడు, బొద్దవరానికి యల్లపు రమణ,వేగి గౌరినాయుడు, వర్క్‌మెన్ గ్రూపు నుంచి కర్రి వెంకటేశ్వరరావు, కొల్లు సురేంద్ర కుమార్ డైరక్టర్ల పదవులకు పోటీ పడుతున్నారు. పోలింగ్ కేంద్రాలివే.... 11సెగ్మెంట్ల డెరైక్టర్ల ఎన్నికకు 4వేల మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి బి. మోషా తెలిపారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను ప్యాక్టరీ ఆవరణకు తరలించాక లెక్కింపు చేపడతారు.