అంధత్వం అభివృద్ధికి ఆటకం కాదని పలువురు నేత్రహీనులు నిరూపించిన ఉదంతాలను మనం చూస్తుంటాం. ఇప్పుడు ఇదేకోవలో ఒక యువతి తన అంధత్వలోపాన్ని అధిగమించి అందరిచేత శభాష్ అని అనిపించుకుంటోంది. వివరాల్లోకి వెళితే ఛత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ పరిధిలోగల గుడియాపరిలోని జనతాకాలనీకి చెందిన అంధురాలు దేవశ్రీ భోయర్ పీహెచ్‌డీ పట్టాను అందుకుంది. దేవశ్రీ ఈ డిగ్రీ అందుకోవడం వెనుక ఆమె తండ్రి అమెఘ కృషి దాగుంది.
కుమార్తె థీసెస్ రాయడంలో తండ్రి ఎంతగానో సహకరించారు. దీంతో దేవశ్రీ తాను సాధించిన విజయాన్ని తన తల్లిదండ్రులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించింది. ‘అమ్మానాన్నా నాలో నమ్మకాన్ని మరింతగా పెంపొందించారు. నాకు ఎంతో ధైర్యాన్ని కూడా ఇచ్చారు. వారి సాయంతోనే నేను ఈ విజయాన్ని సాధించాను’ అని ఆమె తెలిపింది. పుట్టుకతోనే అంధురాలైన దేవశ్రీ పండిట్ రవిశంకర్ శుక్లా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టాను అందుకుంది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ‘మా నాన్న ఒక చిన్న దుకాణం నడుపుతున్నారు. ఒక చిన్న ఇంటిలో మేము ఉంటున్నాం. ఆ దుకాణం ద్వారా వచ్చే ఆదాయంతోనే మా కుటుంబ సభ్యుల పోషణ జరుగుతుంది. మా నాన్న దుకాణం నడుపుతూనే, నాకు చదువులో సహకారం అందిస్తుంటారు.
ఒక్కోసారి ఏకంగా 10 గంటల పాటు నా దగ్గర కూర్చుని చదివించిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రోజు నేను పీహెచ్‌డీ పట్టా అందుకున్నానంటే అందుకు మా నాన్న సహకారమే కీలకం అని చెప్పగలను. నేను నేత్రహీనురాలిని అయినందున ప్రపంచాన్ని విభిన్నంగా చూడగలను. ఇదే నన్ను పీహెచ్‌డీ చేసేందుకు పురిగొల్పింది. దీనికితోడు మా నాన్న అందించిన సహకారం మరువలేనిది. నా కోసం రాత్రివేళ మేల్కొని థీసెస్ రాసేవారు. ఆయన ఎంత అలసిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ నా థీసెస్‌లో ఎంతో సహకారం అందించారు’ అని దేవశ్రీ తెలిపింది.
దేవశ్రీ తండ్రి గోపీచంద్ భోయర్ యూనివర్శిటీ నుంచి అనుమతి తీసుకుని కుమార్తెకు థీసెస్ రాయడంలో సహకారం అందించారు. ఆయన కేవలం 10వ తరగతి వరకే చదువుకున్నప్పటికీ తన కుమార్తెకు పీహెచ్‌డీ థీసెస్ రాయడంలో సహకారం అందించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment