ఖమ్మంలో జరిగిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి అజయ్
ఖమ్మం మయూరిసెంటర్: కొందరికి పదవులు రాలేదనో, రావనో లేక ఇతర కారణాలో తెలియదు కానీ.. ఖమ్మంలో బీజేపీని పుట్టించాలని చూస్తున్నా రని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మంలోని షాదీఖానాలో సోమవారం ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మాట్లాడారు. ‘మత తత్వ పార్టీలకు ఖమ్మం వేదిక కాదని గుర్తుపెట్టుకోండి.. తస్మాత్ జాగ్రత్త’ అని సూచించారు.
ప్రభుత్వంలో ఇద్దరు ముస్లింలు మంత్రులుగా ఉంటే అందులో ఒకరు మహమూద్ అలీ, రెండో వ్యక్తి అజయ్‌ఖాన్ అని పేర్కొన్నారు. తనకు ఆత్మీయు లైన ముస్లిం మైనార్టీలతో మొదటి ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు పువ్వాడ తెలిపారు. కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చిన తాను ఇప్పటి మాదిరిగానే భవిష్యత్‌లోనూ ముస్లింలకు అండగా నిలబడతానని వెల్లడించారు. మతతత్వ శక్తులపట్ల ముస్లిం యువత అప్రమత్తంగా ఉంటూ బీఆర్‌ఎస్ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టేందుకు కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
గతంలో ఎక్కువ శాతం మైనార్టీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినా, తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్‌ఎస్‌ను నమ్ముతున్నారన్నారు. సెక్యులరిజాన్ని కాపాడేది బీఆర్‌ఎస్ మాత్రమేనని నమ్మిన ముస్లిం మైనారిటీలు ఈ పార్టీని వదులుకునేందుకు సిద్ధంగా లేరని తెలిపారు. ఖమ్మంలో ఇంత అభివృద్ధి, పేదలకు సంక్షేమ పథకాలు అందడానికి తనకు వ్యక్తిగతంగా సాధ్యం కాలేదని, ప్రభుత్వం వల్లే ఇంత చేయగలిగామని తెలిపారు. వేలాది మంది కార్యకర్తలు ఉండగా, అందరికీ పదవులు ఇవ్వలేమని.. పది, పదిహేను మందికే ఇవ్వగలమన్నారు. చాలామందికి పదవులు రాకపోయినా బాధ్యతతో వ్యవహరిస్తుండగా... కొందరికి పదవులు వచ్చినా కడుపునొప్పి ఎందుకో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment